ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేస్తున్న ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజల ఆరోగ్యానికి రక్షణ అని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక వీకర్స్ కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్షను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో ఆరోగ్యశ్రీలో రూ. 5 లక్షల వైద్యం అందించేవారని, ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డులు అందించి వాటి ద్వారా రూ. 25 లక్షల వరకు అవసరమయ్యే వైద్య సేవలను ఉచితంగా ఆరోగ్యశ్రీపరిధిలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందజేస్తున్నారన్నారు. దానికి తగినట్టుగానే పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. దీర్ఘకాల వ్యాఽధిగ్రస్తులకు అవసరమైన మందులను ప్రతీ నెలా ఉచితంగా అందచేస్తున్నామన్నారు. ఆరోగ్య సురక్ష ప్రతి బుధవారం ఒక్కో వార్డులో నిర్వహిస్తారన్నారు. దీనిని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. వైద్యచికిత్స అవసరమైన వారు ముందుగా తమ వార్డు వలంటీర్లు వద్ద పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకానికి ఆయన తనయుడు జగన్‌మోహనరెడ్డి మరింత వన్నె తెచ్చారన్నారు. 108 వాహనాలను వైఎస్సార్ ప్రవేశపెడితే తెదేపా ప్రభుత్వంలో కనీసం పెట్రోలు బకాయిలు కూడా చెల్లించకుండా 108 వాహనాలను నిర్జీవం చేశారన్నారు. ఆరోగ్య శ్రీ కార్డులను 1, 2 వార్డుల ప్రజలకు మంత్రి కొట్టు చేతుల మీదుగా అందచేశారు. ఆర్‌డీఓ, ప్రత్యేక అధికారి చెన్నయ్య మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా ప్రతి వాలంటీరు, సచివాలయ సిబ్బంది, ఎఏన్‌ఎం, వైద్యులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. వైద్యుడు రవికుమార్ ఆరోగ్య సురక్ష శిబిరాల్లో అందచేస్తున్న సేవల వివరాలను తెలిపారు. కార్యక్రమంలో మునిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి సా మ్యూల్, నాయకులు శీలి మేరీకుమారి, బోళెం రామలక్ష్మి, పత్మట్ల సావిత్రి, గుండుబోగుల నాగు, కర్రి భాస్కరరావు, కొలుకులూరి ధర్మరాజు, కర్నాటి కన్నయ్య, కోడే శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment