దశాబ్దాల నిరీక్షణకు తెర
బొమ్మలరామారం: హాజీపూర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తికావడంతో బొమ్మలరామారం మండల ప్రజలకు దారి కష్టాలు తప్పనున్నాయి. జనవరిలో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. వారం రోజుల్లో ప్రారంభానికి తేదీ ఖరారు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలపడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షా కాలంలో షామీర్‌పేట వాగులో నీళ్లు నిల్వ ఉండడంతో మాచన్‌పల్లి– హాజీపూర్ గ్రామాలకు సంబంధాలు తెగిపోయేవి. దీంతో షామీర్ పేట వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూపులు చూసిన మండల ప్రజలకు బ్రిడ్జి వినియోగంలోకి వస్తే ఇబ్బందులు తొలగనున్నాయి.
పోరాట ఫలితంగానే బ్రిడ్జి నిర్మాణం
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ ఘటన సమయంలో మరో మారు బ్రిడ్జి నిర్మాణం తెరపైకి బలంగా వచ్చింది. హాజీపూర్ గ్రామానికి సరైన రోడ్డు రవాణా సౌకర్యం లేకనే సైకో శ్రీనివాస్ రెడ్డి ఇతర ప్రాంతాల్లో చదువుకునే అమ్మాయిలకు లిఫ్ట్ పేరుతో తన బైక్‌పై హాజీపూర్ గ్రామం వైపు తీసుకొచ్చి వారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడని భారీ ఎత్తున నిరసనలు, ధర్నాలు చేశారు. బ్రిడ్జి నిర్మాణం ఉంటే రోడ్డు రవాణా సౌకర్యం మెరుగుపడి తమ పిల్లలు హత్యలకు గురయ్యేవారు కాదని బాధిత కుటుంబాలు, ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. దీంతో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా 2020–21లో ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.631.52లక్షల నిధులు మంజూరు చేశారు.
పూర్తయిన హాజీపూర్ వంతెన
వచ్చే వారం ప్రారంభించేందుకు
సన్నాహాలు
హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు
దూరభారం తగ్గనున్న గ్రామాలు
హాజీపూర్ బ్రిడ్జి నిర్మాణంతో మండలంలోని చాలా గ్రామాలకు మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు వెళ్లడానికి దూరభారం తగ్గనుంది. కూరగాయల రైతులకు హైదరబాద్, భువనగిరి వైపు మార్కెట్‌కు తరలించేందుకు సౌలభ్యంగా మారనుంది. ప్రధానంగా మాచన్‌పల్లి, మర్యాల, నాయకుని తండా, పిల్లిగుండ్ల తండా,చౌదర్‌పల్లి, కాండ్లకుంట తండాలకు మండల కేంద్రం వెళ్లడానికి సౌకర్యవంతం కానుంది. హాజీపూర్, మైసిరెడ్డిపల్లి, బొమ్మలరామారం, నాగినేనిపల్లి, తిర్మలగిరి, మల్యాల, ఖాజీపేట్, రంగాపూర్, రామలింగంపల్లి, పెద్దపర్వతాపూర్ గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి దూరభారం తగ్గుతుంది. హైదరాబాద్ నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి హాజీపూర్ బ్రిడ్జి మీదుగా చేరుకోవచ్చు. జగదేవ్‌పూర్, గజ్వేల్ వైపు వెళ్లే ప్రయాణికులకు షార్ట్‌కట్‌గా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment