ఉత్కంఠ భరితంగా రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ భరితంగా రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు

Published Sun, Jan 19 2025 1:36 AM | Last Updated on Sun, Jan 19 2025 1:36 AM

-

మదనపల్లె సిటీ : మదనపల్లె పట్టణం బీటీ కాలేజీ హాకీ మైదానంలో 14వ ఏపీ సబ్‌ జూనియర్స్‌ రాష్ట్ర స్థాయి బాలుర హాకీ పోటీలు ఉత్కంఠ భరితంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 22 జట్లు పాల్గొన్నాయి. మొదటి సెమీ ఫైనల్స్‌లో తిరుపతి–కడప జిల్లా జట్లు పోటీ పడ్డాయి. ఇందులో 5–1 స్కోరుతో కడప జిల్లా జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. కడప జట్టు నుంచి జాకీర్‌హుస్సేన్‌ రెండు గోల్స్‌, సాయిమోహన్‌ ఒక గోల్‌, బాలాజీ ఒక గోల్‌, మిథుల్‌కౌశిక్‌ ఒక గోల్‌ చేశారు. తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌ ఒక గోల్‌ చేశారు. రెండవ సెమీఫైనల్స్‌ మ్యాచ్‌లో అన్నమయ్య– అనకాపల్లి జట్లు పోటీ పడ్డాయి. 6–0 స్కోరుతో అనకాపల్లి జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్స్‌ మ్యాచ్‌ ఆదివారం కడప–అనకాపల్లి జట్ల మధ్య జరగనున్నట్లు హాకీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శివప్రసాద్‌, కోశాధికారి పి.ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఉదయం లీగ్‌, క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌ పోటీలు జరిగాయి. ఉదయం నుంచి హాకీ మైదానంలో క్రీడాకారులతో సందడి నెలకొంది. పోటీలను హాకీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు చాణిక్యరాజు, కోశాధికారి థామస్‌, కోచ్‌ నౌషాద్‌, కన్వీనర్‌ హితేష్‌రావు, పీడీలు శివప్రసాద్‌, జలజ తదితరులు పర్యవేక్షించారు.

ఆర్టీసీ బస్సులో మంటలు

సిద్దవటం : కడప– చైన్నె జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి పొగలు వచ్చాయి. డ్రైవర్‌ వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం పులివెందుల నుంచి చైన్నెకి వెళతుండగా సిద్దవటం మండలం భాకరాపేట మూడు రోడ్ల కూడలిలోకి వచ్చే సరికి.. ఒక్కసారిగా రేడియేటర్‌ వద్ద పొగతో కూడిన మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ అప్రమత్తమై ప్రయాణికులను దింపేశారు. స్థానికులు హుటాహుటిన బస్సులోని మంటలపై బిందెలతో నీళ్లు పోయడంతో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. దీంతో వాహనాలు దాదాపు 20 నిమిషాలు ఆగిపోయాయి. బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిని సురక్షితంగా వేరే బస్సులో ఎక్కించి వారి ప్రాంతాలకు తరలించామని ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర తెలిపారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లో సామగ్రి దగ్ధం

తంబళ్లపల్లె : ఇంటిలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. సంఘటన శనివారం వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని సాలివీధికి చెందిన కిషోర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గత సోమవారం తల్లి సరస్వతితో కలిసి సంక్రాంతి పండుగకు రాయచోటిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. వారు తిరిగి శనివారం ఉదయం ఇంటికి వచ్చి తలుపులు తెరవగా వస్తువులన్నీ కాలిబూడిదయినట్లు గుర్తించారు. ఇంటిలోని ఫ్రిడ్జ్‌, ఫ్యాన్లు, బట్టలు, ఫర్నీచర్‌ కాలిపోయాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగివుండవచ్చునని బాధితులు తెలిపారు. సుమారు రూ.6 లక్షల నష్టం వాటిలినట్లు వారు వాపోయారు.

తప్పిన ప్రమాదం ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement