పకడ్బందీగా దేహదారుఢ్య పరీక్షలు
కడప అర్బన్: పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులకు కడప నగర శివార్లలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డి.టి.సి)లో దేహదారుఢ్య పరీక్షలు రెండవ రోజు మంగళవారం పకడ్బందీగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు దేహదారుఢ్య సామర్థ్య పరీక్షలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను పూర్తి చేసిన అభ్యర్థులకు సోమవారం నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లు ప్రారంభమయ్యాయన్నారు. జిల్లాలో 4,492 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారన్నారు. ప్రతి రోజూ అభ్యర్థులకు మొదటగా సర్టిఫికెట్స్ పరిశీలన, ఎత్తు, ఛాతీ వంటి ఫిజికల్ మెజర్‌మెంట్స్ చేస్తారని, తరువాత బయోమెట్రిక్ తీసుకుంటారన్నారు. దేహదారుఢ్య పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్‌జంప్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఎక్కడా ఎలాంటి ఆరోపణలు, పొరపాట్లకు తావులేకుండా ఆధునిక ఆర్.ఎఫ్.ఐ.డి కంప్యూటరైజ్డ్ టెక్నాలజీతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. డిజిటల్‌గా, పారదర్శకంగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నామన్నారు. దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం ఖచ్చితంగా ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరుకావాలని,నోటిఫికేషన్ వచ్చిన తరువాత జారీ చేసిన లేటెస్ట్ కులధృవీకరణ సర్టిఫికెట్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. ఆధార్, స్టేజ్–2, స్టడీ, మార్క్స్ లిస్ట్స్, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ సర్టిఫికెట్లు అటెస్ట్ చేసినవి తప్పనిసరిగా తీసుకుని రావాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఐటీకోర్ టీం, డీపీఓ కార్యాలయం సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment