పారదర్శకంగా సర్వే చేయాలి : జెడ్పీ సీఈఓ
సంగెం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన మొబైల్ యాప్ సర్వేను పారదర్శకంగా చేయాలని జెడ్పీ సీఈఓ, ఇందిరమ్మ ఇళ్ల జిల్లా నోడల్ అధికారి రాంరెడ్డి అన్నారు. ఆశాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ సర్వే ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రోజుకు ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు అని సర్వే చేస్తున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏంపీఓ కొమురయ్య, ఎన్యుమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాస్థాయి
బాస్కెట్‌బాల్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లాస్థాయి సీఎం కప్ బాస్కెట్‌బాల్ ఎంపిక పోటీలు శనివారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగాయి. అండర్–23 బాలబాలికల విభాగంలో నిర్వహించిన ఎంపికలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 50 మంది క్రీడాకారులు హాజరైనట్లు కోచ్ ప్రశాంత్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు సరూర్‌నగర్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
నల్లబెల్లం, పటిక పట్టివేత
నెక్కొండ: నిషేధిత నల్లబెల్లం, పటికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు, నెక్కొండ పోలీసులు సంయుక్తంగా నిఘా పెట్టారు. మండల కేంద్రంలో శనివారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తుల వద్ద పెద్ద సంచులు కనిపించాయి. దీంతో పోలీసులు సోదాలు చేసి రూ.1.82 లక్షల విలువైన 10.80 క్వింటాళ్ల నల్లబెల్లం, 2 క్వింటాళ్ల పటికను, 2 సెల్‌ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బెల్లం, పటికను రవాణా చేస్తున్న మండలంలోని నక్కలగుట్ట తండా జీపీకి చెందిన కొర్ర శ్రీను, కొర్ర మాలు, ఆంగోత్ లాలి, కొర్ర భద్రమ్మపై కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, సీఐ రాజ్, ఎస్సై భానుప్రకాశ్‌ను సీపీ అభినందించారు.
ధాన్యం కొనుగోళ్లలో
అలసత్వం వద్దు
నర్సంపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆమె నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం, సివిల్ సప్లయీస్ గోదాంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అలసత్వం వహించవద్దని సూచించారు. అదేవిధంగా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్‌లో ఆమె క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మండల స్పెషల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.రమేశ్, తహసీల్దార్ విశ్వప్రసాద్, మార్కెట్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment