జూదంలో యువత చిత్తు
భీమవరం (ప్రకాశం చౌక్): సంక్రాంతి సంబరాల ముసుగులో జూదం యువతను చిత్తు చేసింది. జేబులకు చిల్లు తప్పదని తెలిసినా.. జనం జూదం ముందు ఓడిపోయారు. సంక్రాంతి మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా జరిగిన కోడి పందేలు, గుండాటలు, పేకాటల్లో యువత భారీగా పాల్గొని రూ. కోట్లలో నష్టపోయింది.
అధిక సంఖ్యలో యువతే.. గతంలో కోడి పందేలు, గుండాటలు అంటే పెద్ద వారు అధిక సంఖ్యలో ఉండేవారు. యువత సంక్రాంతికి ఏర్పాటు చేసే క్రికెట్, వాలీబాల్, ఇతర క్రీడాల్లో ఎక్కువగా ఉండేది. రాను రాను యువత ఎక్కువ సంఖ్యలో కోడి పందేలు, గుండాటల వైపు మళ్లుతున్నారు. ఈ సంక్రాంతి మూడు రోజులు అదే జరిగింది. కోడి పందేలు, గుండాటల్లో యువత చాలా పెద్దసంఖ్యలో పాల్గొంది. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వారు. కోడి పందేలు, గుండాటల్లో పాల్గొన్నారు. ఎక్కడ ఏ కోడి పందేల బరి చూసిన యువత ఎక్కువగా కనిపించింది. పెద్ద వారు కోడి పందేలు తిలకించడానికి పరిమితంకాగా యువత కోడికి కత్తి కట్టడం దగ్గర నుంచి పందేలు సరిపెట్టడం వరకు అన్ని చూసుకున్నారు. కొన్ని చోట్ల అమ్మాయిలు కూడా ఈ జూదాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ, విశాఖపట్నం నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్, ఇతర ఉద్యోగులు, వ్యాపారం చేస్తున్న యువత డబ్బు లెక్క చేయకుండా ఉత్సాహంగా కోడి పందేలు, గుండాటల్లో పాల్గొంది.
రూ.70 కోట్లకు పైగా చేతులు మారిన నగదు
జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల జరిగిన కోడి పందేలు, గుండాటలు, ఇతర జూదాల్లో యువత రూ. 70 కోట్లు మంచినీళ్లలా ఖర్చుపెట్టింది. నూటికి 10 శాతం మంది యువత పందేల్లో డబ్బులు గెలిస్తే.. 90 శాతం పందేల్లో భారీగా పోగొట్టుకున్నారు. రోజుకు ఒక్కొక్కరు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు, గ్రూపుగా రోజుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పందేలపై కాశారు. జేబుల్లో డబ్బు లేని వారికి నిర్వాహకులు ప్రత్యేకంగా మనుషులను పెట్టి క్యాష్ ఏర్పాటు చేయించారు. ఫోన్ పే, గూగుల్‌పే సౌకర్యం కల్పించి క్యాష్ అందించేవారు.
లోన్ యాప్‌ల బారిన యువత : కోడి పందేలకు అవసరమైన నగదు కోసం యువత ముందుగానే పలు రకాల లోను యాప్‌ల నుంచి రుణాలు తీసుకుని పందేలు కాశారు. మరికొందరు అధిక వడ్డికి అప్పులు చేశారు. వస్తువులు తాకటపెట్టి మరి ఈ జూదాల్లో డబ్బులు పొగొట్టుకున్నారు. సంక్రాంతి పండగ ముగిసింది. ఇక చేసిన అప్పులు తీర్చడం ఎలా ఆందోళన యువతలో మొదలైంది.
కోడిపందేలు, గుండాటతో జేబులు చిల్లు
లోన్ యాప్‌ల నుంచి, అప్పులు చేసి పందేలు కాసిన వైనం
జిల్లాలో రూ.70 కోట్లు ఖర్చుపెట్టిన యువత
భీమవరానికి చెందిన సాయి (పేరు మార్చాం) ప్రైవేట్ ఉద్యోగి. జీతం తక్కువ అయినప్పటికీ కోడి పందేలు, గుండాటల కోసం లోన్ యాప్‌ల్లో, మరికొంత అప్పు చేశాడు. మొదటి రోజు పందేల్లో కొంత వరకు గెలిచినా.. మిగతా రెండు రోజుల్లో రూ.లక్ష పొగొట్టుకున్నాడు.
భీమవరానికి చెందిన మహేష్ (పేరు మార్చాం) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. సంక్రాంతికి సొంతూరు వచ్చి కోడి పందేల్లో పాల్గొని రూ.లక్ష వరకు పోగొట్టుకున్నాడు. రెండు నెలల జీతం సొమ్మును కేవలం మూడు రోజుల్లో జూదంలో సమర్పించుకున్నాడు. సంక్రాంతి మూడు రోజులు ఎంజాయ్ చేయడం ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదని అతను చెప్పడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment