TS Special
-
ఐదెకరాలా.. పదెకరాలా?
సాక్షి, హైదరాబాద్: రైతులకు పంట పెట్టుబడికోసం ఆర్థిక సాయం అందించే రైతుభరోసా (రైతుబంధు) పథకానికి సీలింగ్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సాయాన్ని ఐదెకరాలకా లేదా పదెకరాలకా.. ఎంతకు పరిమితం చేస్తే బాగుంటుందన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. ఐదెకరాలకే పరిమితం చేస్తే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలకు రైతుభరోసా ఇవ్వకూడదని భావిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలి బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధును పునఃసమీక్షిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకంతో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారన్నది కొత్త సర్కారు ఉద్దేశం. దీనికి అనుగుణంగా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీలోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్’ను సంప్రదించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు, బీడు భూములను గుర్తించి.. ఆ వివరాల ఆధారంగా రైతు పెట్టుబడి సాయానికి పరిమితులు విధించనున్నారు. దీనిపై మార్గదర్శకాలను రూపొందించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతుభరోసా అమలులోకి రానుంది. ఇచ్చే మొత్తం పెంచి.. 90% మందికే ఇచ్చి.. రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదట్లో ప్రతీ సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులందరికీ ఇచ్చారు. ఇలా ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున అందేవి. తర్వాత ఈ సొమ్మును ప్రభుత్వం సీజన్‌కు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ. 10 వేలు చేసింది. అంటే రెండు సీజన్లు కలిపి 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు ఏటా సుమారు రూ.15,250 కోట్లు అందజేశారు. కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.22,800 కోట్లు అవుతుంది. అలాకాకుండా ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులనే పరిగణనలోకి తీసుకుంటే.. పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతుల్లో వారు 62.34 లక్షల మంది ఉన్నారు. అంటే.. మొత్తం లబ్దిదారుల్లో 90.36 శాతం. వీరికి మాత్రమే రైతుభరోసా పరిమితం చేయాలనుకుంటే.. రూ. 15వేల కోట్లు ఇస్తే సరిపోతుందని అంచనా. దీనివల్ల గత ప్రభుత్వం కన్నా రూ.5 వేలు ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుందని.. అదే సమయంలో ఏటా ఇచ్చే మొత్తంలో పెద్దగా మార్పు ఉండదని అధికార వర్గాలు చెప్తున్నాయి. పైగా రూ. 7,800 కోట్లు ఆదా చేసుకోవచ్చని అంటున్నాయి. వాళ్లందరికీ కట్..! సాగుభూములకే రైతుభరోసా ఇస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. సాగుచేయని, సాగుకు పనికిరాని కొండలు, గుట్టలకు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలాలకు కూడా రైతుబంధు ఇచ్చారని ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా సాగు, బీడు భూములను గుర్తించనున్నామని.. తద్వారా అనర్హులను తొలగిస్తామని వ్యవసాయ శాఖ చెబుతోంది. అలాగే రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను కట్టేవారికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వకూడదని భావిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వంపై రైతుభరోసా భారం మరింత తగ్గుతుందని పేర్కొంటున్నారు. -
జాహ్నవి మృతిపై అమెరికా కోర్టు తీర్పు.. స్పందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పు కామెంట్స్‌ను కేటీఆర్ ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించారు. కాగా, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్‌పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు వ్యాఖ్యలు చేసింది. అతడిపై ఎలాంటి చర్యలు ఉండబోవని తెలిపింది. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకొని, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలి. అనేక ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం. అయితే ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరం అని కామెంట్స్ చేశారు. Disgraceful & absolutely unacceptable ! I demand the @USAmbIndia to take up the matter with US Government authorities and deliver justice to the family of young Jaahnavi Kandula I request EA Minister @DrSJaishankar Ji to take up the matter with his counterpart & demand a… https://t.co/90pw59LtCo — KTR (@KTRBRS) February 22, 2024 ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. గతేడాది అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జాహ్నవి మృతి చెందింది. రోడ్డు దాటుతున్న ఆమెను.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి కెవిన్ డేవ్ చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. స్థానిక మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో కెవిన్ విధి నిర్వహణలోనే ఉన్నారు. ఆ రూటులో స్పీడ్ లిమిట్ 40 మైళ్లు మాత్రమే. కానీ, కెవిన్ తన కారును 100 మైళ్లకు పైగా వేగంతో నడిపారు. ఎమర్జెన్సీ హారన్ ఇవ్వలేదుగానీ.. లైట్లను వెలిగించుకుంటూ వెళ్లారు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న జాహ్నవి.. అత్యంత వేగంతో కారు దూసుకురావడాన్ని అంచనా వేయలేకపోయారు. కారు నడుపుతున్న కెవిన్ డేవ్ కూడా జాహ్నవిని ఢీకొట్టడానికి ఒక్క సెకను ముందు మాత్రమే బ్రేకులు వేశాడు. కారు బలంగా ఢీకొట్టడంతో జాహ్నవి ఎగిరి 100 మీటర్లకు పైగా దూరంలో పడిపోయారని సీటెల్ పోలీసులు తమ నివేదికలో రిపోర్టులో పేర్కొన్నారు. -
మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కరణ.. గద్దెపైకి సమ్మక్క
ములుగు, సాక్షి: ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ.. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర బుధవారం ప్రారంభమైంది. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు మొదటిరోజు తండోపతండాలుగా తరలి వచ్చారు. రెండో రోజైన ఇవాళ.. మేడారంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. సమ్మక్క తల్లి ఇవాళ గద్దెపై కొలువు దీరింది. సమ్మక్కను ప్రధాని పూజారి ప్రతిష్టించారు. మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు చిలకల గుట్ట నుంచి సమ్మక్కను మేడారానికి తీసుకురావడమే ఈ జాతరలో అసలైన ఘట్టం. ఇవాళ కుంకుమ భరణి రూపంలో సమక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు. ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క సమ్మక్కకు ఆహ్వానం పలికారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించారు. మేడారం జన జాతరగా మారింది. గత రాత్రి సారలమ్మతో పాటు సారలమ్మ, పడిగిద్ద రాజు, గోవిందా రాజులు గద్దెపై కొలువుదీరారు. వనదేవతలకు మొక్కు చెల్లించుకునే క్రమంలో.. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన సమక్క-సారలమ్మ వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. -
TSPSC: ఏ క్షణమైనా సర్టిఫికెట్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే పలు కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (175), డ్రగ్ ఇన్స్పెక్టర్ (18), హార్టీకల్చర్ ఆఫీసర్ (22), ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని లైబ్రేరియన్ (77), అసిస్టెంట్ మోటార్ Ððవెహికిల్ ఇన్స్పెక్టర్ (117), గ్రూప్–4 (8180) పోస్టులకు సంబంధించి వెబ్సైట్లో జీఆర్ఎల్ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో కేటగిరీల వారీగా మెరిట్ సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను కమిషన్ అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే వేగంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి ఆ తర్వాత తుది జాబితాలు విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కోసం అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు అభ్యర్థులు అందుబాటులో ఉంచుకోవాలి. అదేవి ధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, వివిధ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన తేదీలతో కూడిన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవా లి. ఏ క్షణంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఖరారు కావచ్చునని టీఎస్పీఎస్సీ తెలిపింది. మున్సిపల్ శాఖలో వివిధ పోస్టులకు జీఆర్ఎల్ విడుదల పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును కమిషన్ విడుదల చేసింది. ఈ జాబితాను కమిన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎట్టకేలకు ‘రూట్’ క్లియర్
సాక్షి, హైదరాబాద్: వివాదాలు.. ఉద్యమాలు.. వ్యతిరేకతలతో ఒక్క అడుగు కూడా ముందుకు పడ కుండా పోయిన ఓ జాతీయ రహదారి కథ కొలిక్కి వచ్చింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఇది రాష్ట్రంలో మరో ఎక్స్‌ప్రెస్ వే తరహాలో పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా రూపుదిద్దుకోబోతోంది. 131.8 కి.మీ. మేర నిర్మించే నాలుగు వరసల రహదారిలో 46 వంతెనలతో పాటు ఆర్ఓబీలు, అండర్‌పాస్‌లు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతుండటంతో.. నిజామాబాద్– ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ ఎన్‌హెచ్ 63పై ట్రక్కులు ఎక్కువగా తిరుగుతుంటాయి. రెండు లేన్లతో ఇరుగ్గా ఉన్న రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారటంతో 4 వరసలకు విస్తరించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. ఇందులో నిజామాబాద్ నుంచి ఆర్మూరు శివారులోని హైవే 44 వరకు, తిరిగి మంచిర్యాల దాటిన తర్వాత ఉండే హైవే 363 నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు చెన్నూరు వరకు.. రాష్ట్రప్రభుత్వ ఆదీనంలోని హైవేల విభాగం విస్తరిస్తుంది. ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు కీలక నిర్మాణం అయినందున దాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించారు. రాష్ట్ర విభాగం ఇప్పటికే ఆ రోడ్డును అవసరమైన ప్రాంతాల్లో 4 వరసలుగా మార్చడం, మిగతా చోట్ల మెరుగుపరచటం చేస్తోంది. అయితే ఎన్హెచ్ఏఐకి అప్పగించిన ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు పట్ణణాలు, గ్రామాల మీదుగా సాగుతున్నందున దాన్ని పూర్తి గ్రీన్‌ఫీల్డ్ హైవేగా మార్చాలని భావించారు. కానీ అందుకు భారీ మొత్తంలో సాగు భూములు సేకరించాల్సి రావటంతో రైతులు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఉన్న రోడ్డునే విస్తరించాలని భావించారు. కానీ, పట్టణాలు, గ్రామాల్లో భారీగా నిర్మాణాలను తొలగించాల్సి రావటంతో ఈసారి పట్టణ, గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో ఈ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. చివరకు పట్టణాలు, గ్రామాలున్న చోట బైపాస్‌లు నిర్మించి, మిగతా రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. గత నెల్లో టెండర్లు పిలవగా, ఇప్పుడు వాటిని ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రోడ్డు నిర్మాణంపై బుధవారం ఢిల్లీలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. రోడ్డు డిజైన్, ఎలివేటెడ్ కారిడార్ నమూనాలు, రహదారులను క్రాస్ చేసేందుకు వీలుగు చేయాల్సిన ఏర్పాట్లు తదితరాలపై చర్చించారు. నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుని త్వరలో పనులు మొదలుపెట్టాలని నిర్ణయించారు. నో డైరెక్ట్ క్రాసింగ్: ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేటల మీదు గా సాగుతుంది. ఈ మార్గంలో 100 కి.మీ.ల మేర బైపాస్‌లే ఉండనున్నందున ఈ రోడ్డు దాదాపు కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే తరహాలోనే ఉండనుంది. ఆయా పట్టణాల వద్ద 6 కి.మీ. నుంచి 12 కి.మీ. మేర భారీ బైపాస్‌లు ఉంటాయి. ఇవి కాకుండా మరో 8 ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లు నిర్మిస్తారు. ఇది పూర్తి యాక్సె స్ కంట్రోల్డ్ రహదారి (ఇతర రోడ్లు దీన్ని నేరుగా క్రాస్ చేయడానికి అవకాశం ఉండదు) కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తారు. బైపాస్‌ల కోసం 500 హెక్టార్ల భూమిని సేకరించారు. దీనికే రూ.900 కోట్లుఖర్చవుతోంది. ఇక వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్ఓబీలు దాదాపు 46 వరకు ఉంటాయి. -
ఎండలు పెరిగాయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు చిటపటమంటున్నాయి. వేసవి సీజన్ రాకముందే ఎండల తీవ్రత వేగంగా పెరిగింది. ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఏకంగా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కావడంగమనార్హం. పగటి ఉష్ణోగ్రతలకు తోడుగా రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉషోగ్రత భద్రాచలంలో 36.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్‌లో 18.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఖమ్మంలో 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా.. గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల మేర అధికంగా నమోదు కాగా... హైదరాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 3 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. మిగతా కేంద్రాల్లో 2 డిగ్రీల్లోపు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో పగటి పూట ఉక్కపోత పెరిగింది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రత మరింత అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
నకిలీ పత్రాలు.. ఫోర్జరీ సంతకాలు
గచ్చిబౌలి (హైదరాబాద్): ఫోర్జరీ డాక్యుమెంట్లతో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు బురిడీ కొట్టించాలనుకున్న టీవీ–5 సాంబశివరావుకు బుర్ర తిరిగిపోయే ఎదురుదెబ్బ తగలింది. పచ్చ మీడియాలో ఒకటైన టీవీ–5లో సాంబశివరావు కీలకంగా వ్యవహరిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. కాగా భూ యజమానికి తెలియకుండా నకిలీ పత్రాలతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆయ న నడిపిస్తున్న పెట్రోల్ బంక్‌ను హెచ్‌పీసీఎల్ ప్రతినిధులు బుధవారం సీజ్ చేశారు. ఫోర్జరీ సంతకాలతో ప్లాట్‌ను అగ్రిమెంట్ చేసుకొని, దాన్ని హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇచ్చాడని ప్లాట్ యజమాని సరనాల శ్రీధర్‌రావు హెచ్‌పీసీఎల్‌కు చేసిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో కంపెనీ అధికారులు రంగంలోకి దిగారు. ఫోర్జరీ చేసిన స్థలానికి బుధవారం కంచె వేయడంతో పాటు పెట్రోల్ బంక్‌ను పాక్షికంగా సీజ్ చేశారు. ఆ స్థలంలో ఉన్న పెట్రోల్ పంపులను మూసి వేశారు. ఆయిల్ సంస్థలతో మంచి సంబంధాలున్నాయని నమ్మించి.. సాంబశివరావుపై ఇటీవల మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సరనాల శ్రీధర్ భార్యకు శేరిలింగంపల్లిలోని మాదాపూర్ గ్రామం, సర్వే నంబరు–64, హుడా టెక్నో ఎన్క్లేవ్, సెక్టార్– 3లోని ప్లాట్ నంబరు–26లో 600 చదరపు మీటర్ల (717.60 చదరపు గజాలు) స్థలం ఉంది. 2018లో సాంబశివరావు వీరిని కలిసి, తనకు ఆయిల్ సంస్థలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ డీలర్షిప్ ఇప్పిస్తామని నమ్మించాడు. ప్లాట్‌కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా నకిలీపత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో భూ యజమానులకు తెలియకుండా పెట్రోల్ బంక్ డీలర్‌షిప్‌ను డాక్టర్ కొల్లి సౌమ్య పేరు మీదకు సాంబశివరావు బదలాయించాడు. జర్నలిస్టులు, పోలీసుల పేరుతో భయపెట్టి.. తన స్థలంలో అక్రమంగా పెట్రోల్ బంక్‌ను నడుపుతున్నట్లు తెలుసుకున్న శ్రీధర్‌రావు షాక్‌కు గురయ్యారు. 2021లో దీనిపై సాంబశివరావును నిలదీశారు. దీంతో సాంబశివరావు ఎదురుదాడికి దిగాడు. హెచ్పీసీఎల్తో డీలర్షిప్ అగ్రిమెంట్‌కు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. రాజకీయ నాయకులు, జర్నలిస్ట్‌లు, పోలీసు అధికారులతో తనకున్న పరిచయాలను ప్రస్తావిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయభ్రాంతులకు గురైన శ్రీధర్‌రావు ఆ డీలర్‌షిప్‌ను తమ పేరు మీదకు బదలాయించాలని కోరారు. లక్షల్లో వసూలు చేసి డీలర్షిప్ బదలాయించకుండా.. అయితే కొంత నగదు చెల్లిస్తేనే డీలర్‌షిప్‌ను బదలాయిస్తానని సాంబశివరావు చెప్పాడు. వేరే దారిలేక 2021, మార్చిలో రూ.లక్షల్లో నగదు బదలాయించామని శ్రీధర్‌రావు పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపారు. అయినప్పటికీ డీలర్‌షిప్‌ను బదలాయించకపోవడంతో ఈ ఏడాది జనవరి 31న శ్రీధర్‌రావు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్‌పీసీఎల్ ప్రతినిధులకు సైతం శ్రీధర్‌రావు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హెచ్‌పీసీఎల్ అధికారులు సాంబశివరావు నడుపుతున్న పెట్రోల్ బంక్‌ను సీజ్ చేశారు. చీటింగ్ కేసును నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫలించిన నిరీక్షణ
సిరిసిల్ల: 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. దుబాయ్ జైల్లో బందీలుగా ఉన్న ఇద్దరు విడుదలై ఇల్లు చేరా రు. చాలాకాలానికి ఇల్లు చేరిన వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. 2005 లో దుబాయ్ వెళ్లిన వలసజీవులు.. అక్కడ హత్య కేసులో ఇరు క్కుని 18 ఏళ్లపాటు శిక్ష అనుభవించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల శివారులోని పెద్దూరు ఒడ్డెరకాలనీకి చెందిన శివరాత్రి మల్లేశం(48), శివరాత్రి రవి (45) బుధవారం ఇంటికి వచ్చారు. వీరు దుబాయ్‌లో కల్లీవెల్లి వీసా(కంపెనీ వీసా కాదు)పై పనిచేశారు. 2006లో దుబాయ్‌లో నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు హత్య కేసులో నలుగురు పాకిస్తానీయులు, ఆరుగురు తెలంగాణవాసులకు అక్కడి కోర్టు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయు లు, కరీంనగర్ జిల్లాకు చెందిన సయ్యద్ కరీం ఇప్పటికే విడుదలయ్యారు. సిరిసిల్లకు చెందిన మల్లేశం, రవి, కోనరావుపేటకు చెందిన లక్ష్మణ్, జగిత్యాల జిల్లాకు చెందిన శివరాత్రి హన్మంతు, చందుర్తి మండలం మల్యాలకు చెందిన నాంపల్లి వెంకటి జైలు శిక్షను పొడిగించడంతో బందీలుగా ఉన్నారు. వీరిలో లక్ష్మణ్, హన్మంతు ఇటీవల విడుదలకాగా.. తాజాగా మల్లేశం, రవి విడుదలయ్యారు. వెంకటి మరో నెల రోజుల్లో విడుదల కానున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వీరి విడుదల కోసం ఎంతో కృషిచేశారు. మ ల్లేశం, రవికి విమాన టికెట్లు, హైదరాబాద్ నుంచి పెద్దూ రు చేరేందుకు వాహనాన్ని కేటీఆర్ ఏర్పాటు చేశారు. మల్లేశం, రవి కుటుంబ సభ్యులతో అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ ఫోన్లో మాట్లా డారు. బాధితుల కుటుంబ సభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
అవిశ్వాసాలు @ 30 మున్సిపాలిటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణ పాలక మండళ్లలో మొదలైన అవిశ్వాసాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు 34 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్ / చైర్పర్సన్ / వైస్ చైర్మన్ లేదా మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదిస్తూ నోటీసులు జారీ చేయగా, 30 చోట్ల ప్రత్యే క సమావేశాలు నిర్వహించారు. అవిశ్వాస పరీక్షల్లో ఓడిపోయిన వారిలో 15 మందిని పదవుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. మిగతా 15 చోట్ల నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. 9 మున్సిపాలిటీల్లో కొత్త చైర్పర్సన్లు అవిశ్వాస తీర్మానాలు నెగ్గి పదవుల నుంచి దిగిపోయిన చైర్మన్లు, వైస్ చైర్మన్ల స్థానంలో కొత్త వారిని ఎన్నుకొనే ప్రక్రియ కూడా 9 మున్సిపాలిటీల్లో పూర్తయింది. మహబూబ్‌నగర్, నేరేడిచర్ల, కోదాడ, భూపాలపల్లి, నస్పూర్, మంచిర్యాల, నల్గొండ, వేములవాడ, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో కొత్త వారు కొలువు దీరారు. జగిత్యాల, భువనగిరి, ఖానాపూర్, హుజూర్నగర్, సుల్తానాబాద్, నారాయణఖేడ్ మునిసిపాలిటీల్లో ఈనెల 28న ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, కొత్త చైర్మన్/వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నాగారం, మణికొండ, తూంకుంట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు జారీ చేసినప్పటికీ, సమావేశం తేదీలను నిర్ణయించలేదు. కాగా బండ్లగూడ జాగీర్, జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. మరికొన్ని పట్టణాల్లో అవిశ్వాస నోటీసులు రాష్ట్రంలోని 142 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి ఇప్పటి వరకు 34 చోట్ల అవిశ్వాస నోటీసులు జారీ అయినప్పటికీ, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పురపాలక వర్గాలు చెపుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ సాగుతోంది. మొత్తంగా కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాలలోని పట్టణాల పరిధిలో మెజారిటీ మునిసిపాలిటీలను లోక్‌సభ ఎన్నికల లోపు హస్తగతం చేసుకొనే ఆలోచనలో అధికార పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తాము రాజకీయాలు చేయడం లేదని, తమ దృష్టి అంతా అభివృద్ధి పైనే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సీఐఐ– తెలంగాణ, టీడీఎఫ్– యూఎస్ఏల ఆధ్వర్యంలో విద్య, నైపుణ్య అభివృద్ధి, వాణిజ్య అవకాశాలు అనే అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, తరువాత రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రూ. 2,000 కోట్లతో 64 ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అలాగే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫెకెట్స్ ఇస్తామని వెల్లడించారు. ఈ ప్రభుత్వం అందరిదని, ప్రజలు కోరుకుంటేనే అధికారంలోకి వచ్చామని అన్నారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పారు. గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని, ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్‌లైన్ గా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం, సీఐఐ ప్రతినిధులు వగీశ్ దీక్షిత్, జి.గోపాల్‌రెడ్డి, సి. శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
TSRTC: ఓవైపు బస్సుల్లేవ్.. మరోవైపు హౌజ్‌ఫుల్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వినియోగించనుండటంతో సాధారణ ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈసారి జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భారీ సంఖ్యలో బస్సులను సమకూర్చింది. 4,479 ఆర్టీసీ బస్సులతో పాటు పాఠశాల, కళాశాల బస్సుల్లాంటి ప్రైవేటు వాహనాలు మరో 1,500 వరకు ఏర్పాటు చేసింది. ఇలా సుమారు 6 వేల బస్సులు ఐదు రోజుల పాటు మేడారం భక్తుల సేవలో ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు నిర్దిష్ట ప్రాంతాలకు తరలిపోవడంతో బస్స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇక ఒకేసారి పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులో లేకపోతే సాధారణ ప్రయాణికుల తిప్పలు మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రభుత్వం సూచించడం గమనార్హం. ‘మహాలక్మి’తో పెరిగిన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులో ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే మహిళల సంఖ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఆటోలు లాంటి ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారిలో 90 శాతం మంది బస్సుల వైపు మళ్లారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 30 లక్షల మేర ఉంటోంది. ఫలితంగా బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒకేసారి ఇన్ని బస్సులు అందుబాటులో లేకుండాపోతే పరిస్థితి గందరగోళంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలిరోజే అవస్థలు రాష్ట్రంలోని 51 కేంద్రాల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడవాల్సి ఉంది. దీంతో విడతల వారీగా బస్సులు ఆయా కేంద్రాలకు తరలిపోతున్నాయి. సోమవారం దాదాపు 550 బస్సులు వెళ్లాయి. హైదరాబాద్ నగరం నుంచి కూడా 250 బస్సులు వెళ్లిపోయాయి. సాధారణంగా సోమవారాల్లో బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్పేర్ బస్సులు సహా అన్ని బస్సులను తిప్పినా ఆ రోజు రద్దీని తట్టుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. గత సోమవారం ఏకంగా 65 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో తిరిగారు. ఈ సోమవారం కొన్ని బస్సులు మేడారం జాతరకు వెళ్లిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. బస్సులు సరిపోక తోపులాటలు చోటు చేసుకున్నాయి. నగరంలో ఫుట్‌బోర్డులపై వేళ్లాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ఇక బుధవారం నుంచి మిగతా బస్సులు వెళ్లిపోతే పరిస్థితి ఏంటని అధికారుల్లో టెన్షన్ మొదలైంది. సాధారణ రోజుల్లోలాగే బుధవారం తర్వాత కూడా రద్దీ ఉంటే మేడారం డ్యూటీ బస్సుల్లో కొన్నింటిని తిరిగి వాపస్ పంపే యోచనలో ఉన్నారు. కానీ మేడారం ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసారి రైల్వే అధికారులు 30 ప్రత్యేక రైళ్లను మేడారం కోసం తిప్పుతున్నారు. ఒక రైలులో 1,500 మంది ప్రయాణికులు వస్తారు. మేడారం వరకు రైల్వే లైన్ లేనందున ఎక్కువ మంది కాజీపేట, వరంగల్, మహబూబాబాద్ స్టేషన్లలో దిగుతారు. దీంతో రైలు వచ్చే సమయానికి ఒక్కో స్టేషన్ వద్ద 30కి పైగా బస్సులను అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద వచ్చే ఆదివారం వరకు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు. 👉: తెలంగాణ అంతటా ఆర్టీసీ బస్సులు హౌస్‌ఫుల్ (ఫొటోలు) -
విజ్ఞాన సంపదను పంచడమే ‘కూరెళ్ల’ లక్ష్యం
రామన్నపేట : పద్మశ్రీ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యపై గవర్నర్ తమిళసై ప్రశంసలు కురింపించారు. ఒక మారుమూల ప్రాంతంలో అద్భుతమైన లైబ్రరీని స్థాపించేందుకు ఆచార్య విఠలాచార్యులు ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం పై అంతస్తులో నిర్మించిన సాయి సమావేశ మందిరాన్ని జస్టిస్ కూనురు లక్ష్మణ్‌తో కలిసి గవర్నర్ తమిళసై ప్రారంభించారు. నా వంతు సహకారం అందిస్తా : గవర్నర్ తమిళిసై కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూరెళ్ల విఠలాచార్యా కృషిని కొనియాడారు. ఆయన ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి రూ. 10లక్షల 63 వేల రూపాయలు, 8వేల పుస్తకాలు, వెయ్యి నోట్ బుక్స్ డొనెట్ చేస్తానని హామీ ఇచ్చారు. "ఆచార్య విఠలాచార్యుల గురించి మన్ కి బాత్ లో మాట్లాడిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు, విఠలాచార్యులు తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. ఆయన సేవలకు ధన్యవాదాలు. పుస్తకాల వల్ల విజ్ఞానం పెరుగుతుంది. రాజ్ భవన్‌ను వెల్లంకికి తీసుకొచ్చిన మహాన్నత వ్యక్తి విఠలాచార్యులు" అని అభినందించారు. విఠలాచార్య అందించిన విజ్ఞాన సంపద ఇది : జస్టిస్ కూనూరు లక్ష్మణ్ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య రాసిన కూరెళ్ల శతకం ద్వితీయ ముద్రణను సినీ గేయ రచయిత కనుకుంట్ల సుభాస్‌చంద్రబోస్, కలెక్టర్ హనుమంతు కె.జెండగేతో కలిసి ఆవిష్కరించిన హైకోర్టు జడ్జి జస్టిస్ కూనూరు లక్ష్మణ్.. విఠలాచార్య సేవలను కొనియాడారు. "భావితారాలకు విజ్ఞాన సంపదను పంచడమే ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం ఏర్పాటు ప్రధాన లక్ష్యమని అన్నారు. చదువుకునేందుకు తాను పడిన ఇబ్బందులు ఇతరులకు ఎదురు కాకూడదని బాల్యంలో కూరెళ్ల మదిలో వచ్చిన ఆలోచన కూరెళ్ల గ్రంథాలయం ఏర్పాటుకు నాంది పలికిందని తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ అనంతరం కూరెళ్ల ఇంటిని గ్రంథాలయంగా మలచి తన పింఛన్ డబ్బులతో నిర్వహించడం ఆదర్శనీయమన్నారు. కూరెళ్లకు కూతుళ్లు అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో గ్రంథాలయ నిర్వహణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. కూరెళ్ల గ్రంథాలయం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని" తెలిపారు. మాతృభాషను మరవొద్దు ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సినీ గేయరచయిత కనుకుంట్ల చంద్రబోస్ మాట్లాడుతూ "పరభాషా వ్యామోహంలోపడి మాతృభాషను మరువవద్దని కోరారు. కలెక్టర్ హనుమంతు కె. జెండగే మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు రావడం గర్వకారణమని" తెలిపారు. విద్యార్థులు, యువకులు పఠనాసక్తిని పెంచుకోవాలని చెప్పారు. ప్రతీ పురస్కారం గ్రామానికే అంకితం తనకు వచ్చిన ప్రతీ పురస్కారం గ్రామానికే అంకితమిచ్చినట్లు గ్రంథాలయ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికై న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన రూ.25లక్షల నగదు పురస్కారంతోపాటు మరో రూ.20లక్షలను సమకూర్చి గ్రంథాలయ నిర్వహణ నిధిని ఏర్పాటు చేస్తానని తెలిపారు. గవర్నర్చేతుల మీదుగా గ్రంథాలయంను ప్రారంభించుకోవడం తన జీవితంలో మరపురాని రోజు అని తెలిపారు.అంతకుముందు అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, గ్రంథాలయ అధ్యక్షుడు కూరెళ్ల నర్సింహాచారి, అధికార ప్రతినిధి కూరెళ్ల నర్మద సభ్యులు కూరెళ్ల తపతి, సరస్వతి గ్రంథపాలకుడు తాటిపాముల స్వామి, తాజామాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు ఎర్రోళ్ల లక్ష్మమ్మ,మహేందర్‌రెడ్డి, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ పాల్గొన్నారు. -
Telangana: రేపట్నుంచి బీజేపీ విజయ సంకల్ప రథయాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విజయ సంకల్ప రథయాత్రకు బీజేపీ శ్రీకారం చుట్టనుంది. రేపట్నుంచి(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప రథయాత్రను ప్రారంభిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ చేపట్టబోయే విజయ సంకల్ప యాత్ర గురించి వివరాలు వెల్లడించారు. ‘రేపటి నుంచి విజయ సంకల్ప రథ యాత్ర ప్రారంభం కానుంది. రేపు నాలుగు యాత్రలు ప్రారంభం కానున్నాయి .కోమరంభీం యాత్ర బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో యాత్రం ప్రారంభం అవుతుంది. రాజరాజేశ్వరీ విజయ సంకల్ప యాత్ర కరీం నగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల నాలుగు పార్లమెంట్ స్థానాలను కవర్ చేస్తూ యాత్ర కొనసాగనుంది. ఇందులో 22 అసెంబ్లీలు కవర్ చేయనుంది. మిగిలిన నియోజక వర్గాలను సైతం కవర్ చేసేందుకు కృషి చేస్తాం. భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదంతో ప్రారంభం అవుతుంది. భువనగిరి , మల్కాజ్గిరి హైదరాబాద్ , సికింద్రాబాద్ కవర్ చేస్తూ.. యాత్ర కొనసాగనుంది కృష్ణ విజయ సంకల్ప యాత్ర మక్తల్ లో కృష్ణ గ్రామం నుంచి ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ కవర్ చేస్తూయాత్ర కొనసాగనుంది. కొమరం భీం యాత్రనుఅస్సాం సీఎం హేమంత్ బిస్వా శర్మ ప్రారంభిస్తారు. రాజరాజేశ్వరీ యాత్ర తాండూర్‌లో ప్రారంభం కానుంది. దీనికి కేంద్రమంత్రి బీఎల్ వర్మ హాజరుకానున్నారు. భాగ్యలక్ష్మీ యాత్రకి గోవా సీఎం ప్రమోద సావంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కృష్ణ యాత్రకు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల హాజరవుతారు. యాత్రలో రోడ్ షో లు ఎక్కువ ఉంటాయి. ఐదు యాత్రలు కలిపి 5500 కి.మీలు కవర్ కానుంది. 114 అసెంబ్లీ కవర్ అయ్యేలా కవర్ యాత్ర ఉండనుంది. 106 రోడ్ షో లు ఉండనున్నాయి’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ముగిసిన నుమాయిష్
అబిడ్స్: ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఆదివారంతో ముగిసింది. 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల జనవరి 1వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం 46 రోజులు కొనసాగే ఎగ్జిబిషన్ ఈసారి 49 రోజుల పాటు కొనసాగింది. ముగింపు రోజు ఆదివారం మధ్యాహ్నం నుంచే సందర్శకులు భారీగా తరలివచ్చారు. సుమారు 70 వేల మంది వచి్చనట్లు బుకింగ్ కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. 49 రోజుల్లో మొత్తం 22 లక్షల మంది నుమాయి‹Ùకు వచ్చినట్లు అంచనా. 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశామని, కనువిందు చేసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హన్మంతరావు, జాయింట్ సెక్రటరీ స్వర్ణజిత్ సింగ్, కోశాధికారి రాజేంద్రకుమార్‌లు తెలిపారు. గోషామహల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షించారు. -
Korutla: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
కోరుట్ల: నాలుగేళ్లలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది కోరుట్లకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బెజ్జారపు వేణు–మాధవిల కూతురు మౌనిక. ఆమె 2013లో ఎం.ఫార్మసీలో గోల్డ్‌మెడల్ సాధించింది. మౌనిక వివాహం సాఫ్ట్వేర్ ఇంజినీర్ శేఖర్‌తో జరిగింది. అనంతరం మళ్లీ చదువుపై దృష్టిపె ట్టి, 2019లో వీఆర్వో ఉద్యోగం సాధించింది. ఆ జాబ్ చేసూ్తనే అదే ఏడాది ఫార్మసిస్ట్ పోస్టుకు ఎంపికైంది. ప్రస్తుతం హై దరాబాద్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తోంది. 2022 డిసెంబర్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తు చేసుకుంది. 6 నెలల కష్టపడి చదివి, పరీక్ష రాయగా శుక్రవారం రాత్రి ఫలితాలు వెలువడ్డాయి. ఆమె రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. తన భర్త శేఖర్ ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఉద్యోగాలు సాధించానని తెలిపింది. -
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు
భద్రాచలం అర్బన్: డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందించి సంఘాలు బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క భరోసా ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఎంతోకాలంగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలోనే విడుదల చేస్తామని ఆయన హామీనిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో పలు సమస్యలతో సహజీవనం సాగిస్తున్న గిరిజనులకు అన్ని విధాలా లబ్ధి చేకూర్చేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. 19 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం జరిగిన భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో భట్టివిక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ హయాంలో ఐటీడీఏ పూర్తిగా నిర్వీర్యం అయిందని, దీనికి పూర్వ వైభవం తెచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 2004 – 2014 సంవత్సరాల మధ్య ఐటీడీఏకు కేటాయించిన బడ్జెట్, చేసిన ఖర్చు వివరాల నివేదికను వచ్చే సమావేశం నాటికి అందజేయాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని పలువురు విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని, ఇందుకు గల కారణాలను విశ్లేషించి, వారు పాఠశాలలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. యువతకు స్వయం ఉపాధి ద్వారా సాయం అందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు 2005లోనే నాటి వైఎస్సార్ ప్రభుత్వం మూడున్నర లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో గత సర్కారు ఇదే శాఖలో స్కామ్ చేసింది విద్యార్థులకు అందిస్తున్న సహకారంపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మాట్లాడిన భట్టి.. పక్క రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇదే శాఖలో స్కామ్ చేసిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 32 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఐటీడీఏను విభజిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. భద్రాద్రి ఏజెన్సీ బాధ్యత తనదేనన్నారు. భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. -
తెలంగాణ అభివృద్ధికి మెగా ప్లాన్
హఫీజ్‌పేట్ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విజన్–2050 దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత 30 ఏళ్లుగా రాజకీయాలు ఎలా ఉన్నా అప్పట్లో పనిచేసిన సీఎంలు చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌లు గత ప్రభుత్వాల నిర్ణయాలను మరింత పకడ్బందీ ప్రణాళికలతో అమలు చేయడం వల్లే ఔటర్‌రింగు రోడ్డు, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, హైటెక్ సిటీ వంటివి అందుబాటులోకి వచ్చాయని అన్నారు. దేశమే కాకుండా ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ దేశంలోనే ఐదవ మెట్రోపాలిటన్ సిటీగా గుర్తింపు పొందిందని చెప్పారు. దీన్ని మరింతగా అభివృద్ధి చేయాలన్నదే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని, అందరి సలహాలు, సూచనలతో అందుకు తగిన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. తొందరపాటు చర్యలతో మేడిగడ్డ తరహాలో కానివ్వబోమని అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లిలోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఫార్మా సిటీ స్థలంలో కొత్త నగరం ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలోని ఓఆర్ఆర్, రీజనల్ రింగురోడ్డు మధ్య ఇటు, అటు ప్రాంతాలను ఎంపిక చేసి అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలుగా విభజిస్తాం. చైనా తరహాలో 10 నుంచి 15 శాటిలైట్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తాం. వాటిల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాం. ఫార్మాసిటీని రద్దు చేస్తామనే అపోహ ఉంది. అది నిజం కాదు. ఫార్మా సిటీకి కేటాయించిన స్థలంలో కొత్త నగరం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఒకేచోట ఫార్మాసిటీ అని కాకుండా విభిన్న ప్రాంతాల్లో కాలుష్య రహిత ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తాం. ఆస్పత్రులు, స్కూళ్ళు, షాపింగ్‌మాల్స్, ఇతర అన్ని రకాల సదుపాయాలుండేలా చూస్తాం..’అని సీఎం తెలిపారు. ఆర్ఆర్ఆర్ చుట్టూ రైలు సౌకర్యం ‘మెట్రో రైలు సౌకర్యం మరింత మందికి చేరువలో ఉండేలా చేయాలనే సంకల్పంతో కొత్త మార్గాలను రూపొందించాం. మొదటగా ఎయిర్‌పోర్టుకు, మియాపూర్ నుంచి ఆర్ïసీ పురం వరకు, రాయదుర్గం నుంచి గచ్చిబౌలి కూడలి మీదుగా అమెరికన్ కాన్సులేట్ భవనం వరకు మెట్రో ఏర్పాటు చేయాలని సంకల్పించాం. ఆర్ఆర్ఆర్ నిర్మాణ సమయంలో చుట్టూ రైలు సౌకర్యం ఏర్పాటు చేసేలా చూస్తాం..’అని రేవంత్ చెప్పారు. ఫైర్ విభాగంలో ఖాళీల భర్తీ ‘ప్రపంచంలో ఎక్కడైనా ల్యాండ్ మార్క్‌లు నిర్మించేది బిల్డర్లు, కాంట్రాక్టర్లే. వారి సమస్యలు ఏమి ఉన్నా పరిష్కరించేందుకు, వారికి అందుబాటులో ఉండేందుకు సిద్ధం. నగరాభివృద్ధిలో ఫైర్ విభాగం పాత్ర ఎంతో ఉంది. 50–60 అంతస్తుల భవనాలకు ఎన్ఓసీ ఇవ్వడంలో వారి పాత్ర కూడా ఉంటుంది. కానీ వారికి భవనం లేకపోవడం విడ్డూరం. క్రెడాయ్ (భారత రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సంఘాల సమాఖ్య) ముందుకొచ్చి భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయం. క్రెడాయ్ వారి సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధం. ఫైర్ విభాగంలో ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. పోలీస్ విభాగం తరహాలో ఫైర్ సిబ్బంది అందరికీ న్యాయం చేసేలా చూస్తాం..’అని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, ఫైర్ విభాగం అదనపు డీసీ నాగిరెడ్డి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ టైటిల్ ఏంటి.. ట్రైలర్లో సీన్లేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు అవసరమైన సందర్భాల్లో సినిమాల ’సెన్సార్ బోర్డు’బాధ్యతల్నీ చేపడుతున్నారు. ఆయా చిత్రాల్లో మాదకద్రవాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న సీన్లు, టైటిల్స్ మార్చాల్సిందిగా ఆదేశిస్తున్నారు. గతంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచి్చన ‘బేబీ’చిత్రంపై స్పందించిన అధికారులు తాజాగా సాయి ధరమ్‌తేజ్ కథానాయకుడిగా రూపొందించిన ‘గాంజా శంకర్’ను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్ మార్చాలని, చిత్రంలోని సన్నివేశాల్లో సైతం గంజాయి పండించడం, విక్రయించడం, వినియోగించడాలను ప్రోత్సహించేవిగా లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య శనివారం హీరో సాయి ధరమ్‌తేజ్, నిర్మాత ఎస్.నాగవంశీ, దర్శకుడు సంపత్ నందిలకు నోటీసులు జారీ చేశారు. ‘బేబీ’లో వివాదాస్పదమైన ఓ సీన్... మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో జరుగుతున్న ఓ డ్రగ్ పార్టీపై టీఎస్ నాబ్ అధికారులు గతేడాది దాడి చేశారు. ఆ ఫ్లాట్‌లో కనిపించిన సీన్‌కు అప్పట్లో విడుదలైన ‘బేబీ’సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని అధికారులు తేల్చారు. దాంతో మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో అభ్యంతరకరమైన సీన్లు వచి్చనప్పుడు సినిమాలో వారి్నంగ్ నోట్ వచ్చేలా దర్శకుడు చర్యలు తీసుకున్నారు. తాజాగా మరోసారి తెరపైకి వివాదం... గత ఏడాది సెప్టెంబర్ నాటి ‘బేబీ’చిత్రం తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి రాలేదు. తాజాగా శుక్రవారం ట్రైలర్ విడుదలైన గాంజా శంకర్ చిత్రం విషయంలో టీఎస్ నాబ్ కలగజేసుకుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలు సైతం యువత... ప్రధానంగా విద్యార్థులను గంజాయి వినియోగం, విక్రయం వైపు ఆకర్షించేలా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ చిత్ర కథానాయకుడు గంజాయి వ్యాపారిగా కనిపిస్తున్నాడని, దీని ప్రభావంతో పలువురు ఆ దారిలో వెళ్లే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ‘గాంజా శంకర్’ సినిమా హీరోతో పాటు దర్శకనిర్మాతలకు నోటీసులు జారీ చేశారు. సినిమా టైటిల్‌తో పాటు అభ్యంతరకరమైన, గంజాయి, డ్రగ్స్ వైపు యువతను మళ్లించేలా ఉన్న వాటిని మార్చాలని స్పష్టం చేశారు. సినిమా పేరులో ఉన్న గాంజా అనే పదం తీసేయాలని కోరారు. అలా కాని పక్షంలో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలీవుడ్ చిత్రాలపై ఎన్సీబీ సహాయంతో... ఈ నోటీసుల ప్రతిని టీఎస్–నాబ్ అధికారులు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్లతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు పంపారు. అయితే బాలీవుడ్ చిత్రాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన సీన్లు అనేకం ఉంటున్నాయి. ఇప్పటి వరకు వీటి విషయం ఎవరూ పట్టించుకోలేదు. టీఎస్ నాబ్ అధికారులు మాత్రం వీటినీ తీవ్రంగా పరిగణించాలని యోచిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించేలా సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరనున్నారు. ఆ విభాగం లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారు. డ్రగ్స్ ప్రేరేపించే చిత్రాలను సీరియస్‌గా తీసుకోకుంటే భవిష్యత్తరాలు నిర్విర్యమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
‘తెలంగాణ ఇంక్రిమెంట్’ రికవరీ
సాక్షి, హైదరాబాద్: జలమండలిలో ‘తెలంగాణ ఇంక్రిమెంట్’రికవరీకి ఆ శాఖ పరిధిలోని ఆర్థిక విభాగం నుంచి తాజాగా ఆదేశాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పదేళ్ల తర్వాత ఆ శాఖ పరిధిలో రెగ్యులరైజ్ అయిన 658 మంది ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని, ఉద్యోగుల సర్విస్ బుక్ లు పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించింది. ఇంక్రిమెంట్ ఇలా.. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పోషించిన పాత్రకు గుర్తుగా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఉద్యోగులందరికీ ‘తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‘మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2014 సెప్టెంబర్ 1న చెల్లించిన ఆగస్టు నెల వేతనం నుంచే ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను అమలు చేస్తూ వస్తోంది. ప్రతి నెలా వేతనంలో భాగంగా ఈ ఇంక్రిమెంట్ సర్విస్ ముగిసే వరకు వర్తింస్తుందని ఆ జీఓలో ప్రభుత్వం స్పష్టం చేసింది. జలమండలిలో వర్తింపు ఇలా జలమండలి పారిశుధ్య విభాగంలో 25 ఏళ్లుగా సేవలిందిస్తున్న సుమారు 658 మంది హెచ్ఆర్, ఎన్‌ఎంఆర్‌లను ప్రభుత్వం 2014 జూన్ 23న రెగ్యులరైజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అదే సంవత్సరం ఆగస్టు 13న జీఓ నెంబర్ 23 ఆర్డర్‌తో ప్రభుత్వ సర్విస్‌లో ఉన్న ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జలమండలిలోని పారిశుధ్య విభాగంలో రెగ్యులర్ అయి సర్వీస్‌లో ఉన్నవారికి కూడా ఈ ఇంక్రిమెంట్‌ను వర్తింపజేశారు. జీఓ తేదీని పరిగణనలోకి తీసుకోవాలి తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ జీఓ జారీ చేసిన 2014 ఆగస్టు 13 తేదీని కటాఫ్ పరిగణనలోకి తీసుకోవాలని జలమండలి ఉద్యోగులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రెగ్యులరైజ్ అయిన తాత్కాలిక ఉద్యోగులు కూడా ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయిన నాటికే ప్రభుత్వ సర్విస్‌లో ఉన్న కారణంగా తెలంగాణ ఇంక్రిమెంట్ తమకు కూడా వర్తిస్తుందని వారు పేర్కొంటున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులైన తమ వేతనాలు ఉండడమే తక్కువని, అందులో నుంచి ఇంక్రిమెంట్ సొమ్ము మొత్తం రికవరీ చేస్తే ఆర్థికంగా భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికవరీ ఎందుకంటే... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ రోజైన జూన్ 2ను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం తెలంగాణ ఇంక్రిమెంట్ అమలుచేస్తోంది. అయితే జలమండలిలో ఉద్యోగుల రెగ్యులరైజ్ జూన్ 23న జరిగింది. దీంతో వారి వేతనాల నుంచి ఈ ఇంక్రిమెంట్ రికవరీకి ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ ఉద్యోగులు మాత్రం ఇంక్రిమెంట్ జీఓ వచ్చిన ఆగస్టు 13వ తేదీన పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. -
విలీనం లేదు.. వేతన సవరణ 'ఊసే లేదు'!
సాక్షి, హైదరాబాద్: ‘ఇటు ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనంపై స్పష్టత లేదు.. అటు బకాయి ఉన్న రెండు వేతన సవరణల జాడ లేదు’ఆర్టీసీకి సంబంధించి ఈ కీలక అంశాలకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. బడ్జెట్లో ప్రతిపాదించటం ద్వారా శుభవార్త అందుతుందని ఎదురు చూసిన ఆర్టీసీ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే నెక్లెస్ రోడ్డు సమీపంలో వంద ఆర్టీసీ కొత్త బస్సులను స్వయంగా ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో ఆ కార్యక్రమంపై కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సందర్భంగా కూడా కేవలం 2013 వేతన సవరణకు సంబంధించి బకాయి ఉన్న బాండ్ల మొత్తం విడుదల ప్రకటన తప్ప ప్రధాన అంశాలను కనీసం మాట వరసకు కూడా ప్రస్తావించకపోవటంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటినా ఆర్టీసీ పెండింగు అంశాలపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోవటంతో.. అసలు తమ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ పంథా ఏంటో అర్ధం కాక అయోమయంలో పడిపోయారు. ‘మహాలక్ష్మి’ పథకాన్ని సక్సెస్ చేసినా.. పట్టించుకోరా? ప్రభుత్వం కొలువు దీరిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటును ఆర్టీసీ ఆరంభించింది. గత డిసెంబరు 9న ఒక్క కొత్త బస్సు లేకుండా, ఉన్న సిబ్బందితోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. అంతకు ముందు సగటున రోజుకి 28 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఈ పథకం మొదలయ్యాక అది 45 లక్షలకు చేరింది. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆ సంఖ్య 52 లక్షలకు చేరినట్టు అధికారులు చెబుతున్నారు. 30 శాతం డొక్కుగా ఉన్న బస్సుల్లో ఓవర్‌లోడ్ వల్ల ఎక్కడ ఎప్పుడు ఏ బస్సు అదుపు తప్పుతుందోనని ఆర్టీసీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కానీ, నిత్యం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, సిబ్బందికి జాగ్రత్తలు సూచిస్తుండటంతో ఎక్కడా ప్రమాదాలు చోటుచేసుకోకుండా పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. బస్సులు కిక్కిరిసి ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి ఉన్నా ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఒక్క కొత్త బస్సు కూడా సమకూర్చకుండానే తమతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించినా తాము విజయవంతంగా అమలు చేస్తున్నామని, కానీ తమకు అందాల్సిన ఆర్థిక లబ్ధి విషయంలో ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించటం ఏంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు జీఓ ఇచ్చినా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. కానీ, విధివిధానాలకు కమిటీ ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంది. విధివిధానాలు ఖరారయ్యేలోపే ఎన్నికల కోడ్ రావటంతో ఆ విషయం మరుగున పడింది. విధివిధానాలు వచ్చేలోపు తమ జీతాలను ట్రెజరీ ద్వారా చెల్లించేలా ఆదేశించాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరినా అది నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో వెంటనే ఆ ప్రక్రియ కొనసాగుతుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆశించారు. కానీ, రెండు నెలలైనా దాని జాడలేదు. అన్నీ వదిలేసి తక్కువ మొత్తం విడుదల చేసి 2017, 2021 సంవత్సరాల్లో వేతన సవరణలు జరగాల్సి ఉంది. కానీ అవి నాటి నుంచి పెండింగులోనే ఉన్నాయి. ఇక 2013లో జరిగిన వేతన సవరణకు సంబంధించి బాండ్ల రూపంలో చెల్లించాల్సిన రూ.281 కోట్ల మొత్తం కూడా పెండింగ్‌లోనే ఉంటూ వచ్చింది. ఇవి కాకుండా, ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడే ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్)కు సంబంధించి దాదాపు రూ.1100 కోట్లు, పీఎఫ్‌కు సంబంధించి రూ.1400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వీటన్నింటినీ పెండింగులో ఉంచి కేవలం తక్కువ మొత్తం ఉన్న బాండ్ల నిధులను మాత్రమే విడుదల చేస్తున్నట్టు కొత్త ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వం కూడా అంతేనా? శాసనసభ ఎన్నికలకు ముందు, ప్రధాన కార్మిక సంఘాల నేతలు.. వారివారి సొంత సంఘాలు వదిలేసి కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. బడ్జెట్ ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తీరును ప్రశంసిస్తూ పోస్టులు వైరల్ చేశారు. కానీ, బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా వారిపై కార్మికుల నుంచి ఒత్తిడి పెరగటంతో తాజాగా కార్మిక నేతలు ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరు కంటితుడుపు చర్యగా కూడా లేదని, కార్మికుల ఓపిక నశించకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ తీరు నిరుత్సాహానికి గురిచేసిందని, అప్రజాస్వామిక, నియంత పాలనను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించనుందా అంటూ రాజిరెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయమని చెప్తున్న ఈ ప్రభుత్వం చేతల్లో చూపటం లేదని వీఎస్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేతన సవరణ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న కార్మికులను ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరిచిందని సీనియర్ కార్మిక నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
పేపర్ లీక్‌లు ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28 నుంచి ఇంటర్మిడియెట్ థియరీ పరీక్షలు మొదలుకానున్నాయి. 9 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వచ్చే నెల 18న ప్రారంభంకానున్న పదవ తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరుకానున్నారు. ఈ రెండు పరీక్షలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా పరీక్షల నిర్వహణపై సమీక్షలు చేశారు. ముఖ్యమంత్రి కూడా పరీక్షల తీరుపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గతం కన్నా భిన్నంగా పరీక్షల నిర్వహణ ఉండాలని చెప్పారు. ఎక్కడా పేపర్ లీక్‌లు ఉండొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారుల్లో టెన్షన్ కన్పిస్తోంది. ప్రతీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలుకొని, వాటిని చేరవేయడం, పరీక్షల తర్వాత సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలించడం, మూల్యాంకన నిర్వహించడం, ఫలితాల క్రోడీకరణ, వెల్లడి వరకూ సిబ్బందిని మరింత అప్రమత్తం చేశారు. గతంలో ఫిర్యాదులు లేని వారినే విధుల్లోకి తీసుకునేందుకు ప్రాధాన్యమి చ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ భయం తొలగేనా? కొన్నేళ్లుగా ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణ అధికారులకు సవాల్‌గా మారుతోంది. హాల్‌టికెట్లు మొదలుకొని, ఫలితాల వరకూ ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంది. ప్రశ్నపత్రాల్లో తప్పులు సర్వసాధారణం అవుతున్నాయి. మూల్యాంకన, ఫలితాల వెల్లడిలో జరిగిన కొన్ని పొరపాట్ల కారణంగా 2019లో ఇంటర్ బోర్డ్ వ్యవహారం వివాదాస్పదమైంది. ఆ సమయంలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా ఇంటర్ బోర్డ్ పెద్దగా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదనే విమర్శలున్నాయి. ఆ తర్వాత కూడా ఎక్కడో ఒకచోట ప్రశ్నపత్రాల్లో తప్పులు రావడం సమస్యలు తె చ్చిపెట్టింది. ఈసారి ఇలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా బోర్డ్ ముందే అప్రమత్తమైంది. నిపుణులతో ప్రశ్నపత్రాలను రూపొందించారు. గతంలో ఎలాంటి వివాదాలు లేని వారినే ఎంపిక చేసుకున్నారు. అధికారులు ముందే ఈ వివరాలను తెప్పించుకుని మరీ పరిశీలించారు. టెన్త్ పరీక్షలు గత ఏడాది వివాదాలకు దారి తీశాయి. పేపర్ లీకేజీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. సమస్యాత్మక కేంద్రాల్లో ఈసారి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్టు, ప్రైవేటు స్కూళ్లతో సంబంధాలున్న ఉపాధ్యాయులను విధులకు దూరంగా ఉంచుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. హాల్‌టికెట్ల ఆలస్యంపై దృష్టి : టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల ఆలస్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించనుంది. ఫీజులు చెల్లించని విద్యార్థులపై ప్రైవేటు స్కూల్, కాలేజీలు పరీక్షల సమయంలో తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నాయి. డౌన్లోడ్ చేసుకునే హాల్‌టికెట్లపై కాలేజీ ప్రిన్సిపల్, స్కూల్ హెచ్ఎం సంతకాలు అవసరమన్న ఆందోళన కల్గిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగానే హాల్‌టికెట్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలోతప్పిదాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలుతీసుకోవాలి. పరీక్షల సమయంలో విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు వేధించకుండా చూడాలి. పేపర్ లీకేజి వంటి ఘటనలు జరగకుండా చూడాలి. –చింతకాయల ఝాన్సీ (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) ప్రైవేటుకు కొమ్ముకాయొద్దు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సహక రిస్తున్నట్టు గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. పరీక్షలు సజావుగా, ఎలాంటి ఆందోళనలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. –టి నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) -
అన్నారం బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి అన్నారం(సరస్వతీ) బ్యారేజీలో మరమ్మతుల కోసం ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి నీటిని ఖాళీ చేశారు. బ్యారేజీ సమగ్ర సర్వే కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఆదివారం వరకు బ్యారేజీలోని 10–15 గేట్లు ఎత్తి పూర్తి నీటిని రెండువేల క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నారు. నీటిని పూర్తిగా ఖాళీ చేయడంతో బ్యారేజీ పొడవునా 1.6 కిలోమీటర్ల దూరం వరకు లక్ష క్యూబిక్ మీటర్ల మేర గేట్ల వద్ద అర మీటరు ఎత్తులో ఇసుక పేరుకుంది. దీంతో బ్యారేజీలో సమగ్ర సర్వే చేసేందుకు వీలవుతుందా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక తీయకపోతే ఫౌండేషన్, పియర్, ర్యాప్్టల కింద ఖాళీ ప్రాంతం ఎక్కడ ఎంత మేర ఉందనేది తెలియదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇసుక తొలగించిన తరువాతనే సీపేజీ లీకేజీపై విశ్లేషణ సాధ్యం అవుతుందని అంటున్నారు. గేట్లు కూడా పాడైపోయినట్లు సమాచారం. తడి ఆరిన తర్వాతే సర్వే: నీటిని పూర్తిగా తొలగించిన అధికారులు బ్యారేజీ దిగువన తడి ఇసుక, రేగడి మట్టితో దిగబడుతున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎండిన తరువాతనే సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీలోని 2.01 టీఎంసీలు నీటి నుంచి 10–15 గేట్లు ఎత్తగా 2వేల క్యూసెక్కుల నీరు దిగువకు తరలించారు. నీరు ఖాళీ కావడంతో ర్యాప్్ట, పియర్లు దిగువ వేసిన సీకెంట్ ఫైల్స్ కింది భాగంలో ఏమైనా లీకేజీలు ఉన్నాయా.. ఫౌండేషన్ ఎగువ నుంచి ప్రారంభమై దిగువన ఎక్కడకు వెళ్తుంది.. కింద ఖాళీ ఉందా.. తెలుసుకోవడానికి సర్వే చేపట్టనున్నారు. ఒప్పందం మేరకు పార్సన్ అనే సంస్థ గ్రౌండ్ పెనట్రేషన్టెస్ట్ కోసం సర్వే చేయనుంది. ఈ సర్వే పూర్తయ్యాక ప్రత్యేక రసాయనాలతో తిరిగి మరమ్మతులు చేపట్టనున్నారు. -
‘ధూపదీప నైవేద్యం’ ఎలా?
సాక్షి, హైదరాబాద్: గౌరవ భృతి అందని కారణంగా దేవుళ్లకు నైవేద్యం, పేద అర్చకుల పూట గడవటం కష్టంగా మారింది. కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ భృతి బకాయిల కోసం వేడుకుంటున్నా ఫలితం లేదు. దీంతో అర్చకులు నిరసనకు సిద్ధమయ్యారు. మంగళవారం చలో సచివాలయం కార్యక్రమం నిర్వహించడం ద్వారా తమ దీనావస్థను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు. ఇదీ సంగతి: ఆదాయం అంతగా లేక ఆలనాపాలన కష్టంగా మారిన దేవాలయాల్లో నిత్య పూజలకు ఉమ్మడి ఏపీలో డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ‘ధూప దీపనైవేద్య పథకం’ప్రారంభించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత దాని పరిధిలో దేవాలయాల సంఖ్యతోపాటు గౌరవ భృతి మొత్తం కూడా పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 6000 దేవాలయాలు ప్రస్తుతం దీని పరిధిలో ఉన్నాయి. తొలుత 3500 దేవాలయాలకు మాత్రమే ఉండగా, గతేడాది గోపనపల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన ప్రారంభోత్సవం సందర్భంగా మరో 2500 దేవాలయాలను ఇందులో చేర్చనున్నట్టు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆమేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ వాటిని ధూపదీప నైవేద్య పథకంలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గౌరవ భృతి రూ.6500 ఉండగా, దానిని కూడా రూ.10 వేలకు పెంచుతున్నట్టు కేసీఆర్ అప్పడు ప్రకటించారు. కొద్దిరోజులకు ఆమేరకు కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో గౌరవ భృతి రూ.10 వేలకు పెరిగింది. అప్పటి వరకు రూ.6500 చెల్లిస్తున్న ఆలయాలకు కూడా వర్తింపజేశారు. కొన్ని నెలలు పాత దేవాలయాలకు ఆ మొత్తం చెల్లించారు. కానీ, కొత్తగా చేరిన దేవాలయాలకు మాత్రం ఇప్పటి వరకు వాటి చెల్లింపులు మొదలు కాలేదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున తర్వాత ఇస్తారులే అనుకుంటూ అర్చకులు కాలం గడిపారు. కొత్త ప్రభుత్వం కొలువు దీరటంతో బకాయిలు సహా వాటి చెల్లింపు ఉంటుందని ఆశపడ్డారు. కానీ, వారి గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. పాత దేవాలయాలకు సంబంధించి నవంబరు నుంచి బకాయిలు పేరుకుపోగా, కొత్తగా చేరిన దేవాలయాలకు ఇప్పటి వరకు అసలే చెల్లించలేదు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి విన్నవించినట్టు ఆర్చకులు చెబుతున్నారు. దేవాదాయశాఖ కమిషనర్‌ను కలిసి అభ్యర్థించామని పేర్కొంటున్నారు. కానీ, ఆర్థిక శాఖ అధికారులు డబ్బులు విడుదల చేయటం లేదన్న సమాధానం దేవాదాయ శాఖ అధికారుల నుంచి వస్తోందన్నారు. దీంతో విషయాన్ని స్వయంగా సీఎం దృష్టికి తెస్తేనన్నా ఫలితముంటుందన్న ఉద్దేశంతో చలో సచివాలయం కార్యక్రమానికి నిర్ణయించినట్టు పేర్కొంటున్నారు. -
Telangana: ఉచిత కరెంట్‌లో మెలిక?!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు ‘గృహజ్యోతి’ పథకం కింద ప్రతి కుటుంబానికి కచ్చితంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా జరగదా? అర్హత గల ప్రతి కుటుంబం నిర్దిష్ట యూనిట్ల మేరకే ఉచిత విద్యుత్‌ను పొందుతుందా? గత ఏడాది విద్యుత్ వినియోగాన్ని ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటున్నారా? పథకం అమలుకు ఇంధన శాఖ సిద్ధం చేసిన మార్గదర్శకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే.. అవుననే సమాధానమే లభిస్తోంది. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం (ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్జంప్షన్ (ఎంఈసీ) పేరిట ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. దీంతో ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు రెడీ అయ్యాయి. అధికంగా వాడితే వాతలే!: ఈ మార్గదర్శకాల ప్రకారం..200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు షరతులు వర్తించనున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తుందని భావించి గతానికి భిన్నంగా ఇష్టారాజ్యంగా వినియోగాన్ని పెంచేసుకుంటే, ఆ మేరకు అదనపు వాడకానికి బిల్లులు చెల్లించక తప్పదు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2022–23లో నెలకు సగటున వాడిన విద్యుత్‌కు అదనంగా 10 శాతం విద్యుత్‌ను మాత్రమే గృహ జ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయనుంది. నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితికి లోబడి ఈ పథకం అమలు కానుంది. ఉదాహరణకు 2022–23లో ఒక కుటుంబ వార్షిక విద్యుత్ వినియోగం 960 యూనిట్లు అయితే, సగటున నెలకు 80 యూనిట్లు వాడినట్టు నిర్ధారిస్తారు. అదనంగా మరో 10 శాతం అంటే 8 యూనిట్లను కలిపి నెలకు గరిష్టంగా 88 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే ఆ కుటుంబానికి ఉచితంగా సరఫరా చేయనున్నారు. 88 యూనిట్లకు మించి వాడిన విద్యుత్‌కు సంబంధిత టారిఫ్ శ్లాబులోని రేట్ల ప్రకారం బిల్లులు జారీ చేయనున్నారు. గతేడాది 2,400 యూనిట్లు మించితే అనర్హులే ఒక వేళ 2022–23లో సగటున నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడినట్టైతే ఈ పథకం వర్తించదు. వార్షిక విద్యుత్ వినియోగం 2,400 యూనిట్లు మించిన వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కారు. ఇక నెలకు అనుమతించిన పరిమితి (ఎంఈసీ) మేరకు ఉచిత విద్యుత్‌ను వాడిన వినియోగదారులకు ‘జీరో’ బిల్లును జారీ చేయనున్నారు. అంటే వీరు ఎలాంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం ఉండదు. 200 యూనిట్లు దాటితే ఉచితం వర్తించదు ఒక వేళ వినియోగం అనుమతించిన పరిమితికి మించినా, గరిష్ట పరిమితి 200 యూనిట్లలోపే వాడకం ఉండాలి. ఇప్పుడు కూడా అదనంగా వాడిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లును సంబంధిత టారిఫ్ శ్లాబు ప్రకారం జారీ చేస్తారు. ఒక వేళ నెల వినియోగం 200 యూనిట్లకు మించితే మాత్రం వాడిన మొత్తం కరెంట్‌కు బిల్లును యథాతథంగా జారీ చేస్తారు. ఎలాంటి ఉచితం వర్తించదు. బిల్లులు బకాయిపడినా నో విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులకు గృహజ్యోతి పథకం వర్తించదు. బకాయిలన్నీ చెల్లించిన తర్వాతే పథకాన్ని వర్తింపజేస్తారు. గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బిల్లులను చెల్లించకుండా బకాయి పడిన వారికి సైతం పథకాన్ని నిలుపుదల చేస్తారు. బిల్లులు చెల్లించాకే మళ్లీ పథకాన్ని పునరుద్ధరిస్తారు. తెల్లకార్డు ఉంటేనే అర్హులు ఈ పథకం కింద తెల్లరేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబం గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది. రేషన్‌కార్డు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. లబ్ధిదారులు దరఖాస్తులో పొందుపరిచిన గృహ విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నంబర్‌ను రేషన్‌కార్డుతో అనుసంధానం చేస్తారు. రేషన్‌కార్డుతో విద్యుత్ కనెక్షన్‌ను అనుసంధానం చేసినా, విద్యుత్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి పేరు మీదే బిల్లింగ్ జరుగుతుంది. ఇప్పటికే నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లబ్ధి పొందుతున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు కూడా గృహజ్యోతి వర్తించనుంది. గృహజ్యోతి పథకం కింద ఒక నెలకు సంబంధించిన సబ్సిడీలను తదుపరి నెలలోని 20వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది. తొలి విడతలో 34 లక్షల గృహాలకు.. ప్రజాపాలన కార్యక్రమం కింద గృహజ్యోతి పథకం అమలు కోసం 1,09,01,255 దరఖాస్తులు రాగా, అందులో 64,57,891 దరఖాస్తుదారులు ఆధార్‌తో అనుసంధానమై ఉన్న తెల్ల రేషన్‌కార్డును కలిగి ఉన్నారని రాష్ట్ర ఐటీ శాఖ నిర్ధారించింది. వీరిలో 34,59,585 మంది దరఖాస్తుదారులు మాత్రమే గృహ విద్యుత్ కనెక్షన్ కలిగి ఉండడంతో తొలి విడత కింద వీరికే గృహజ్యోతి వర్తింపజేయనున్నారు. ప్రస్తుత విద్యుత్ టారిఫ్ ప్రకారం..గృహజ్యోతి పథకం అమలుకు ఏటా రూ.4,164.29 కోట్ల వ్యయం కానుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. -
ఇవాళ ఇక్కడికి.. రేపు ఎక్కడికో
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్‌లు మొదలు డీఎస్పీల వరకు ఇటీవల పోలీస్‌శాఖలో పెద్ద ఎత్తున బదిలీ లు జరిగాయి. అయితే సివిల్ డీఎస్పీల పోస్టింగ్‌లు మారుస్తూ జరిగిన వరుస బదిలీలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. ఈ నెల 12న ఏకంగా 110 మంది సివిల్ డీఎస్పీలు, 14వ తేదీన మరో 95మంది, 15న మరో 26 మంది సివిల్ డీఎస్పీలను బదిలీ చేశారు. ఆ తర్వాత ఈనెల 17న వెల్లడైన ఉత్తర్వుల్లోనూ మరో 61 మంది సివిల్ డీఎస్పీలను బదిలీ చేశారు. ప్రతిశాఖలోనూ బదిలీల ప్రక్రియ అత్యంత సహజమే అయినా, ఒకసారి ఇచ్చిన పోస్టింగ్ మారుస్తూ...లేదంటే అప్పటికే ట్రాన్స్ఫర్ చేసిన వారిని తిరిగి అక్కడే కొనసాగి స్తున్నట్టు పేర్కొంటూ వరుస ఉత్తర్వులు వెలువడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘పట్టు’నిలుపుకుని.. ‘అనుకూల’పోస్టింగ్‌లు కొందరు అధికారులు బదిలీ అయినా తమ ‘పట్టు’నిలుపుకొని తిరిగి అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. మరికొందరు బదిలీ అయిన స్థానంలో చేరకముందే రోజుల వ్యవధిలోనే ‘అనుకూల’పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారన్న ప్రచా రం జరుగుతోంది. ఒకే సారి పెద్ద సంఖ్యలో బదిలీ జరిగినప్పుడు కొద్దిమేర పోస్టింగ్‌ల్లో మార్పులు సహజమే కానీ గత మూడు రోజుల్లో విడుదల చేసిన పోస్టింగ్ ఉత్తర్వులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎప్పుడు ఎక్కడికో అనే ఆందోళనలో కొందరు ఒక రోజు వచ్చిన ఆర్డర్ కాపీలో ఉన్న పోస్టింగ్‌లు ఆ తర్వాతి బదిలీ ఉత్తర్వులు వచ్చే సరికి మారిపోతుండడం కొంతమందిని మాత్రం కలవరానికి గురి చేస్తోంది. ఎప్పుడు ఎక్కడికి బదిలీ అవుతామో..అక్కడి నుంచి మళ్లీ ఎక్కడికి మారుస్తున్నారో అన్న గందరగోళం నెలకొందని కొందరు అధికారులు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన వారికే మళ్లీ కీలకస్థానాల్లో పోస్టింగ్‌లు దక్కుతున్నాయన్న చర్చ జరుగుతోంది. ‘పోలీసులపై రాజకీయ పెత్తనం ఉండబోదు’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్‌లో చెప్పినా, వాస్తవ పరిస్థితి మాత్రం అలా లేదని కొందరు వాపోతున్నారు.