ఈవీ.. చార్జీల బాదుడు!
హన్మకొండ: వరంగల్ రీజియన్‌ను వేధిస్తున్న బస్సుల కొరత సమస్య ఎలక్ట్రిక్ బస్సులు రావడంతో తీరింది. కానీ, ఎలక్ట్రిక్ బస్సు చార్జీలు ప్రయాణికులకు భారంగా పరిణమించాయి. డీజిల్ బస్సులతో పోల్చితే రూ.10 నుంచి రూ.20 అదనపు చార్జీల వసూలు చేస్తున్నారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులకు ప్రభుత్వం పన్నుల మినహాయింపు ఇచ్చినా చార్జీల భారం మోపడమేమిటని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. రీజియన్‌లో కాలం చెల్లిన బస్సులను తొలగించడంతో పాటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో కొత్త బస్సుల కేటాయింపులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచింది. దీంతో వరంగల్ రీజియన్‌లో బస్‌ల కొరత తీరింది. రీజియన్‌కు కేటాయించిన 112 బస్సుల్లో ఇప్పటి వరకు 75 బస్సులు చేరుకున్నాయి. మొత్తం 112 బస్సుల్లో 19 సూపర్ లగ్జరీ బస్సులు, 18 డీలక్స్ బస్సులు, 75 ఎక్స్‌ప్రెస్ బస్సులు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 75 బస్సులు వచ్చాయి. ఇందులో 19 సూపర్ లగ్జరీ, 16 డీలక్స్ బస్సులు, 40 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. జేబీఎం సంస్థ నిర్వహణలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తాయి. ప్రస్తుతం హనుమకొండ, హైదరాబాద్ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నారు. ఈవీ బస్సుల రాకతో సంక్రాంతికి బస్సుల కొరత ఇబ్బంది తొలగింది. డీజిల్ బస్సులను మించి అదనపు చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు భగ్గుమంటున్నారు. సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు నాన్‌స్టాప్ సర్వీస్‌లుగా నడుస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ బస్సు జనగామ బస్ స్టేషన్ ద్వారా నడుస్తోంది.
గ్రీన్‌టాక్స్ పేరుతో అదనపు బాదుడు..
రీజియన్‌లో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల చార్జీలను గ్రీన్‌టాక్స్ పేరుతో రూ.10నుంచి రూ.20 వరకు పెంచారు. ఈవీలకు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వడం ద్వారా ఆర్టీసీకి నిర్వహణ భారం తగ్గుతుంది. ఈ క్రమంలో అదనపు చార్జీలు వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
డీజిల్, ఎలక్ట్రిక్ బస్సు చార్జీల్లో తేడా ఇలా.. (రూ.లలో)
గ్రీన్‌టాక్స్ పేరుతో ప్రయాణికులపై
అదనపు భారం
డీజిల్ బస్‌ల కంటే
అధిక చార్జీల వసూళ్లు
ఈవీ బస్సులకు పన్నులు
మినహాయింపు ఇచ్చినా తప్పని భారం
హనుమకొండ టు ఉప్పల్
బస్సు సర్వీసు డీజిల్ ఎలక్ట్రిక్
సూపర్ లగ్జరీ 300 320
డీలక్స్ 260 280
ఎక్స్‌ప్రెస్ 200 210
హనుమకొండ టు జనగామ
ఎక్స్‌ప్రెస్ 90 100
డీలక్స్ 110 130
జనగామ టు ఉప్పల్
డీలక్స్ 160 180
సూపర్ లగ్జరీకి అదనంగా రూ.20, ఎక్స్‌ప్రెస్ బస్సుకు అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment