TS Special
-
HMDA భూముల వేలం ఆపేసిన సర్కార్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ‘కల్పతరువు’గా భావిస్తూ వస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) భూముల వేలంను ఆపేయాలని నిర్ణయించుకుంది. వేలంపాటలో అక్రమాలు.. అవకతవకలు జరిగినట్లు గుర్తించడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. హెచ్ఎండీఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. వేలానికి ముందే పలువురు రియల్టర్లకు హెచ్ఎండీఏలోని అధికారులు సమాచారం చేరవేశారట. తద్వారా ఆ ఫలానా రియాల్టర్లకే భూములు దక్కేలా అధికారుల చర్యలు తీసుకున్నట్లు తేలింది. ఈ మేరకు.. వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. దీంతో వేలంపాటను ఆపేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు.. ఇప్పటికే వేలం వేసిన భూములపై అధికారులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే.. వేలంపాట సమయంలోనే కాకుండా.. ఆ తర్వాత కూడా హెచ్ఎండీఏలో తన పరిచయాల ద్వారా శివ బాలకృష్ణ ఈ తతంగాన్ని నడిపించినట్లు గుర్తించారు . భూములు వేలం తో పాటు ప్రాజెక్టుల వివరాలను రియల్టర్లకు చేర్చారు హెచ్ఎండీలో పని చేసిన అధికారులు. అంతేకాదు ధరలను నిర్ణయించడంలోనూ వీళ్లే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ అధికారుల పాత్రపైనా ఏసీబీ లోతైన దర్యాప్తు చేపట్టింది. ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాన్వేషణలో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూముల్ని వేలం వేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధికారం అండతో.. అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు శివబాలకృష్ణ. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఏసీబీకి అతను ఆస్తులు కూడబెట్టిన తీరు ఏసీబీని సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇంట్లోవాళ్లు, బంధువులు, ఆఖరికి పనివాళ్ల పేరిట మీద కూడా బినామీ ఆస్తుల్ని కూడబెట్టాడతను. దీంతో బినామీలను అరెస్ట్ చేసి ఈ పాటికే విచారణ చేపట్టిన ఏసీబీ.. ఇవాళో, రేపో కీలక అరెస్టులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
జన్వాడలో ఉద్రిక్తత: 144 సెక్షన్.. 21 మంది అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని జన్వాడ చర్చ్‌పై దాడి కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేసినట్టు మొకిలా పోలీసులు తెలిపారు. కాగా, వివరాల ప్రకారం.. జన్వాడలో రోడ్ వైడ్నింగ్ చేయాలని ఒక వర్గం పట్టుబట్టింది. ఈ క్రమంలో పంచాయతీరాజ్ అధికారులు దీనికి ఒప్పుకోకపోవడంతో అక్కడున్న చర్చ్‌పై వారంతా దాడికి పాల్పడ్డారు. కాగా, చర్చ్ కూల్చివేతను మరో వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో దాదాపు 200 మంది పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేప్టటారు. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ తెలిపారు. అలాగే, జాన్వాడలో 144 సెక్షన్ కొనసాగుతోందన్నారు. ఈనెల 21వ తేదీ వరకు జన్వాడలో ఆంక్షలు అమలులో ఉంటాయని హెచ్చరించారు. -
అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మిస్తాం
బంజారాహిల్స్ (హైదరాబాద్): రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత కూడా తమదేనన్నారు. ఆ తండాలకు పంచాయతీ భవనాలను నిర్మిస్తామన్నారు. గురువారమిక్కడి బంజారాభవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాల్లో రేవంత్ మాట్లాడారు. విద్యుత్, మంచినీరు... ఇలా ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, అన్ని నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. బంజారా సోదరులతో ఈ సమావేశం నిర్వహిస్తుంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలిసినంత ఆనందంగా ఉందని చెప్పారు. 1976లో బంజారాలను ఎస్టీ జాబితాలో ఇందిరాగాంధీ చేర్చారని, ఆ తర్వాత దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాందీదేనన్నారు. మీ ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, సేవాలాల్ జయంతిని ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ఇచ్చిందని చెప్పారు. జయంతి ఉత్సవాల నిర్వహణకు రూ.కోటి కాదు.. మరో కోటి జత చేసి రూ.2 కోట్లు విడుదల చేస్తున్నామని, తక్షణమే దీనికి సంబంధించిన జీఓను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి కె.జానారెడ్డి, బలరాంనాయక్, రాములునాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి.విజయారెడ్డి, బంజారా సంఘ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
మహిళలకు రిజర్వేషన్లు.. ప్రతి కేటగిరీలో 33.3%
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామ కాల్లో మహిళలకు హారిజాంటల్ (సమాంతర) పద్ధతిలో 33 1/3 శాతం (33.333%) రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఆ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తాజాగా ఉత్తర్వులు జారీ (జీఓ.ఎంఎస్.3) చేశారు. వీటి ప్రకారం మహిళలకు ఓపెన్ కాంపిటీషన్ (ఓసీ)తో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, దివ్యాంగులు, ఎక్స్ సర్విస్‌మెన్, క్రీడాకారుల కోటాలో హారిజాంటల్ పద్ధతి (రోస్టర్ పట్టికలో ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా)లో 33 1/3 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఇప్పటివరకు వర్టీకల్ పద్ధతి (పట్టికలోని పోస్టుల్లో కొన్నిటిని ప్రత్యేకంగా మహిళలకంటూ మార్కింగ్ ఇచ్చేవారు)లో ఉద్యోగ నియామ కాలు చేయగా.. ఇకపై ఎలాంటి మార్కింగ్ చేయకుండా 33 1/3శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం సూచించిన మెథడాలజీ ప్రకారం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలుకు గతంలో ఇచ్చిన జీవో నం.41/1996, జీవో నం. 56/1996 ఉత్తర్వులు రద్దు చేసింది. ఈ పద్ధతిని ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాజ్యాంగ నియామక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేకంగా జీవో జారీ చేయనుందని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మెమోకు అనుగుణంగా ఉత్తర్వులు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సాధారణ పరిపాలన శాఖ తరపున ఒక మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ మెమోను అన్ని నియామక సంస్థలకు పంపించారు. ఈ విషయంలో న్యాయ వివాదాలు తలెత్తకుండా మహిళా శిశు సంక్షేమశాఖ 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలు కోసం 1996లో జారీ చేసిన జీవో నం.41కు, రాష్ట్ర సబార్డినేట్ సర్విసు నిబంధనలు రూల్.22కు సవరణలు చేయాలని పేర్కొంటూ టీఎస్పీఎస్సీ ఈనెల 8న మహిళా శిశు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది. -
నీటిపారుదలపై శ్వేతపత్రం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేసే అవకాశమున్నట్టు సమాచారం. నీటిపారుదలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రభుత్వం కొద్దికాలంగా చెబుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారమే దీనిని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గత పదేళ్లలో సాగు నీళ్లివ్వడానికి కాకుండా కేవలం కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం కోసమే ప్రాజెక్టులు చేపట్టారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ అంశాలతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతను శ్వేతపత్రంలో పొందుపరుస్తున్నట్టు తెలిసింది. దీనిపై స్వల్పకాలిక చర్చను పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కులగణన తీర్మానాన్ని కూడా ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి ఈ తీర్మానాన్ని గురువారమే సభలో