బుట్టాయగూడెం సమీపంలో వేసిన పొగాకు పంట
బుట్టాయగూడెం: ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో వర్జీనియా పొగాకు సాగు ముమ్మరంగా సాగుతుంది. ఈ ఏడాది రైతులు వేసిన పంటలు మిచాంగ్ తుపాను కారణంగా కొంతమేర దెబ్బతింది. అయినప్పటికీ రైతులు మళ్లీ పంటలను వేశారు. అక్టోబర్‌లో వేసిన తోటలు పలుచోట్ల పక్వానికి రావడంతో రైతులు ఆకులు రెలిచి క్యూరింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం పొగాకు పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా వరి, మొక్కజొన్న, చెరుకు తర్వాత అత్యధికంగా వర్జీనియా పంటల్ని రైతులు పండిస్తున్నారు. గత రెండేళ్లుగా పొగాకు పంటకు ధర అధికంగా ఉండడంతో ఈ ఏడాది అనేక మంది రైతులు కౌలుకు తీసుకుని మరీ పొగాకు వేశారు. ఏజెన్సీ మెట్టప్రాంతాల్లో ఉత్తర తేలిక నేలలో(ఎన్‌ఎల్‌ఎస్) పొగాకు సాగు చేస్తున్నారు. ఇక్కడ పంటకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అమెరికా, రష్యా, జింబాబ్వే, బ్రెజిల్ వంటి దేశాల్లో పండిస్తున్న పంటకు దీటుగా ఈ ప్రాంత రైతులు పొగాకు పండిస్తున్నారు. అక్టోబర్ నుంచి మార్చి వరకూ పొగాకు సీజన్.. పండించిన పొగాకును ఆకులు రెల్చి క్యూరింగ్ చేసి బేళ్లుగా కట్టి గ్రేడ్ చేసి వేలం కేంద్రాల్లో విక్రయిస్తారు. మార్చి నుంచి సెప్టెంబర్ వరకూ పొగాకు కొనుగోళ్లు జరుగుతాయి.
55 వేల ఎకరాల్లో వర్జీనియా సాగు
ఈ ఏడాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 49 మిలియన్ల కిలోల ఉత్పత్తికి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. సుమారు 55 వేల ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 68 మిలియన్ల కిలోల వరకూ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని 14,097 మంది రైతులు 12,235 బ్యారన్‌లు రిజిస్ట్రేషన్ చేసుకుని పొగాకు సాగు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రం పరిధిలో 2,877 మంది రైతులు 2,407 బ్యారన్‌లు రిజిస్ట్రేషన్ చేసుకుని సుమారు 4,490 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం–2లో 2,760 మంది రైతులు 2,608 బ్యారన్‌ల పరిధిలో సుమారు 4,335 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్నారు. కొయ్యలగూడెంలో 2,892 మంది రైతులు 2,539 బ్యారన్‌ల పరిధిలో 4,443 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్నారు.
ఆశాజనకంగా పొగాకు తోటలు
పలు చోట్ల ప్రారంభమైన క్యూరింగ్ పనులు
ఆశాజనకంగా పంట
పలు గ్రామాల్లో ముందుగా వేసిన పొగాకు తోటల రెల్పులు, క్యూరింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది 55 వేల ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను తిరిగి వేశారు. తోటల ఎదుగుదల బాగుంది. పరిమితికి లోబడి పంట వేసి అధిక దిగుబడులు సాధిస్తే సాగు లాభసాటిగా ఉంటుంది.
ఎం.ఆదిశేషయ్య, పొగాకు బోర్డు ఆర్‌ఎం, రాజమండ్రి
Comments
Please login to add a commentAdd a comment