రాయచోటి : జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో టీడీపీ వర్గీయుల గ్యాంగ్ దాష్టికానికి శనివారం తెల్లవారుజామున కారు దగ్ధమైంది. పట్టణ పరిధి కొత్తపల్లిలోని లాల్ మసీదు సమీపంలో నిలిపిన కారుకు టీడీపీకి చెందిన మైనార్టీ నాయకులు, వారి అనుచరులు నిప్పు పెట్టారు. తెల్లవారుజామున రెండు గంటల సమీపంలో కొంతమంది గ్యాంగ్ సభ్యులు కొత్తపల్లి వీధుల్లో తిరుగుతూ.. నిలబెట్టిన బైకులను పడదోస్తూ వీరంగం సృష్టించారు. అనంతరం కొద్దిసేపటికి మసీదు సమీపంలో నిలిపిన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. పట్టణానికి చెందిన టీడీపీ నేత ఖాదర్ బాషా అనుచరుల వీరంగం అధికమైందని స్థానిక మైనార్టీలు వాపోతున్నారు. కారు దగ్ధం ప్రమాదం కూడా ఖాదర్ బాషా అనుచరులు సయ్యద్, డాకు అనే గ్యాంగ్ సభ్యుల కారణంగానే సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment