మొదలైంది జోరు
మంగళవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2025
‘పంచాయతీ’ పోరు..
● పల్లెల్లో ఊపందుకున్న ఎన్నికల సందడి
● బ్యాలెట్, గుర్తులపై స్పష్టత..
ముద్రణపై యంత్రాంగం కసరత్తు
● దూకుడు పెంచిన
రాష్ట్ర ఎన్నికల సంఘం
● ఎన్నికల ఎత్తుగడల్లో
ప్రధాన రాజకీయ పార్టీలు
● ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల చుట్టూ
ఆశావహుల చక్కర్లు
సాక్షిప్రతినిధి, వరంగల్ :
వార్డు సభ్యులు, సర్పంచ్ ఎన్నికల ఏర్పాట్లపై కొద్ది రోజులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడు పెంచింది. దీంతో రెండు, మూడు మాసాల్లో ఎప్పుడైనా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్‌ల ఎన్నికలు ఉండవచ్చని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో ఈనెల 26 నుంచి పథకాల పండుగకు శ్రీకారం చుడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ కేడర్‌కు ఎన్నికలపై ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ కేడర్ పథకాలను పల్లెల్లో ప్రచారం చేస్తుండగా.. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైతం పల్లెబాట పడుతుండడంతో గ్రామాల్లో ‘పంచాయతీ’ సందడి జోరందుకుంది.
గుర్తులపై ఈసీ స్పష్టత...
ముద్రణలో బ్యాలెట్ పత్రాలు..
2024 సెప్టెంబర్ 28న వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల సంఘం.. ఇటీవల బ్యాలెట్ పత్రాల రంగు, గుర్తులపై స్పష్టత ఇచ్చింది. ఈనేపథ్యంలో అధికారులు జిల్లాల వారీగా బ్యాలెట్ పత్రాల ముద్రణపై దృష్టి సారించడంతో ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఏప్రిల్ వరకు ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చన్న ప్రచారం జోరందుకుంది. సర్పంచ్ ఎన్నికలు నిర్వహణకు నోటాతోపాటు 30 గుర్తులు కేటాయించారని, మొత్తం 31 గుర్తులతో బ్యాలెట్ పేపర్ ముద్రించనున్నామని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ డీపీఓ తెలిపారు. 30 కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే ప్రత్యేకంగా మరో బ్యాలెట్ పేపర్ ముద్రించే అవకాశాలు ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా సర్పంచ్, వార్డు సభ్యులకు వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు ఉండనుండగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను ప్రకటించినట్లు అధికారులు చెబుతున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, ఫుట్ బాల్, బ్యాట్, బ్యాడ్మింటన్, స్టంప్స్, లేడీస్ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, చెత్త డబ్బా, బెండకాయ, కొబ్బరిచెట్టు, వజ్రం, నల్ల బోర్డు, బకెట్, డోర్ హ్యాండిల్, చేతికర్ర, మంచం, బిస్కెట్, వేణువు, జల్లెడ, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, పడవ, చైన్, చెప్పులు, గాలిబుడగ గుర్తులను ప్రకటించారు. వార్డు సభ్యులకు పొయ్యి, స్టూల్, బీరువా, గ్యాస్ సిలిండర్, గౌను, ఈల, కుండ, మూకుడు, డిష్ యాంటీనా, ఐస్క్రీమ్, గాజు, గ్లాస్, పోస్ట్ డబ్బా, కవర్, హాకీ స్టిక్, కర్రబంతి, విద్యుత్ స్తంభం, షటిల్ వంటి గుర్తులను కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇప్పటికే ఓటర్ల జాబితా.. మహిళలే అధికం
2011 జనాభాను పరిగణనలోకి తీసుకొని వార్డుల సంఖ్యను నిర్ధారించారు. మొత్తం 71 మండలాల్లో 1,705 గ్రామ పంచాయతీలు, 15,046 వార్డులున్నాయి. గ్రామంలో ఉన్న ఓటర్ల సంఖ్య, అన్ని వార్డుల్లో సమానంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు 2024 సెప్టెంబర్ 28న వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఉమ్మడి వరంగల్‌లో ఓటర్ల సంఖ్య 22,45,394లకు చేరింది.
న్యూస్‌రీల్
ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీలు 1,705
పల్లెల్లో ఊపందుకున్న సందడి.. పోటీకి ప్రధాన పార్టీల్లో పైరవీలు
ఫిబ్రవరి – ఏప్రిల్ మాసాల మధ్య పంచాయతీ ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో పల్లె పోరు సందడి జోరందుకుంది. ఈనెల 26న రేషన్ కార్డులు, రైతు భరోసా తదితర పథకాల పంపిణీని కాంగ్రెస్ పార్టీ పండుగలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎ న్నికలకు వెళ్లే ప్రయత్నంలో కేడర్‌ను అప్రమత్తం చేస్తోంది. కీలక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్న బీఆర్‌ఎస్ సైతం పల్లెపోరుకు శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప థకాలతో బీజేపీ పల్లెల్లోకి వెళ్తోంది. పంచాయతీ ఎన్నికల పోరుపై రోజు రోజుకూ ప్రచారం పెరుగుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు.
మహిళలు
11,42,514
పురుషులు
11,02,801
మొత్తం ఓటర్లు
22,45,394
ఇతరులు
79
Comments
Please login to add a commentAdd a comment