శ్రీవారి వైభవం కనుమా..
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న పార్వేటి (కనుమ) ఉత్సవం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఉత్సవం నిమిత్తం దొరసానిపాడు గ్రామానికి తరలివెళ్లిన స్వామిని వీక్షించిన భక్తులు పరవశించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దొరసానిపాడులో సంబరంలా వేడుక నిర్వహించారు. ముందుగా మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో ఉభయ దేవేరులతో స్వామివారి ఉత్సవమూర్తులను రాజాధిరాజ వాహనంలో ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా పురవీధులకు పయనమైంది. తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు కొండ వెనుక భాగాన ఉన్న దొరసానిపాడు గ్రామానికి కనుమ ఉత్సవం నిమిత్తం వెళ్లారు. గ్రామంలో మహిళలు దారి పొడవునా రంగవల్లులను తీర్చిదిద్ది, పూలతో ఘన స్వాగతం పలికారు. దొరసానిపాడు పురవీధుల్లో తిరుగాడిన అ నంతరం స్వామివారు కనుమ మండపం వద్దకు చే రుకుని భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత శ్రీవారు, అమ్మవార్లను మండపంలో ఉంచి అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చారు. ఆలయ ఇన్‌చార్జి ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు వేడుకలో పాల్గొన్నారు. ఉత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత శ్రీవారు, అమ్మవార్లు గిరి ప్రదక్షిణగా తిరిగి ద్వారకాతిరుమలలో ఆలయానికి చేరుకున్నారు.
నేత్రపర్వంగా చిన వెంకన్న కనుమ ఉత్సవం
Comments
Please login to add a commentAdd a comment