రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేద్దాం
భీమవరం (ప్రకాశంచౌక్): రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. జాతీయ రహ దారి భద్రతా మాసోత్సవాలను క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రారంభించారు. గోడపత్రిక, కరపత్రాలు, బ్యానర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలు, జాగ్రత్తలపై వివిధ వర్గాల ప్రజలకు, వాహన డ్రైవర్లకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే మాసోత్సవాలలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. జిల్లా రవాణా అధికారి టి.ఉమామహేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ కె.ఎస్.ఎన్.ప్రసాద్, భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ పీఎన్‌వీఎం సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ నిర్మూలనకు చేయి కలుపుదాం
పశ్చిమగోదావరిని ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్లాస్టిక్ నిషేధం కార్యాచరణపై డీఆర్‌డీఏ, డీపీఆర్‌ఓ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో నానాటికి పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్లాస్టిక్ వినియోగం కారణంగా తాగునీరు, ఆహారం కలుషితమై అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి, ప్రజలకు అవగాహన కల్పించడంతో చాలా కొద్ది మొత్తంలోనే ప్లాస్టిక్‌ను నియంత్రించగలిగారన్నారు. కలెక్టరేట్ లో రానున్న సోమవారం నుంచి ప్లాస్టిక్ నియంత్రణ అమలుకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ముఖ్య ప్రాంతాల్లో గుడ్డ సంచులు, గాజు గ్లాసులు అమ్మకాలకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహణకు అధికారులను ఆదేశించారు. డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్, డీపీఆర్‌ఓ టి.నాగేశ్వరరావు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు పాల్గొన్నారు.
కలెక్టర్ చదలవాడ నాగరాణి
Comments
Please login to add a commentAdd a comment