No Headline
హన్మకొండ/హన్మకొండ అర్బన్: ప్రపంచ దేశాలు మన రాజ్యాంగాన్ని ప్రశంసిస్తుంటే, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించారని, ఇది దుశ్చర్య అని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ను అవమానించేలా మాట్లాడిన అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కే.ఆర్.నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి, తదితర నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి అమిత్ షాను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మతతత్వ రాజకీయాలు చేసే బీజేపీకి అంబేడ్కర్ లాంటి మహోన్నత వ్యక్తి దేశానికి చేసిన సేవ గురించి తెలియదన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్ ప్రావీణ్యకు వారు వినతిపత్రం అందజేశారు.
మీడియా దృష్టిని ఆకర్షించేందుకు హరీశ్‌రరావు పర్యటన
ఇటీవల జిల్లాకు ఓ శుభకార్య నిమిత్తం వచ్చి హరీశ్‌రావు మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేశారని వారు విమర్శించారు. ఆస్పత్రి నిర్మాణం పేరుతో భూమి పేపర్ తాకట్టు పెట్టి రూ.1,400 కోట్లను మహారాష్ట్ర బ్యాంకు నుంచి రుణం తీసుకొని కమీషన్లు పొందిన వ్యక్తి హరీశ్‌రావు అని ఆరోపించారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, ఈవీ శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మొహమ్మద్ అజీజ్ ఖాన్, టీపీసీసీ నాయకులు రవళి, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లక్ష్మణ్, ఆనంద్, మిర్జా అజీజ్జుల్లా బేగ్, సరళ, పింగిలి వెంకట్రాం నర్సింహారెడ్డి, పెరుమాండ్ల రామకృష్ణ, అనిల్ కుమార్, వెంకట రాజ్ కుమార్, అశోక్ రెడ్డి, రవీందర్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment