పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి
ఏలూరు టౌన్: డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెయినేజీ, సీసీ రోడ్లు, పంపు లీకేజీలకు సంబంధించి ఫిబ్రవరి 28 లోపు పనులు పూర్తి చేయాలని వైద్య విధాన పరిషత్ ఈఈని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా కంటి విభాగాన్ని, ఐసీయూ మంత్రి తనిఖీ చేశారు. శ్యామ్ అనే వ్యక్తి మంత్రిని కలిసి తన భార్య అంగవైకల్యంతో మంచానపడి జీవిస్తుందని రూ.6 వేలు దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నామని, దీని స్థానంలో రూ.15 వేలు పింఛను మంజూరు చేయించాలని మంత్రిని కోరగా అర్జీని తీసుకుని విచారణ చేయించాలన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సింగ్ డిపార్ట్‌మెంట్ వారీగా ఖాళీలు ఉన్నాయని, పేషెంట్ తరఫున వీల్ చైర్స్, పరికరాలు, యంత్రాలకు సంబంధించి తర్వాత డీఆర్‌సీలో కలెక్టర్ వెట్రిసెల్వి ఆధ్వర్యంలో అవసరమైన చర్యలను తీసుకోవడానికి కృషి చేస్తామన్నారు. ఈ ఆసుపత్రికి గుండెకు సంబంధించిన వైద్యుల కోసం దాతల సహాయాన్ని కోరతామన్నారు. తనిఖీలో మంత్రి వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్‌రాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, ఘంటా మురళి, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్
Comments
Please login to add a commentAdd a comment