●మైదుకూరులో సీఎం చంద్రబాబు గ్రీన్‌ వాక్‌ | - | Sakshi
Sakshi News home page

●మైదుకూరులో సీఎం చంద్రబాబు గ్రీన్‌ వాక్‌

Published Sun, Jan 19 2025 1:50 AM | Last Updated on Sun, Jan 19 2025 1:50 AM

●మైదు

●మైదుకూరులో సీఎం చంద్రబాబు గ్రీన్‌ వాక్‌

మైదుకూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు మరోసారి మొండిచేయి చూపించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన బాబు ఈ ప్రాంత అభివృద్ధికి వరాలు ప్రకటిస్తారని జిల్లా ప్రజలు ఆశించారు. జిల్లా సంగతి దేవుడెరుగు.. చివరికి తాను పర్యటించిన మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై కూడా మాట్లాడకుండా ‘గల్లా పెట్టె ఖాళీ’ అంటూ ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. మైదుకూరులో శనివారం జరిగిన ఎన్టీఆర్‌ వర్థంతి సభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అంతకు ముందుకు మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కడప జిల్లా రైతాంగానికి మేలు చేసే రాజోలి ఆనకట్టను పూర్తి చేయాలని, మైదుకూరులో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరారు. మైదుకూరు మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణానికి రూ.50కోట్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.50కోట్ల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మైదుకూరులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఉర్దూ జూనియర్‌ కళాశాలలకు సొంత భవనాలను నిర్మించాలని కోరారు. ఎగుమతి రకం కేపీ ఉల్లి అభివృద్ధి కోసం కోల్డ్‌ స్టోరేజీని ఏర్పాటు చేయాలని, ఇంటింటికి తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేసే బృహత్తర నీటి పథకం కోసం రూ.90కోట్లను మంజూరు చేయాలని, చేనేతలకు పనులు కల్పించాలని, మైదుకూరులో క్రీడల అభివృద్ధి కోసం మినీ స్టేడియం నిర్మించాలని కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ చేంతాడంత కోరికల జాబితా ఇచ్చాడని అవన్నీ తీర్చడానికి.. గల్లా పెట్టె ఖాళీగా ఉంది.. చేయలేనని సభాముఖంగానే తోసిపుచ్చారు. దాంతో కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు, ప్రజలు నిరాశకు గురయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం.. సంపదను సృష్టిస్తామని గొప్పలు చెప్పే చంద్రబాబుకు ఈ జిల్లాకొచ్చేసరికి ‘గల్లాపెట్టె ఖాళీ’ విషయం గుర్తుకొచ్చిందా అని జనం మండిపడుతున్నారు. సీమపై.. కడపపై ఎప్పుడూ కడుపుమంటేనని పలువురు విమర్శిస్తున్నారు.

● స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మైదుకూరు మున్సిపాలిటీలో 12 కి.మీ. మేర సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీల విషయంలో మైదుకూరును మోడల్‌గా తీసుకుని మురికి నీటిని శుద్ధిచేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తెలుగు వారి ఆత్మ గౌరవం ఎన్టీఆర్‌..

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా మైదుకూరులో శనివారం ఎన్టీఆర్‌ 29వ వర్థంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. స్థానిక కేఎస్‌సీ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం తాను చేసిన ప్రసంగంలో ఎప్పుడూ చెప్పే పాత విషయాలనే వల్లె వేశారు. పేదలకు పక్కా ఇళ్లు, వృద్ధులకు రూ.35లు పింఛను అందించిన ఘనత ఎన్టీఆర్‌ది అని.. తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు తీసుకొచ్చారంటూ గొప్పలు చెప్పుకొచ్చారు. కడప జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తాం.. రాబోవు రోజుల్లో జిల్లాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాం.. అంటూ పాత డైలాగులే చెప్పారు. ఈ ఏడాది 4వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని, పోలవరం నుంచి 200 టీఎంసీల నీళ్లు రాయలసీమకు వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని ‘నీటి మాటలు’ చెప్పారు. పోలవరం నీటిని బనకచర్లకు తీసుకురావడమే తన జీవితాశయం అన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధికి కేంద్రం రూ.2300 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. భవిష్యత్తులో కడప ఎయిర్‌పోర్టు నుంచి అనేక నగరాలకు విమానాలు నడిపేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.80 కోట్లతో గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాజోలిని పూర్తి చేసి 90వేల ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత, రవాణా శాఖ మంత్రి రామప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్‌, వరదరాజులరెడ్డి, ఆర్‌.మాధవి, ఆదినారాయణరెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మె పేరు లావణ్య. మైదుకూరులోని పార్వతీనగర్‌. భర్త రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. పెద్ద కొడుకేమో ఇదిగో ఇలా చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. దివ్యాంగుల పింఛన్‌ కోసం ఆర్నెళ్లుగా తిరుగుతూనే ఉంది. సీఎంకు విన్నవించుకుందామని ఆశగా ఇక్కడికి వచ్చింది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అర్జీ తీసుకుని పంపించారు. ఈసారైనా పింఛన్‌ మంజూరవుతుందో లేదో చూడాలి మరి.

పట్టించుకునేవారేరి!

‘పాపం హరి’...

స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర.. కార్యక్రమంలో భాగంగా శనివారం మైదుకూరులో సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్‌ వాక్‌ పేరుతో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి మైదుకూరులో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మైదుకూరు పట్టణంలోని రాయల కూడలి నుంచి మంత్రి సవితా, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉపాధ్యా యులు, విద్యార్థులతో కలసి స్థానిక జెడ్పీ హైస్కూల్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ హైస్కూల్‌ వద్ద పారిశుధ్య వాహనాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం హైస్కూల్‌లో జరిగిన స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజావేదికలో మైదుకూరు మున్సిపాలిటీకి చెందిన పారిశుధ్య కార్మికులు చెన్నమ్మ, అమ్ముళ్లమ్మ, కంపాక్టర్‌ వాహన డ్రైవర్‌ గంగాధర్‌లను సీఎం చంద్రబాబు సత్కరించారు. కేంద్రం పారిశుధ్యకార్మికులకు అవార్డులు ఇస్తున్న తరహాలోనే రాష్ట్రంలో కూడా వారికి అవార్డులు ఇస్తామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. ఈ మేరకు మైదుకూరు మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు రూ.లక్ష నగదు బహుమతులను ప్రకటించారు. అనంతరం ‘స్వచ్ఛ ఆంధ్ర ’ ప్రతిజ్ఞ చేయించారు.

పార్టీలో ఆయన సీనియర్‌ నాయకుడు... ఇదివరకు చంద్రబాబు పాల్గొన్న వేదికలపై చాలాసార్లు ఆశీనులయ్యాడు. తాజాగా మైదుకూరు సభలోనూ వేదికపైకి వచ్చాడు. ఏమైందో ఏమో.. ప్రొటోకాల్‌లో పేరు లేదంటూ సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో ఇదిగో ఇలా వెనుదిరిగాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
●మైదుకూరులో సీఎం చంద్రబాబు గ్రీన్‌ వాక్‌ 1
1/1

●మైదుకూరులో సీఎం చంద్రబాబు గ్రీన్‌ వాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement