టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించాలి
భీమవరం: టిడ్కో గృహాలను తక్షణం జిల్లాలోని లబ్ధిదారులందరికీ ఇవ్వాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ హెచ్చరించారు. బుధవారం భీమవరంలో పార్టీ కార్యాలయంలో గోపాలన్ మాట్లాడుతూ 18 ఏళ్ల క్రితం ఇళ్ల స్థలాల కేటాయింపునకు ప్రయత్నం ప్రారంభిస్తే నేటికీ లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. జిల్లాలో 20,752 లబ్ధిదారులకుగాను కేవలం 8 వేల మందికి మాత్రమే ఇళ్లు స్వాధీనం చేశారని మండిపడ్డారు. విద్యుత్, మంచినీరు, డ్రెయినేజీ వంటి కనీస మౌలిక వసతులు లేకపోవడంతో నివాసితులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టిడ్కో ఇళ్లను వెంటనే స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి బుద్ధి చెప్పాలి
భీమవరం: సూపర్ సిక్స్ అంటూ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చి హామీలన్నింటినీ తుంగలోకి తొక్కిన కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని ఓడించాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పిలుపునిచ్చారు. బుధవారం భీమవరంలోని బేతనిపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా పింఛన్ల పెంపు హామీ తప్ప ఇతర పథకాలన్నీ గాలికివదిలి ప్రజలను ఇబ్బందులు పాలుచేస్తున్నారన్నారు. హామీల శాసనమండలిలో సామాన్యుడి గొంతు వినిపించాలన్నా, కూటమినాయకులు ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా ఈనెల 27న జరుగుతున్న ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో జీవీ సుందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హర్షకుమార్ కోరారు. సమావేశంలో పట్టా దేవరాజ్, వర్గీస్ డానియేలు, గంటా రాహుల్‌రిచర్డ్స్, పీపీ విల్సన్, గంటా సుందర్‌కుమార్ పాల్గొన్నారు.
అప్పు తీర్చినా వేధిస్తున్నారని దంపతుల నిరసన
పెంటపాడు: అప్పు తీర్చినా సరే తమ ప్రామిశరీ నోట్లు, చెక్కులు ఇవ్వకుండా తమను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని, వారిపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని పెంటపాడుకు చెందిన రెడ్డి రాంబాబు, నాగలక్ష్మి దంపతులు ధన్యమహిళామండలి ఆధ్వర్యంలో కర్రి విజయకుమారి ఇంటివద్ద బుధవారం నిరసనకు దిగారు. రూ.30 లక్షలు అప్పుగా తీసుకుని వడ్డీతో సహా రూ.45 లక్షలు చెల్లించినా కునాకరపేటకు చెందిన కర్రి విజయకుమారి, కాకినాడకు చెందిన నానిబాబులు తమను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పోతంశెట్టి లక్ష్మి, తాడేపల్లి లక్ష్మి తదితరులు బాధితులకు సంఘీభావం ప్రకటించారు. పెంటపాడు ఎస్సై స్వామి సంఘటనా స్థలానికి చేరుకొని దీక్షను భగ్నం చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో నిరసన దీక్షకు కూర్చోవడం నేరమన్నారు. ఇరువర్గాల పెద్దలతో చర్చించి వారి ద్వారా రాజీ చేసుకోవాలని ఎస్సై స్వామి బాధితులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment