సమాజ సేవే ‘రెడ్ల’ ధ్యేయం
కడప కల్చరల్ : సమాజానికి అవసరమైనపుడు తన సేవలను ప్రాణాలకు తెగించి, త్యాగాలు చేసి మనిషిగా తన బాధ్యతను చాటుకున్నవాడు నిజమైన రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అన్నారు. రెడ్డి సేవా సమితి సంస్థ కడప శాఖ ఆధ్వర్యంలో శనివారం నగర పరిధిలోని డీఎస్‌ఆర్ కల్యాణ మండపంలో రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రోలయ వేమారెడ్డి నుంచి నేటి వరకు అనేక మంది రెడ్లు దేశానికి అనేక రంగాల్లో సేవలందించారన్నారు. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మొదలుకొని తెలుగునేలపై 11 మంది రెడ్లు ముఖ్యమంత్రులుగా సేవలందించారన్నారు. కార్యక్రమంలో ముందుగా ‘మేలుకొలుపు’ ప్రత్యేక సంచికను ఆయన అతిథులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత పుత్తా పుల్లారెడ్డి రచించిన ‘మహాభారత విజ్ఞాన సర్వస్వం’ నాలుగు సంపుటాలను ఆవిష్కరించి, రచయితకు ‘సాహిత్య రత్నాకర’ బిరుదు ప్రదానం చేశారు. విశిష్ట అతిథి, రాజంపేట శాసన సభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ రెడ్లలో అనేక తెగలు ఉన్నా.. రెడ్లందరూ ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో ఉన్న విశ్వవిద్యాలయానికి యోగి వేమన విశ్వవిద్యాలయం పేరు పెట్టడం గర్వకారణమన్నారు. సభాధ్యక్షులు, రెడ్డి సేవాసమితి అధ్యక్షులు ఆచార్య కుప్పిరెడ్డి నాగిరెడ్డి మాట్లాడుతూ సంస్థ ఆవిర్భావ వికాసాలను సభకు పరిచయం చేశారు. ప్రధాన కార్యదర్శి లెక్కల కొండారెడ్డి నివేదిక సమర్పిస్తూ సంస్థ పుట్టిన 25 ఏళ్లుగా వరద, కరోనా బాధితులు, పేద రైతులు, విద్యార్థులకు చేసిన అనేక సేవా కార్యక్రమాలను సభకు తెలియజేశారు. ఆత్మీయ అతిథి, శాసనమండలి సభ్యులు ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పది మందికి అన్నం పెట్టే గుణం రెడ్లకుంటుందని, ఆ దిశగా సేవలందిస్తూ రెడ్డి సేవాసమితి ఏర్పాటు కావడం వారికి ఎంతో సహకారాన్ని అందించినట్లయిందన్నారు.
ఎందరో విద్యార్థినులకు ఆశ్రయం
ప్రత్యేక అతిథి, యోగి వేమన విశ్వవిద్యాలయం సహ ఆచార్యులు కొవ్వూరు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పాతికేళ్లుగా విద్య, వసతిని కల్పించి ఎందరో విద్యార్థినులకు ఆశ్రయం కల్పిస్తున్న రెడ్డి సేవాసమితి సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రతి రెడ్డికి ఆత్మాభిమానంతోపాటు వినయం కూడా ఉండటం అవసరమన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు, హంస అవార్డు గ్రహీత డాక్టర్ నరాల రామారెడ్డి మాట్లాడుతూ గతంలో తనను గండపెండేర సత్కారంతో సత్కరించిన సందర్భాన్ని గుర్తుకు చేశారు. రెడ్డి సేవాసమితి అభ్యుదయం దిశగా సేవలందించడం వెనుక నిర్వాహకుల కృషిని కొనియాడారు.
వేమన పద్యం మార్గదర్శకం
ప్రత్యేక ఆహ్వానితులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వేమన పద్యాలు నాటి, నేటి, రేపటి సమాజానికి మార్గదర్శకాలన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు, ప్రముఖ జానపద పరిశోధకులు ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి రాయలసీమ జానపద గేయాలను ఆలపించి సభను అలరింపజేశారు. ప్రత్యేక ఆహ్వానితులు కొండా లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ రెడ్డి సేవా సమితి ఆవిర్భావం వెనుక సహకరించిన దాతలను సభకు తెలియజేశారు. యలమర్తి మధుసూదన్‌వేమన పద్యాలను గానం చేశారు. వేమన పద్యపఠన పోటీల్లో విజేతలైన విద్యార్థులను నగదు బహుమతి, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. అతిథులను, ‘మేలుకొలుపు’ సంచిక సంపాదకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, డాక్టర్ చింతకుంట శివారెడ్డి, డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి, డాక్టర్ అనుగూరు చంద్రశేఖరరెడ్డి, కొండూరు జనార్దనరాజు, చదలవాడ వెంకటేశ్‌లను, రెడ్డి సేవా సమితి సంస్థ అభివృద్ధికి తోడ్పడిన దాతలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. గుడ్ల ఆదినారాయణరెడ్డి వందన సమర్పణ చేశారు. వైఎస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి సభాసమన్వయం చేశారు. కార్యక్రమంలో పద్మప్రియ చంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులు, రెడ్డి ప్రముఖులు పాల్గొన్నారు.
జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి
ఘనంగా రెడ్డి సేవా సమితి రజతోత్సవ వేడుకలు
‘మేలుకొలుపు’ సంచిక ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment