రైతులకు ‘సాగర్’ నీటి కష్టాలు
నూజివీడు: నియోజకవర్గంలో ఎన్నెస్పీ ఆయకట్టు పరిధిలో రబీ పంటలసాగుకు అవసరమైన సాగర్ జలాల సరఫరాపై ఈ ప్రాంతంలోని రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నూజివీడు బ్రాంచి కెనాల్ పరిధిలో ఉన్న నూజివీడు ప్రాంతానికి సాగర్ జలాలు షెడ్యూల్ ప్రకారం నవంబరు 15 నుంచే జరగాలి. ఇప్పటికే రెండు నెలలు ఆలస్యమైనా సాగర్‌జలాల సరఫరా విషయమై అధికార పార్టీ నాయకులు ఎవరూ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) మూడో జోన్ పరిధిలో నూజివీడు ప్రాంతం ఉంది. జోన్–3 కి నవంబరు 15 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు సాగర్ జలాలను సరఫరా చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి నాగార్జునసాగర్ జలాశయం నుంచి సాగర్ జలాలను ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లాల పరిధిలో ఉన్న మూడో జోన్‌కు విడుదల చేయించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. దీంతో ఏలూరు జిల్లాలోని నూజివీడు బ్రాంచి కాలువ పరిధిలో ఉన్న నూజివీడు మేజర్, బాపులపాడు మేజర్, మాచవరం మేజర్ తదితర వాటి కింద మొత్తం 70 వేల ఎకరాల ఆయకట్టులో రైతులు సాగు చేసిన పంటలకు సాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. మూడో జోన్‌లోని ఆయకట్టుకు హక్కుగా రావాల్సిన సాగర్ జలాలను తీసుకురావాల్సిన బాధ్యత మంత్రి కొలుసు పార్థసారథిపై ఉందని రైతులు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలోని ప్రజల ప్రధాన వృత్తి, ఆదాయ వనరు వ్యవసాయమే అయినప్పటికీ పాలకులు సాగునీరు గురించి పట్టించుకుంటున్న దాఖలాలే కనిపించడం లేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.
వారం రోజులుగా మైలవరం బ్రాంచి కాలువకే..
మూడో జోన్‌లోని రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ వద్ద ఉన్న రెగ్యులేటర్ వద్దకు ఈనెల 6న సాగర్ జలాలు దాదాపు 200 క్యూసెక్కుల వరకు రాగా వాటిని ముందు నూజివీడు బ్రాంచి కాలువకు వదిలారు. అయితే వదిలిన సాగర్‌జలాలు కాలువకు అడుగడుగునా ఉన్న యూటీ రంధ్రాల ద్వారా సాగర్ జలాలన్నీ రెడ్డిగూడెం మండలంలోని చెరువుల్లోకే వెళ్లిపోయాయి. అంతేగాకుండా రెడ్డిగూడెం వద్ద ఉన్న ఎస్కేప్ గేట్‌ను రాత్రి సమయంలో రైతులు అక్రమంగా ఎత్తడంతో నూజివీడు బ్రాంచి కాలువలో సరఫరా అవుతున్న సాగర్ జలాలు రెడ్డిగూడెం కోతుల వాగు ద్వారా రంగాపురం పెద్ద చెరువుకు పోయాయి. దీంతో నూజివీడు ప్రాంతానికి చుక్క నీరు కూడా రాలేదు. ఇంతలోనే 9వ తేదీ ఉదయం నుంచి నూజివీడు బ్రాంచి కాలువకు సాగర్ జలాల సరఫరాను నిలిపివేసి మైలవరం బ్రాంచి కాలువకు వదిలారు. వారం రోజులుగా మైలవరం బ్రాంచి కాలువకే సాగర్ నీళ్లు వెళ్తున్నాయి.
నూజివీడు బ్రాంచి కెనాల్
పట్టించుకోని ప్రభుత్వం
రబీ సీజన్‌లో రైతులు మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, మినుము తదితర పంటలను సాగు చేశారు. అలాగే పిందెదశలో ఉన్న మామిడి తోటలకు సైతం తేలికపాటి తడులు వేయాల్సిన అవసరం ఉంది. అంతేగాకుండా రాబోయేది వేసవి కాలం కాబట్టి ఈ ప్రాంతంలోని చెరువులన్నింటినీ సాగర్ జలాలతో నింపుకుంటేనే నూజివీడు ప్రాంతంలో మంచినీటి సమస్య లేకుండా ఉంటుంది. తమ ఇళ్లు గడవాలన్నా, పిల్లల చదువులకు ఫీజులు చెల్లించాలన్నా, రోగాలకు చికిత్స చేయించుకోవాలన్నా, మరేపని చేయాలన్నా ఈ ప్రాంత రైతులకు వ్యవసాయమే దిక్కుగా ఉన్న నేపథ్యంలో సాగర్ జలాలను తీసుకువచ్చేందుకు పాలకులు తీవ్రంగా ప్రయత్నించాల్సింది పోయి సమస్యను గాలికొదిలేశారు.
రెండు నెలలు ఆలస్యమైనా ఇప్పటివరకు కానరాని సాగర్ జలాలు
70 వేల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకం
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
ఆందోళన చెందుతున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment