నాల్గో రోజూ కాలుదువ్విన కోళ్లు
ఉండి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మూడు రోజుల పాటు అడ్డూ అదుపు లేకుండా విచ్చలవిడిగా కోడిపందేలు, జూదం నిర్వహించారు. నాల్గవ రోజు గురువారం కూడా కొన్నిచోట్ల కోడి పందేలు నిర్వహించారు. ఉండి మండలం కలిగొట్లలో నిర్వాహకులు గురువారం ఉదయం ఓ పందెం నిర్వహించారు. దీంతో చుట్టుపక్కల సమాచారం అందుకున్న పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున బరి వద్దకు చేరుకున్నారు. అయితే ఆ తరువాత పోలీసులు వస్తున్నారనే సమాచారం పందెంరాయుళ్లకు అందడంతో ఉడాయించారు. కొద్దిసేపటికి ఎస్సై ఎండీ నసీరుల్లా, సిబ్బందితో బరివద్దకు చేరుకుని కోడిపందాలు, జూదం వంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుటామని హెచ్చరికలు చేశారు. ఉండి, మహదేవపట్నం గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో నాల్గవరోజు జూదం కొనసాగినట్లు సమాచారం.
వ్యక్తి కిడ్నాప్‌పై కేసు నమోదు
భీమవరం: పట్టణానికి చెందిన విశ్వనాథుని సత్యనారాయణ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారనే ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. మెంటేవారితోటకు చెందిన సత్యనారాయణ ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి దారుగా ఉన్నారు. అతని తల్లిదండ్రులను హైదరాబాద్‌కు పంపించేందుకు కుమారుడు సాయినాథ్‌తో కలిసి గురువారం టౌన్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. కారు దగ్గర సత్యనారాయణ ఉండగా అతని తల్లిదండ్రులు, కుమారుడు, రైల్వే స్టేషన్‌కి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత సాయినాథ్ తిరిగొచ్చేసరికి సత్యనారాయణ కనిపించలేదు. స్థానికులను అడగ్గా ఎవరో నలుగురు వ్యక్తులు కారులో వచ్చి బలవంతంగా తీసుకెళ్లారని చెప్పడంతో చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇజ్రాయెల్ తెలిపారు.
మహిళపై దౌర్జన్యం
భీమవరం: తన ఇంట్లోకి ఓ వ్యక్తి అక్రమంగా ప్రవేశించి దుర్భాషలాడుతూ ఇంట్లోని విలువైన వస్తువులు ధ్వంసం చేశాడని భీమవరం ఒకటో పట్టణంలోని గునుపూడి పరిధికి చెందిన ఎం.లక్ష్మి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై బి.వై కిరణకుమార్ తెలిపారు. తనకు భోజనానికి ఇబ్బందిగా ఉందని, వండి పెడితే డబ్బులు ఇస్తానని టి.శ్రీనివాసు కోరగా బాధితురాలు అంగీకరించారు. ఇటీవల తనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వంట చేయలేనని చెప్పగా ఈ నెల 15న శ్రీనివాస్ తనపై దాడికి యత్నించడంతో పాటు వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసుకుని చచ్చిపోతా, లేకపోతే చంపేస్తానంటూ భయబ్రాంతులకు గురిచేసినట్లు లక్ష్మి ఫిర్యాదులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment