గేదె దూడల పోషణలో జాగ్రత్తలు ఇలా
చింతలపూడి: పాడి పరిశ్రమలో గేదె పాలకు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలిసిందే. కారణం గేదె పాలలో వెన్న శాతం అధికంగా ఉండటమే. పాల ధర నిర్ణయించడంలో వెన్న శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇందువల్ల ఆవు పాలకంటే గేదె పాలకు ధర ఎక్కువ పలుకుతుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు గేదెల పెంపకం పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. మార్కెట్లో గేదెల ధర కూడా అవి ఇచ్చే పాల దిగుబడిపై ఆధారపడి ఉంటుంది. అధిక ధరతో పాడి గేదెలను కొనడానికి బదులు మేలు జాతి దూడలను తీసుకుని మంచి పాడి గేదెలుగా వృద్ధి చేసుకుంటే పశువుల కొనుగోలుకు అయ్యే వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. మంచి దూడలను ఎంపిక చేసుకుని పోషణలో జాగ్రత్త వహిస్తే సకాలంలో ఎదకు వచ్చి 10 సంవత్సరాల్లో కనీసం 6 నుంచి 7 ఈతలు పొందవచ్చునని పశు సంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె లింగయ్య రైతులకు సూచిస్తున్నారు.
గర్భం నుంచే జాగ్రత్తలు
గేదె దూడల పోషణ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ప్రారంభం కావాలి. చూడి గేదెలకు మంచి పోషకాహారం అందిస్తే ఆరోగ్యవంతమైన ఎక్కువ బరువు గల దూడలు పుట్టే అవకాశం ఉంది. చూడి చివరి మూడు నెలల కాలంలో గేదెల పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దూడ పెరుగుదల చివరి మూడు నెలల్లోనే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గేదె తినగలిగినంత పచ్చి మేత, దాణ, ఖనిజ లవణాల మిశ్రమం అందించాలి. చూడి గేదెను ఈనడానికి రెండు వారాల ముందు నుంచి పాలు తీయకుండా వట్టిపోయేటట్లు చేయాలి. దీనివల్ల గేదె ముందు ఈతలో పాలివ్వడం ద్వారా కోల్పోయిన పోషక పదార్థాలను పొంది మరుసటి ఈతకు అధిక పాలను ఇస్తుంది.
దూడ పుట్టిన తరువాత
దూడ పుట్టిన వెంటనే ముందు బరువు చూడాలి. పుట్టిన అరగంటలోపు తల్లి దగ్గర జున్ను పాలు తాగేలా చూడాలి. సాధారణంగా జున్ను పాలు తాగితే దూడలకు అజీర్తి చేస్తుందని, వాతం వస్తుందని అపోహ పడుతుంటారు. వాస్తవానికి జున్ను పాలలోని యాంటి బయాటిక్ పదార్థాలు దూడలను అంటు వ్యాధుల నుంచి రక్షిస్తాయి. జున్ను పాలలో విటమిన్ ఎ, ఖనిజ లవణాలు మామూలుగా కంటే మూడు రెట్లు అధికంగా ఉండి దూడల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జున్ను పాలను దూడ బరువులో పదవ వంతు పరిమాణాన్ని లెక్కించి రోజులో మూడు లేదా నాలుగు సార్లు తాగించాలి.
దూడను వేరు చేసి పెంచే పద్ధతి
దూడను జున్ను పాలు తాగడం వరకు మూడు రోజులు తల్లి దగ్గర ఉంచి తరువాత తల్లి నుంచి వేరు చేసి పెంచే పద్ధతిని వీనింగ్ పద్ధతి అంటారు. ఈ పద్ధతి వల్ల దూడకు ఎంత పాలు ఇస్తున్నదీ తెలుసుకోవచ్చు. గేదె ఇచ్చే పాల దిగుబడి కూడా తెలుస్తుంది. ఏకారణం చేతనైనా దూడ చనిపోయినా గేదె పాలు ఇవ్వడం మానదు. వీనింగ్ పద్ధతిలో దూడలకు పాత్రలలో పోసిపాలు తాగించడం నేర్పాలి.
దూడల పోషణ
దూడల శరీర బరువులో 10 శాతం పాలు ఒక నెల వరకు ఖచ్చితంగా ఇవ్వాలి. 15 రోజుల తరువాత బలవర్ధకమైన దూడల దాణా అందివ్వాలి. ఈ దాణా మొదటి నెలలో 150 గ్రాములతో మొదలుపెట్టి, మూడవ నెలలో 300 గ్రాములు, 4వ నెల నుంచి ఏడాది వరకు కిలో చొప్పున ఇవ్వాలి. కాయజాతి పశుగ్రాసాలైన అలసంద, లూసర్న్, పిల్లి పెసర వంటివి ఇస్తే మంచిది. వీటితో పాటు లేత పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచాలి. ఇలా పెంచిన దూడ ప్రతిరోజు 400 నుంచి 500 గ్రాములు బరువు పెరిగి ఏడాది కాలంలో 250 నుంచి 280 కిలోల బరువు పెరుగుతుంది. రైతులు పశు పోషణతో పాటు దూడలకు డీ వార్మింగ్ మందులు, వ్యాధి నిరోధక టీకాలను ఆయా వయస్సుకు తగినట్లు క్రమం తప్పకుండా ఇప్పించినట్లయితే దూడలు ఆరోగ్యంగా పెరిగి పాల ఉత్పత్తి బాగుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment