సర్వేకు రైతులు సహకరించాలి
కలెక్టర్ ప్రావీణ్య
ధర్మసాగర్: ఇనుపరాతి గుట్టల్లో ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా చేపడుతున్న భూముల సర్వేకు సహకరించాలని రైతులకు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. మండలంలోని ముప్పారం, దేవునూరు గ్రామాల శివారులోని ఇనుపరాతి గుట్టలను బుధవారం కలెక్టర్ సందర్శించారు. ఇటీవల ఇనుపరాతి గుట్టల్లోని ఫారెస్ట్ భూములను, ప్రభుత్వ భూములను, రైతుల పట్టా భూములను జిల్లా సర్వే డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సర్వేను రైతులు అడ్డుకున్నారు. ఈవిషయం బుధవారం కలెక్టర్ ప్రావీణ్య స్థానిక రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తమ పట్టా భూములను సర్వే చేస్తూ తమ స్వంత భూముల్లో (ఫెన్సింగ్) పోల్స్ నాటుతున్నారని, కొన్నేళ్లుగా ఆ భూములను తమ తాతలు, తండ్రుల నాటి నుంచి సాగు చేసుకుని బతుకుతున్నామని రైతులు కలెక్టర్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల పట్టా భూముల జోలికి అధికారులు రారని.. సర్వేను అడ్డుకోవడం సరికాదన్నారు. మొత్తం భూములను సర్వే చేపట్టి ఫారెస్ట్, ప్రభుత్వ భూములను, రైతుల భూములను గుర్తించి హద్దులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సర్వేకు రైతులు సహకరించాలని రైతులకు సూచించారు.
మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాట్ల పరిశీలన
మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం నారాయణగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల ఎంఓఎంబీ పనుల్ని పరిశీలించారు. నారాయణగిరి రోడ్డులో ఉన్న రైస్ మిల్లును సందర్శించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఫారెస్ట్ అధికారి భిక్షపతి, డీపీఎం జన్ను ప్రకాశ్, ఎంఈఓ రాంధన్, ఎంపీఓ అఫ్జల్, ఏపీఓ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment