19న జిల్లా సమగ్రాభివృద్ధి ప్రణాళిక సదస్సు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : నగరంలోని రామకృష్ణ నగర్‌లో ఈ నెల 19న నిర్వహించే జిల్లా సమగ్రాభివృద్ధి–ప్రజా ప్రణాళిక అనే అంశంపై నిర్వహించే సదస్సును జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్.బాబురావు , రాయలసీమ గ్రాడ్యుయేట్స్ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్.ఎం.గేయానంద్ హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజల అనుకూల మేధావులు, విద్యార్థి, యువజన, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు. జిల్లాలోని బ్రహ్మంసాగర్, వెలుగొండ సర్వరాయసాగర్ రిజర్వాయర్లు పూర్తి అయ్యి దశాబ్దాలు గడుస్తున్నా.. వాటి కింద పంట కాలువలు, పిల్ల కాలువలు పూర్తి కాకపోవడం వల్ల చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదన్నారు. వెంటనే రూ.10 వేల కోట్లు విడుదల చేసి పనులు పూర్తి చేయాలన్నారు. కే.సీ.కెనాల్ స్థిరీకరణకు గుండ్రేవుల జర్వాయర్ పూర్తి చేయాలని, రాజోలి లిఫ్ట్ ఇరిగేషన్‌కు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ట్రిపుల్ ఐటీ ప్రిన్సిపల్ సెంటర్‌ను అమరావతికి తరలించే ప్రయత్నం విరమించుకోవాలరు. లేకపోతే భవిష్యత్తులో ప్రజా ఉద్యమం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.రామ్మోహన్, బి.మనోహర్, జిల్లా కమిటీ సభ్యులు బి.దస్తగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment