బేరాల్లేవు..!
క్రిస్మస్.. న్యూ ఇయర్.. సంక్రాంతి వినియోగదారులతో నెల రోజుల పాటు కళకళలాడే మార్కెట్లలో ఈ ఏడాది పండుగ జోష్ కనిపించడం లేదు. ఇప్పటికే క్రిస్మస్ సేల్స్ సగానికి పైగా పడిపోగా కొత్త ఏడాది అమ్మకాలకూ అదే పరిస్థితి. భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నా అమ్మకాలు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. గతంలో ఎన్నడూ ఇంతటి గడ్డు పరిస్థితి చూడలేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. – సాక్షి, భీమవరం
●
గడ్డు పరిస్థితులు
గత పదేళ్లుగా రెడీమేడ్ వ్యాపారం చేస్తున్నాను. కోవిడ్ సమయంలో కూడా ఇంత గడ్డు పరిస్థితిని చూడలేదు. ఈ ఏడాది పండుగ సీజన్‌లోనూ అమ్మకాలు లేక మార్కెట్ చాలా డల్‌గా ఉంటోంది.
– జల్లూరి జగదీష్, రెడీమేడ్ వ్యాపారి, తణుకు
చిరు వ్యాపారులకు ఇబ్బంది
వ్యాపారాలు సాగక చిన్న వ్యాపారులు ఇబ్బంది పడు తున్నారు. ధరలు పెరిగిపోవడం, ఆన్‌లైన్ వ్యాపారం బాగా దెబ్బతీస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాపారులు రోడ్డున పడతారు.
– సనిశెట్టి లీలా భవన్నారాయణ, కిరాణా అసోసియేషన్ ప్రెసిడెంట్, పాలకొల్లు
ఆఫర్ల మీద నడుపుతూ..
ప్రతి ఏడాది క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి వ్యా పారం బాగా జరిగేది. ఈ ఏడాది వ్యాపారాలు చాలా డల్‌గా నడుస్తున్నాయి. బ్రాండెడ్ దుస్తులు సైతం ఆఫర్లు పెట్టి అమ్మకోవాల్సి వస్తోంది.
– పి.కిషోర్, లిబ్రా ఫ్యాషన్, భీమవరం
సాధారణంగా క్రిస్మస్ మొదలు సంక్రాంతి పండుగ వరకూ రెడీమేడ్, ఫ్యాన్సీ, కిరాణా, బంగారం వ్యాపారాలు భారీగా జరుగుతాయి. ఆయా పండుగల కోసం నెలరోజుల ముందుగానే వ్యాపారులు ముంబై, కోల్‌కతా, ఢిల్లీ తదితర నగరాల నుంచి భారీ మొత్తంలో లేటెస్ట్ మోడల్స్ ఖరీదు చేసి సరకు సిద్ధం చేసుకుంటారు. చిన్న వ్యాపారులు సైతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సరకు నిల్వ పెట్టుకుంటారు. జిల్లాలో భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం వస్త్ర వ్యాపారానికి, నరసాపురం బంగారం వ్యాపారానికి పేరొందాయి. గతంలో రోజుకు జిల్లాలో సగటున రూ.5 కోట్ల వరకు వస్త్ర వ్యాపారం జరిగితే, రూ.6 కోట్ల రూ.8 కోట్ల వరకు బంగారం, రూ.5 కోట్లకు పైగా కిరాణ అమ్మకాలు జరిగేవి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి రోజుల్లో రెట్టింపు స్థాయిలో వ్యాపారం జరిగేది.
మార్కెట్లు డల్
కొద్ది నెలలుగా మార్కెట్లు డల్ అయిపోయాయి. గత ప్రభుత్వంలో ప్రతినెలా పథకాలు పేద వర్గాలకు తలుపు తట్టేవి. కూటమి పాలనలో సంక్షేమం జాడ లేకుండా పోయింది. నెలల తరబడి ఇసుక కొరతతో నిర్మాణ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబ పోషణ కోసం అయినకాడికి అప్పులు చేస్తున్న పరిస్థితి. మరోపక్క అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు వారి జీవన ప్రమాణాలను మరింత దుర్భరంగా మార్చేశాయి.
