వైఎస్సార్ సీపీ ఫీజుపోరుకు మద్దతు
తాడేపల్లిగూడెం (టీఓసీ): పేద విద్యార్థులకు ఉపయోగపడే ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రూ.350 కోట్లు రిలీజ్ చేయమని మార్చి 12న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు ధర్నాకు మాల మహానాడు సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సభ్యుడు చీకటిమిల్లి మంగరాజు అన్నారు. పట్టణంలో మంగరాజు ఆధ్వర్యంలో బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంగరాజు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డుకు అర్హుడు కాడని, ఉద్యోగం వదలి, దళితుల హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన గద్ధర్, కత్తి పద్మారావు, కెజీ సత్యమూర్తులు పద్మశ్రీ అవార్డుకు అర్హులన్నారు. కార్యక్రమంలో గోళ్ళ అరుణ్ కుమార్, నరసింహంయ్య, తిరగటి శివ, గోదా జాన్‌పాల్, ఉన్నమట్ల విజయ్‌కుమారి పాల్గొన్నారు.
స్కూల్ బస్సు ఢీకొని బాలుడి మృతి
పెదపాడు: స్కూల్ బస్సు ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పెదపాడు మండలంలోని పాతముప్పర్రు గ్రామానికి చెందిన వలదాసి దాసి ఏసుపాదం రెండో కుమారుడు శ్రీ దీక్షిత్(2) బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. చెవుల వెంబడి రక్తం కారుతున్న బాలుడుని బంధువులు స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి తండ్రి ఏసుపాదం ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ కృష్ణ కేసు నమోదు చేశారు.
జాతీయ ఆర్చరీ పోటీల్లో ప్రతిభ
భీమవరం: ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన 38వ జాతీయ క్రీడల ఆర్చరీ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భీమవరం పట్టణానికి చెందిన మాదాల సూర్యహంసిని, నెల్లూరు చెందిన టి.గణేష్ మణిరత్నం మిక్సిడ్ అంధ్రప్రదేశ్ జట్టు కేటగిరిలో వెండి పతకాన్ని గెలుచుకున్నారని ఆర్చరీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపారు. ఉత్తరాఖండ్ ఆర్‌జీసీఎస్ గ్రౌండ్, రజత్ జయంతి ఖేల్ పారిసార్ గ్రౌండ్‌లో ఈనెల 1 నుంచి నిర్వహించిన కాంపౌడ్ విలువిద్య పోటీల్లో సూర్యహంసిని, గణేష్‌మణిరత్నం వెండి పతకాన్ని గెల్చుకోగా వ్యక్తిగత కేటగిరిలో గణేష్‌మణిరత్నం కాంస్య పతకాన్ని గెల్చుకున్నట్లు సత్యనారాయణ వివరించారు. విజేతలిద్దరూ కమల్‌కిషోర్ వద్ద శిక్షణ పొందుతున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment