ఏలూరు(మెట్రో): జిల్లా సమీక్షా సమావేశం (డీపీఆర్‌సీ)లో గురువారం సమస్యలపై స్వపక్ష సభ్యులే విపక్ష అవతారం ఎత్తారు. ప్రజలకు ఏ సమాధానం చెప్పాలంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. రోడ్లు బాగోలేవని.. ఎందుకు అనుకున్న సమయానికి పూర్తి చేయలేదని ఒకరు ప్రశ్నిస్తే, ఉచిత గ్యాస్‌బండల బుకింగ్‌లు, డెలివరీలకు వ్యత్యాసం ఎందుకు ఉందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రశ్నించారు. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంలో అడ్డగోలుగా పనులను రద్దు చేయడంపై మరొకరు విరుచుకుపడ్డారు. ఇలా వివిధ సమస్యలపై జిల్లాలోని ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు.
అజెండాలో రూపొందించిన అంశాల మేరకు నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలపాలని ఎమ్మెల్యేలను ఇన్‌చార్జి మంత్రి ఆదేశించారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు, పునరావాసం, భూ సేకరణ వంటి అంశాలపై ప్రారంభమైన చర్చ, వైద్యారోగ్య శాఖపై కొనసాగింది. పోలవరం ఎమ్మెల్యే జిల్లాలో పోలవరం ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యక్తిగత ప్యాకేజీ అందించిందని చెప్పుకొచ్చారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం త్వరలో ప్రత్యేకమైన సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశంలో నిర్వాసితులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకోవాలంటూ సూచించారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలు పరిశీలించాలని ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలంటూ మంత్రి మనోహర్ సూచించారు.
కొల్లేరుపై గరం గరం
అనంతరం కొల్లేరుపై చర్చ మొదలు కాగా ప్రారంభం నుంచి చర్చ వాడీ వేడిగా సాగింది. కొల్లేరులో నివసించే ప్రజల జీవన స్థితిగతులను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కనీసం తాత్కాలిక రోడ్లు సైతం కొల్లేరు గ్రామాలకు వెళ్లేందుకు ఎందుకు వేయలేకపోతున్నామంటూ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జయమంగళ కొల్లేరు సమస్యలపై చర్చించారు. అనంతరం జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందంటూ సభ్యులు ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, సాక్షాత్తు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సైతం ఆర్‌అండ్‌బీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment