జాతీయ వర్క్‌షాపునకు హాజరైన రవీంద్రనాథ్
తణుకు అర్బన్: ఢిల్లీలో జరిగిన శాసన సభలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్‌లో ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయనే అంశంపై నిపుణులతో నిర్వహించిన జాతీయ వర్క్ షాప్‌లో శాసన మండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ పాల్గొన్నారు. వివిధ అంశాలకు సంబంధించి ఆర్థిక నిపుణులతో చర్చించినట్లు ఆయన వివరించారు. ఈ వర్కు షాపులో పలువురు ప్రముఖులతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఎస్‌ఆర్‌కేఆర్‌లో హ్యాకథాన్ పోటీ
భీమవరం: భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి 17, 18 తేదీలలో జాతీయ స్థాయి ప్రజ్వలన్ 2కే25 పేరిట హ్యాకథాన్ పోటీ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కేవీ మురళీకృష్ణంరాజు చెప్పారు. హ్యాకథాన్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ కళాశాలలో ఆవిష్కరించారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చనన్నారు.
నైపుణ్యాభివృద్ధి పెంపునకు పీఎం ఇంటర్న్‌షిప్
భీమవరం (ప్రకాశంచౌక్): రానున్న ఐదేళ్లలో సుమారు కోటి మందికిపైగా యువతకు పీఎం ఇంటర్న్‌షిప్ పేరిట అవకాశం కల్పిస్తున్నారని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారని, టాప్–500 కంపెనీల్లో ఈ పథకం ద్వారా యువతకు అవకాశాలు కలుగుతాయన్నారు. జనవరి 14 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 21 వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.60 వేల ఉపకార వేతనం లభిస్తుందని, ఏదైనా కంపెనీలో చేరే ముందు అందజేసే రూ.6 వేలు (వన్ టైం గ్రాంట్) కూడా అందుతుందన్నారు. ఈ పథకానికి సంబంధిత వెబ్‌సైట్‌లో అయ్యి రిజిస్టర్ అవ్వాలన్నారు. 21–24 మధ్య వయసున్న యువత అర్హులన్నారు. ఎస్‌ఎస్‌సీ పాసయిన అభ్యర్థులతో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ, బీఇ, బీఎస్సీ, బీఫార్మసీ, బీబీఏ వంటి డిగ్రీ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 9988853335, 8712655686 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
గూడెం డిపో తనిఖీ
తాడేపల్లిగూడెం(టీఓసీ): జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ గురువారం తాడేపల్లిగూడెం డిపోను సందర్శించారు. గ్యారేజీ సిబ్బందికి, కండక్టర్లు, డ్రైవర్లు, సూపర్‌వైజర్స్‌కు, కార్యాలయం సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. వరప్రసాద్ మాట్లాడుతూ ప్రత్యేక బస్సులు, లోకల్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులకు అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రోడ్డు మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెయింటెనెన్స్, మెకానికల్ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. సురక్షిత ప్రయాణం, ఇంధన పొదుపు, ఆదాయం తీసుకువచ్చిన డిపో సిబ్బందికి పలువురికి మెరిట్ సర్టిఫికెట్స్ అందజేశారు.
జూదాలపై 415 కేసుల నమోదు
భీమవరం: సంక్రాంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు, పేకాట, గుండాట నిర్వాహకులపై 415 కేసులు నమోదు చేసి సుమారు రూ.7.35 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గురువారం తెలిపారు. కోడి పందేల బరులపై 245 కేసులు నమోదు చేసి 545 మందిని అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి రూ.4.05 లక్షల నగదు, 239 కోళ్లు, 342 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 103 పేకాట కేసులు నమోదు చేసి, 189 మందిని అరెస్ట్ చేయగా వారి నుంచి రూ.1.47 లక్షలు స్వాధీనం చేసుకోగా, 67 కేసులు నమోదు చేసి 236 మందిని అరెస్ట్ చేసి రూ.1.83 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment