ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఆందోళన
పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పంచాయతీ రామాయపల్లెకు చెందిన కారు రామయ్య (50) వైద్యం వికటించి మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఎస్‌ఐ కొండారెడ్డి కథనం మేరకు గురువారం అర్థరాత్రి రామయ్యకు కడుపులో మంటగా ఉందని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డాక్టర్ జనార్ధనరెడ్డి ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్ పరీక్షించి ఇంజెక్షన్, మందులు ఇచ్చారు. ఇంటికి వెళ్లగానే వాంతులు రావడం, కడుపులో బాధ అధికం కావడంతో మళ్లీ ఆసుపత్రికి వచ్చాడు. డాక్టర్ పరిశీలించి మరొక ప్రిస్కిప్సన్ రాశాడని, ఆ మందులు తీసుకొని ఇంటికి వెళ్లగా.. శరీరం నీలుక్కు పోతుండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తెచ్చారు. పరీక్షించిన డాక్టర్ రామయ్య మృతి చెందాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు.. ‘నీవే చంపావంటూ’ ఆందోళనకు దిగారు. దాంతో డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆసుపత్రి ఎదుట రాత్రంతా శవాన్ని ఉంచి బంధువులు డాక్టర్ నిర్లక్ష్యమే రామయ్య చావుకు కారణమంటూ కేకలు వేశారు. డాక్టర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం ఎస్‌ఐ వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపుతామని, రిపోర్టు వచ్చాక కేసు నమోదు చేస్తామని వారికి నచ్చజెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. రామయ్యకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారు గుండెలవిసేలా రోదించారు.
వైద్యం వికటించి మృతి చెందాడని
బాధితుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment