ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుని సత్యం, ధర్మ మార్గాల్లో నడవడమే మానవ జన్మ సార్థకతకు మార్గ దర్శకాలని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈ, సెర్ఫ్ ఎన్ ఆర్‌ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భీమవరం హోసింగ్ బోర్డు కాలనీలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారిని మంత్రి శ్రీనివాస్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. మందిర అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు, కమిటీ సభ్యులు, అర్చకులు మంత్రి దంపతులచే ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంచారామక్షేత్రం శ్రీఉమా సోమేశ్వరస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
నూజివీడులో చోరీ
నూజివీడు: పట్టణంలోని హనుమాన్ జంక్షన్ రోడ్డులో ఉన్న శారదా ఆసుపత్రి సమీపంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. స్థానికంగా ప్రైవేటు స్కూల్‌లో పనిచేస్తూ అద్దెకుంటున్న పాముల వెంకటరత్నం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సెలవులకు ఊరు వెళ్లారు. గురువారం ఉదయం తలుపు తీసి ఉండటం చూసి పక్క పోర్షన్‌లో ఉంటున్న వారు వెంటనే వెంకటరత్నం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఇంటిలో చూసేసరికి వస్తువులన్ని చిందరవందరగా ఉండడంతోపాటు కాసున్నర నల్లపూసల గొలుసు మాయమైనట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీలో దొంగ ఇంట్లోకి 12.55కు వెళ్లి తిరిగి 1.30 గంటలకు బయటకు వెళ్లినట్లుగా రికార్డయింది. బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో టౌన్ సీఐ పీ సత్య శ్రీనివాస్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఏలూరు నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment