దెందులూరులో పచ్చ దందా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో గ్రావెల్ దందా తారాస్థాయికి చేరింది. నిన్నమొన్నటి వరకు పోలవరం గట్లు అసైన్డ్ భూముల్లో గ్రావెల్ దందా సాగించిన మాఫియా లీజు పేరుతో ప్రైవేటు పొలాలపై పడగవిప్పారు. అన్ని అనుమతులు తీసుకుని సక్రమంగా గ్రావెల్ తవ్వుకుంటామని భూ యజమానికి నమ్మకంగా చెప్పి లీజు అగ్రిమెంట్ చేసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా సాగిస్తున్నారు. అడ్డుకోవడానికి యత్నించిన పొలం యజమానిపై దాడి చేసి దౌర్జన్యం చేసి ఎమ్మెల్యే చింతమనేని మనుషులం.. నువ్వేమి చేయలేవంటూ హెచ్చరించారు. స్థానిక ఎస్సై మొదలు జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారుల వరకు అన్ని కార్యాలయాలకు పొలం యజమాని ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్ధితి.
దెందులూరు మండలంలోని చల్లచింతలపూడిలో సర్వే నెంబర్ 12/2, 13/4లో విజయవాడకు చెందిన దాసరి బాబురావుకు 9.57 ఎకరాల భూమి ఉంది. 2005లో భూమిని కొనుగోలు చేసి లీజుకు ఇచ్చారు. అరటి, పామాయిల్ సాగు పొలంలో చేస్తున్నారు. ఈ క్రమంలో బాబురావు సమీప బంధువు, మండల టీడీపీ నాయకుడు పుసులూరి సత్యనారాయణ (బోస్), నాగబోయిన సత్యనారాయణ సెప్టెంబర్‌లో గ్రావెల్ తవ్వకాలకు భూ యజమాని నుంచి అగ్రిమెంట్ చేసుకుని భూమిని తీసుకున్నారు. ఎకరాకు రూ.13 లక్షలు చెల్లించేలా అది కూడా రెవెన్యూ ఎన్‌ఓసీ, మైనింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి అన్ని అనుమతులు తీసుకునే గ్రావెల్ తవ్వేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పొలం యజమాని ఈ ఏడాది జనవరి 18న లీజుదారులను ప్రశ్నించి తవ్వకాలను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. భూ యజమాని దాసరి బాబురావు, ఆయన భార్య నాగలక్ష్మిపై లీజుదారులు దౌర్జన్యం చేసి దాడి చేశారు. అనుమతులు తీసుకున్నా తరువాతనే తవ్వకాలు చేయాలని లేదంటే మైనింగ్ ఆపివేయాలని చెప్పి పొలంలో కూర్చొంటే దెందులూరు పోలీసుల సాయంతో యజమానులను పంపివేశారు. తాజాగా 3వ తేదిన మళ్లీ పొలం వద్దకు వెళితే లీజుదారులు అడ్డుకోవడం, ఎస్సై వచ్చి స్టేషన్‌కు వచ్చి మాట్లాడమని అక్కడ నుంచి పంపడం, ఆ మరుసటి రోజు బాబురావు తన వాహనం (ఏపీ16 సీయూ8505) వేసుకుని పొలం వద్దకు వెళితే లీజుదారులు కారు ఎత్తుకెళ్లడంతో పాటు మళ్లీ ఘర్షణలకు దిగారు. ఆ మరుసటి రోజు కొందరు మహిళలు భూ యజమానిని అడ్డుకుని కేసు పెడతామని బెదిరించారు.
అనుమతులు లేకుండా అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు
మూడెకరాల్లో 2 వేలకుపైగా లారీల్లో గ్రావెల్ తరలింపు
తవ్వకాలు అడ్డుకున్న పొలం యజమానిపై దాడి, దౌర్జన్యం
ఫిర్యాదు చేసినా స్పందించని దెందులూరు ఎస్సై
భూయజమాని ఫిర్యాదులు పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం
పొలంలోకి వస్తే అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులు
ఎస్సై నుంచి కలెక్టరేట్ వరకు ఫిర్యాదులు చేసినా..
భూ యజమాని దాసరి బాబురావు దంపతులు దెందులూరు ఎస్సై, మైనింగ్ ఏడీకి, దెందులూరు తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, ఎస్పీ కార్యాలయానికి, డీఐజీ కార్యాలయానికి రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినా ఒక్క శాఖ కూడా పట్టించుకోలేదు. రెండురోజుల క్రితం ఏఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినా కనీసం స్పందించి తమకు న్యాయం చేయడం లేదని బాబు రావు ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలంలోకి తాను వెళితే అధికార పార్టీ పేరు చెప్పి దాడి చేసి దౌర్జన్యం చేస్తున్నారు. ఏ ఒక్క ప్రభుత్వ శాఖ కూడా పట్టించుకోవడం లేదని 7, 8 అడుగుల తవ్వాల్సిన గ్రావెల్ 15 అడుగుల మేర తవ్వేసి 2 వేల లారీల గ్రావెల్‌ను విక్రయించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment