భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలగొద్దు
ఎల్కతుర్తి: కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య.. ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 10నుంచి ప్రారంభమయ్యే జాతరకు పోలీసు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, విద్యుత్, దేవాదాయ, పర్యాటక తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉత్సవాలను విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాట్లు, వీఐపీ పాస్‌లు, బారికేడ్లు, విద్యుత్, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్యం, శానిటేషన్, ఫైర్ సేఫ్టీ అధికారులతో చర్చించారు. భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. రోడ్ల మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు పటిష్ట బందోబస్తు చేపట్టాలన్నారు. ఆలయం లోపల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ ఈఓ కిషన్‌రావును ఆమె ఆదేశించారు. అంతకు ముందు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన కలెక్టర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రమేష్, కాజీపేట ఏసీపీ తిరుమల్, డీఏంహెచ్‌ఓ అప్పయ్య, చంద్రశేఖర్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
జంక్షన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
ఎల్కతుర్తిలో చేపట్టిన జంక్షన్ పనులను మంగళవారం కుడా వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలించారు. రోడ్లకు ఇరువైపులా మార్కింగ్ చేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి సమయంలో ట్రాఫిక్ ఇబ్బందీ లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసుఅధికారులకు సూచించారు. కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు, తహసీల్దార్ జగత్‌సింగ్, ఎంపీడీఓ విజయ్‌కుమార్, పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
సీఎం కప్ క్రీడలకు ఏర్పాట్లు చేయాలి
హన్మకొండ అర్బన్ : సీఎం కప్ క్రీడాపోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డితో కలిసి క్రీడల నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 27నుంచి జనవరి 2వ తేదీ వరకు హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీవైఎస్‌ఓ అశోక్, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, అధికారులు పాల్గొన్నారు.
ఉత్సావాలు ఐక్యతను పెంపొందిస్తాయి
ఉత్సవాలు ఉద్యోగుల్లో ఐక్యతను పెంపొందిస్తాయని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని కేక్ కట్ చేశారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ గణేష్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
కొత్తకొండ జాతరపై సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment