ఉండి: ఉండి మండలం యండగండికి చెందిన తులసి అనే మహిళ ఇంటికి పార్శిల్‌లో వచ్చిన మృతదేహం గుర్తింపులో పోలీసులు తలమునకలయ్యారు. ఆ శవం ఎవరిది? ఎవరు పంపారు.. యండగండిలో తులసి ఇంటికి ఆ బాక్స్‌ను ఎందుకు పంపారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఆ విషయాన్ని మాత్రం పోలీసులు ఇంకా ధృవీకరించడం లేదు. గురువారం సాయంత్రం ఓ కారులో చెక్కపెట్టెతో పాటు ఒక మహిళను సమీప గ్రామమైన ఉణుదుర్రు పరిధిలో రోడ్డుపై దింపినట్లు సమాచారం. అక్కడ నుంచి ఆ మహిళ రోడ్డుపై వెళ్లే ఆటోను మాట్లాడి యండగండి రాయపేటలోని ముదునూరి రంగరాజు ఇంటికి పార్శిల్‌ను చేర్చింది. ఆ మహిళ ఎవరు? ఆమెను, శవంతో ఉన్న చెక్కపెట్టెను కారులో దించింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రికి ఉన్న సుమారు మూడున్నర ఎకరాల పొలం కోసం అక్కాచెల్లెళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
అనుమానితుడి ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు
చిన్న కుమార్తె భర్తగా చెబుతున్న వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి అతని ఆచూకీ లేకపోవడంతో అతనిపై నిఘా ఉంచారు. చిన్న కుమార్తె భర్త స్వస్థలం మొగల్తూరు అని చెప్పగా.. పోలీసుల విచారణలో మాత్రం అతని స్వగ్రామం కాళ్ళ మండలం ఇస్కోలులంక అని తెలిసింది. తనకు వివాహం కాలేదని చెప్పి రంగరాజు చిన్నకుమార్తెతో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. అతనికి అంతకముందే వివాహమైనట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. అతని ఆచూకీ లభించకపోవడంతో అతని తల్లిదండ్రులను దర్యాప్తు కోసం పిలిపించినట్లు సమాచారం. అనుమానితుడి ఫోన్ కాల్ చివరి సిగ్నల్ తెలంగాణా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండటంతో పోలీసులు అటువైపు దృష్టి సారించారు. శనివారానికి అనుమానితుడి సిగ్నల్ సమీపంలోని జిల్లాలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక చెక్కపెట్టెలో పార్శిల్‌గా వచ్చిన మృతదేహానికి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. 32 నుంచి 35 ఏళ్ల వయసున్న వ్యక్తిని సుమారు 3 రోజుల క్రితం ప్లాస్టిక్ తాడుతో ఉరివేసి చంపినట్లు తెలుస్తుంది. మూడు రోజుల క్రితమే శవాన్ని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి పార్శిల్ చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఆస్తి కోసం అక్కాచెల్లెళ్ల గొడవలపై పోలీసుల దృష్టి
Comments
Please login to add a commentAdd a comment