పెద్ద పండుగపైనే ఆశలు
సంక్రాంతి పండుగలకు జిల్లా పెట్టింది పేరు కావడంతో ఇప్పుడు వ్యాపారుల ఆశలన్నీ పెద్ద పండుగపైనే ఉన్నాయి. అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు.
ప్రత్యేక స్టాళ్లకు వెనుకడుగు
డిసెంబరు 31న రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు పట్టణం, పల్లె అనే తేడా లేకుండా వీధివీధినా వ్యాపారులు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తుంటారు. న్యూ ఇయర్ స్పెషల్ ఫ్యామిలీ ప్యాక్, స్పెషల్ ప్యాక్, కాంబో అంటూ ఆకర్షణీయమైన ఆఫర్లతో పెద్ద ఎత్తున బిర్యానీ, చికెన్ వైరెటీలు, సీఫుడ్ అమ్మకాలు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మకాలు జరుగుతాయో లేదోనన్న అనుమానంతో స్టాళ్ల ఏర్పాటుకు వెనుకడుగేస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.
దుకాణాలు వెలవెల.. వ్యాపారులు విలవిల
మార్కెట్‌లో కనిపించని న్యూ ఇయర్ జోష్
అమ్మకాలు లేక బోసిపోయిన మార్కెట్లు
ఇప్పటికే కళ తప్పిన క్రిస్మస్ సేల్స్
సగానికి పైగా పడిపోయిన విక్రయాలు
ఇంత గడ్డు పరిస్థితి ఎన్నడూ లేదంటున్న వ్యాపారులు
సంక్రాంతి వ్యాపారం పైనే ఆశలు
రోజువారీ వ్యాపారం కూడా లేదు
ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కడా పండుగ శోభ కనిపించడం లేదు. చిన్నపాటి దుకాణాలతో పాటు మాల్స్, షోరూంలలో అమ్మకాలు తగ్గిపోయాయి. ఇప్పటికే క్రిస్మస్ అమ్మకాలు సగానికి పైగా పడిపోయాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు కొత్త ఏడాది వేడుకలకు అదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో వ్యాపార కేంద్రాలుగా ప్రసిద్ధి చెందిన భీమవరంలోని జువ్వలపాలెం రోడ్డు, మల్టీప్లెక్స్ ఏరియా, డీఎన్‌ఆర్ కళాశాల రోడ్డు, నాచు వారి సెంటర్, ఆదివారం బజార్, నరసాపురంలోని స్టీమర్ రోడ్డు, తణుకులోని వేల్పూరు రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు, పాలకొల్లులోని బస్టాండ్ సెంటర్, తాడేపల్లిగూడెం వన్‌టౌన్‌లోని కేఎన్ రోడ్డు, తాలుకా ఆఫీస్ రోడ్లు వినియోగదారులు లేక వెలవెలబోతున్నాయి. మాల్స్‌లో ఓ మోస్తరు వ్యాపారం జరుగుతుండగా మామూలు దుకాణాల్లో రోజువారీ వ్యాపారం కూడా జరగడం లేదు. కొద్ది నెలలుగా వ్యాపారం తగ్గిపోవడంతో ఈసారి అంతంతమాత్రంగానే స్టాకులు తెచ్చినా అవి కూడా అమ్ముడుపోని పరిస్థితి కనిపిస్తోందని వ్యాపారులు అంటున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నా అమ్మకాలు నామమాత్రంగానే ఉంటున్నాయని, గతంలో ఎప్పు డూ ఇటువంటి పరిస్థితి చూడలేదని వ్యాపారులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment