నగరంలో 5 ప్రధాన రోడ్ల విస్తరణ
గ్రేటర్ వరంగల్ మహానగర అభివృద్ధి సమీక్షలో నిర్ణయం
నయీంనగర్: నగరంలో పెరుగుతున్న రవాణా రద్దీకి అనుగుణంగా 5 ప్రధాన రోడ్లను విస్తరించాలని నిర్ణయించారు. ఈమేరకు సోమవారం ‘కుడా’ కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ మహానగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, ‘కుడా’ వైస్ చైర్‌పర్సన్, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనుల్ని వేగవంతం చేయాలని, వచ్చే వర్షాకాలం నాటికి చెరువు నీటితో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పూడికలో వస్తున్న మట్టిని వ్యవసాయ ఆధారిత రైతులకు అందేలా చూడాలని, పునరుద్ధరణ పనుల్లో నిధుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద తొలుత ఎంజీఎం నుంచి పోలీస్ హెడ్‌క్వార్టర్ వరకు రోడ్డు విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని, నగర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్‌కి అనుగుణంగా చర్యలు ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో, రోడ్లపై ట్రాఫిక్ అంతరాయాలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం చిరు వ్యాపారులను రూ.9.40 కోట్లతో నిర్మించిన వెజ్– నాన్ వెజ్ మార్కెట్లలో వ్యాపారం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతికి రెండు పడకల ఇళ్లను ఇచ్చే విధంగా 26 డివిజన్‌లకు ప్రత్యేక అధికారులను నియమించి నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే నాయిని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్, ఇరిగేషన్, కుడా, రోడ్లు –భవనాల శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆ ఐదు రోడ్లు ఇవే..
సీపీఓ కార్యాలయం నుంచి ఎంజీఎం
అంబేడ్కర్ జంక్షన్ నుంచి
ఎన్‌జీఓస్ కాలనీ
హనుమాన్ దేవాలయం నుంచి
అలంకార్ జంక్షన్
కాంగ్రెస్ భవన్ నుంచి కేయూసీ రోడ్
కాజీపేట జంక్షన్ నుంచి సోమిడి రోడ్డు.
ఆయా రోడ్ల విస్తరణకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని
నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment