వృత్తి నైపుణ్యం పెంచుకుని మెరుగైన సేవలందించండి
కడప అర్బన్ : విధుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ఏ.ఆర్. అదనపు ఎస్పీ బి.రమణయ్య సూచించారు. జిల్లా సాయుధ పోలీసు బలగాలకు రెండు వారాల పాటు నిర్వహించే ‘మొబలైజేషన్’ కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఆయన శుక్రవారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో చేసే ప్రతి పనిలోనూ ఎంతో నేర్పరితనం, సమయస్ఫూర్తి, నైపుణ్యంతో కూడుకుని ఉంటాయన్నారు. ఇతర ఉద్యోగాల కంటే పోలీసు ఉద్యోగం భిన్నంగా వుంటుందన్నారు. ప్రజలు పోలీసులపై పెట్టుకున్న ఆశలు ఏమాత్రం సడలకుండా క్రమశిక్షణతో మెలగాల్సి వుంటుందన్నారు. ఏఆర్ సిబ్బందికి ప్రతి ఏటా మొబలైజేషన్‌ను నిర్వహించి విధుల్లో నైపుణ్యం, ఫిజికల్ ఫిట్‌నెనెస్‌ను మెరుగుపరచడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అంతేగాకుండా ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న తర్ఫీదు అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలిచ్చిన విధంగా సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు. బి.డిటీం, ప్రిజనర్స్, ఎస్కార్ట్, పి.ఎస్.ఓలు, డ్రైవర్లు, తదితర సిబ్బంది బాగా మెరుగు పరుచుకోవాలన్నారు. ఫైరింగ్, డ్రిల్, కవాతు, మాబ్ కంట్రోల్, ప్రముఖుల బందోబస్తు, తదితర విధులు సమర్థవంతంగా నిర్వహించేలా తర్ఫీదునిస్తారన్నారు. ఇదే సమయంలో మొబలైజేషన్‌కు వచ్చిన సిబ్బంది సంక్షేమం, ఆరోగ్య సమస్యలపై కూడా దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు ఆనంద్, శివరాముడు, వీరేష్, టైటాస్, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య
Comments
Please login to add a commentAdd a comment