మహిళ మృతిపై ఆందోళన
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స అనంతరం రమాదేవి (38) అనే మహిళ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్ల మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన వడ్డెరపు రమాదేవికి కడుపు నొప్పి రావడంతో ప్రొద్దుటూరులోని గాంధీరోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యుడు హెర్నియా కారణంగా కడుపునొప్పి వచ్చినట్లు నిర్ధారణ చేసి శుక్రవారం రాత్రి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం చికిత్స పొందుతున్న రమాదేవి శనివారం మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 వరకు వారు గాంధీరోడ్డుపై బైఠాయించారు. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి హాస్పిటల్‌లోని రమాదేవి మృతదేహాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. రమాదేవి భర్త శ్రీనివాసులు జువారి సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. వారికి జగదీష్ అనే కుమారుడితోపాటు రాధిక, చంద్రిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాధితులు రోడ్డుపై బైఠాయించడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించి పోయింది. సీఐలు గోవిందరెడ్డి, యుగంధర్, రామకృష్ణారెడ్డిలు సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. రాత్రి 9.45 సమయంలో కుటుంబ సభ్యులు రమాదేవి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కాగా ఇందులో వైద్యుడి నిర్లక్ష్యం లేదని, అనారోగ్యం కారణంగానే రమాదేవి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు మీడియా సమావేశంలో చెప్పడం చర్చనీయాంశమైంది.
రోడ్డుపై బైఠాయించిన బాధితులు
Comments
Please login to add a commentAdd a comment