ప్రవేశపెట్టాలని సర్కారు భావించింది. అయితే బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సుదీర్ఘంగా సాగడంతో వీలు కాలేదు. దీంతో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఏకగ్రీవ ఆమోదం: స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరాని ప్రవేశపెట్టిన రూ.2,75,891 కోట్ల బడ్జెట్‌ను, ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా దానిపై బుధ, గురువారాల్లో చర్చ జరిగింది. చర్చకు ఆర్థికమంత్రి సమాధానమిచ్చిన తర్వాత తొలుత వచ్చే నాలుగు నెలల కాలానికి అత్యవసర ఖర్చుల నిమిత్తం ప్రవేశపెట్టిన రూ.78,911.23 కోట్ల ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించింది. అనంతరం 2023–24 సంవత్సరం అనుబంధ పద్దు కింద ప్రవేశపెట్టిన రూ.46,400.9 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. మరోవైపు బడ్జెట్‌కు ఆమోదం తర్వాత శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. పేద ప్రైవేటు ఉద్యోగుల కోసం ప్రణాళిక: భట్టి ‘ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు అవసరమవుతాయి. అవసరమైతే డిమాండ్‌కు అనుగుణంగా 5 లక్షల ఇళ్లు నిర్మించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దళితులకు బాబాసాహెబ్ అభయహస్తం కింద ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల మేరకు ఆర్థిక స్వావలంభన కల్పించే పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నాం. గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో రూ.17,700 కోట్లు పెట్టినా రూపాయి విడుదల చేయలేదు. ఈ బడ్జెట్లో రూ. 1,000 కోట్లు పెట్టాం. అప్పులు తిరిగి చెల్లించడానికే రూ.64 వేల కోట్లకు పైగా కావాలని, అందుకే రూ.68 వేల కోట్ల కొత్త అప్పులను బడ్జెట్లో ప్రతిపాదించాం. త్వరలో బీసీ సబ్‌ప్లాన్ విధివిధానాలు బీసీ సబ్‌ప్లాన్‌కి సంబంధించిన విధివిధానాలు కూడా సిద్ధం చేస్తున్నాం. త్వరలో ప్రకటిస్తాం. కొద్ది రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఆరు గ్యారంటీలకు వచ్చిన దరఖాస్తులకు అనుగుణంగా నిధుల కేటాయింపు జరుపుతాం. అర్హులైన దరఖాస్తుదారులందరికీ ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తాం. ధరణిపై నియమించిన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కార్యాచరణ ప్రారంభిస్తాం. రీయింబర్స్మెంట్ ఫీజులు 2018 నుంచి పెండింగ్‌లో ఉండడం బాధాకరం. ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా వాటిని చెల్లిస్తాం. ఎస్‌హెచ్‌జీలకు మళ్లీ వడ్డీ లేని రుణాలు ఇస్తాం. రెసిడెన్షియల్ పాఠశాలలకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం. కేంద్రం, రాష్ట్రాల మధ్య సుహ్రుద్భావ వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది..’ అని ఆర్థికమంత్రి భట్టి తన సమాధానంలో చెప్పారు. ప్రైవేటు రంగంలో పనిచేసే పేద వర్గాలు ఉద్యోగ విరమణ తరువాత నెలనెలా పీఎఫ్ తరహాలో కొంత మొత్తం పొందేలా ప్రణాళిక చేపట్టనున్నట్లు తెలిపారు. రద్దయిన డీడీఆర్సీ సమావేశాలను పునరుద్ధరిస్తామని అన్నారు. కుట్రలు చేసేవారిని వదిలిపెట్టం ‘మా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు చేసే వారెవరినీ వదిలిపెట్టం. కొందరు విద్యుత్ అధికారులు మా ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా బద్నాం చేసేందుకు రైతులను ఇబ్బంది పెట్టారు. మా దృష్టికి వచ్చిన వెంటనే స్థానిక ఎస్ఈపై బదిలీ వేటు వేశాం. గత ప్రభుత్వంలో పనిచేసిన డిస్కంల డైరెక్టర్లందరినీ తొలగించి నిబంధనల కొత్త వారిని నియమించడానికి నోటిఫికేషన్ జారీ చేశాం..’ అని భట్టి తెలిపారు. పశుగ్రాసాన్ని కోసే యంత్రాలకు ఉచిత విద్యుత్ వాడే రైతులను విద్యుత్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రస్తావించగా భట్టి బదులిచ్చారు. -
పెళ్లికి పిలుస్తలేరు.. చావుకు చెప్తలేరు!
మానకొండూర్ రూరల్: ఊరిలో ఆ కులానివి దాదాపు 50 గడపలు. శుభకార్యమైనా.. అశుభ కార్యమైనా అందరూ కలసికట్టుగా హాజరవుతారు. అయితే పంచాయితీ పెద్దలు చెప్పినట్లు వినలేదని, వారి తీర్పును తిరస్కరించారని కులం నుంచి ఓ కుటుంబాన్ని బహిష్కరించారు. ఏడాదికాలంగా గ్రామంలో పెళ్లయినా, చావైనా వీరిని పిలవడంలేదు. బాధిత కుటుంబం కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మాదాసు సంపత్ కుటుంబానికి ఊరిలో వారసత్వంగా వచ్చిన 1.03 ఎకరాల వ్యవసాయ భూమి అతని తండ్రి కొమురయ్య పేరున ఉంది. 2014లో సంపత్ తండ్రి కొమురయ్య మరణించాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అడప శ్రీనివాస్ ఆ భూమి విషయంలో సంపత్తో గొడవకు దిగాడు. స్థానిక కోర్టుకు వెళ్లడంతో తీర్పు సంపత్‌కు అనుకూలంగా వచ్చింది. దీంతో తమ భూమిని సాగు చేసేందుకు అతను వెళ్లాడు. అయితే.. అడప శ్రీనివాస్, సంపత్‌ను అడ్డుకుని.. దాడి చేశాడు. గొడవ పెద్దది కావడంతో ఇరువురూ పోలీసుస్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై ఇద్దరూ ఏడాది క్రితం గ్రామంలోని పంచాయితీ పెద్దలను ఆశ్రయించారు. వారు ఇరువర్గాలు రూ.50 వేలు డిపాజిట్ పెట్టాలని సూచించారు. సంపత్ తనవద్ద అంతమొత్తం లేవని, రూ.5 వేలు మాత్రమే ఇచ్చాడు. దీంతో తాము చెప్పినట్లు వినలేదని పంచాయితీ పెద్దలు సంపత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటినుంచి వారి కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలోని తమ కులస్తులు ఏడాదికాలంగా తమను ఎలాంటి కార్యాలకు పిలవకపోవడంతో మనోవేదనకు గురవుతున్నట్లు సంపత్ కుటుంబం వెల్లడించింది. కుల బహిష్కరణ చేసిన 11 మంది పంచాయితీ పెద్దలపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఆయన ఇటీవల సీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాడు. -
2032–33 నాటికి కట్టాల్సింది.. రూ.2.5 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై అప్పుల భారం తీవ్రంగా ఉందని, రానున్న పదేళ్లలో రుణాల తిరిగి చెల్లింపు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’నివేదికలో పేర్కొంది. మార్కెట్ రుణాల మీద వడ్డీ, అసలు కలిపి.. 2032–33 నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,52,048 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 2022 మార్చి 31తో ముగిసిన (2021–22) ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిర్వహణ తీరుపై కాగ్ రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీ ముందుపెట్టింది. బడ్జెట్లో పేర్కొనకుండా తీసుకున్న రుణాల్లో (ఆఫ్ బడ్జెట్) కాళేశ్వరానికే ఎక్కువగా ఉన్నాయని కాగ్ పేర్కొంది. ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)’కింద రూ.66,854 కోట్లు తీసుకున్నారని.. ఈ రుణాల అసలు, వడ్డీ కలిపి 14 ఏళ్లలో రూ.1,45,545 కోట్లు చెల్లించాలని పేర్కొంది. దీనితో సమీప భవిష్యత్తులో అభివృద్ధి ప్రణాళికల విషయంలో రాష్ట్ర సామర్థ్యం పరిమితం అవుతుందని వ్యాఖ్యానించింది. కాగ్ నివేదికలోని అంశాలివీ.. ► రెవెన్యూ రాబడులు 26 శాతం పెరిగినా మిగులును సాధించడంలో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా విఫలమైంది. బడ్జెట్ నుంచి చెల్లిస్తున్న ఆఫ్ బడ్జెట్ రుణాలు, ఇతర చెల్లింపులను కలిపితే.. జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి 37.77 శాతంగా ఉంది. ఇది ఎఫ్ఆర్బీఎం చట్టం నిర్దేశించిన దానికంటే 12.77 శాతం, 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన దానికంటే 8.47 శాతం ఎక్కువ. ►2021–22లో రెవెన్యూ వ్యయం 11 శాతం పెరిగింది. ఇందులో జీతాలు, వడ్డీ చెల్లింపులే ఎక్కువ భాగం ఉన్నాయి. విద్య, ఆరోగ్యం మీద ఖర్చు విషయంలో రాష్ట్రం వెనుకంజలో ఉంది. మొత్తం వ్యయంలో 8శాతం విద్య, 4శాతం ఆరోగ్యంపై ఖర్చు చేశారు. ► అంతకుముందు ఏడాదితో పోలిస్తే మూలధన వ్యయం 81శాతం పెరిగింది. 2021–22లో రూ.28,874 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చుపెట్టారు. అయితే 2022 నాటికి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల మీద రూ.1,09,612 కోట్లు మూలధనం ఖర్చయింది. ► బడ్జెట్ వ్యయం కింద రూ.2,30,872 కోట్లకు ప్రభుత్వం అసెంబ్లీ అనుమతి తీసుకుంది. తర్వాత అనుబంధంగా రూ.24,144 కోట్ల మేర అంచనాలకు ఆమోదం తెలిపింది. అయితే రెవెన్యూ ఖర్చు రూ.2,63,092 కోట్లుకాగా.. నికర అధిక వ్యయం రూ.8,076 కోట్లు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులను పరిగణనలోకి తీసుకోకపోతే అయిన ఖర్చు రూ.1,95,818 కోట్లే. అంటే బడ్జెట్ అంచనాల్లో వాస్తవఖర్చు 77శాతమే. ► 2014–15 నుంచి 2020–21 వరకు కలిపి బడ్జెట్లకు అదనంగా చేసిన రూ.2,14,062 కోట్ల ఖర్చుకు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంది. ఇది ప్రజావనరుల నిర్వహణలో క్రమశిక్షణ రాహిత్యమే. ► దళితబంధు కోసం రూ.1,000 కోట్లు కేటాయించారు. కానీ వినియోగ పద్దులో రూ.4,442 కోట్లు ఖర్చు చూపెట్టారు. వాస్తవంగా ఖర్చయినది రూ.2,101 కోట్లు మాత్రమే. అనర్హులకు ‘ఆసరా’తో రూ.1,175 కోట్లు నష్టం అర్హతలేని 2.02 లక్షల మందికి లబ్ధి కలిగిందన్న కాగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద అనర్హులకు ఆసరా పింఛన్లు అందుతున్నాయని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ కొందరు లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించినా కూడా వారిని జాబితా నుంచి తొలగించారని తెలిపింది. దీనితో 2021 మార్చి 31తో ముగిసిన (2020–21) ఆర్థిక సంవత్సరంలో 2.02 లక్షల మంది అనర్హులకు రూ.1,175 కోట్ల మేర అక్రమ చెల్లింపులు జరిగినట్టు తేల్చింది. కుటుంబ ఆదాయానికి సంబంధించిన సిస్టమ్‌లో అంతర్గతంగా కచ్చితమైన నియంత్రణలు లేవని.. దీనితో నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ ఆదాయమున్నవారికీ లబ్ధి కలిగిందని తెలిపింది. సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) డేటాలోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 16శాతం కుటుంబాలకు ఆసరా పింఛన్లకు అర్హత లేదని స్పష్టమవుతోందని, అయినా పింఛన్ దరఖాస్తుల పరిశీలన, మంజూరు, గుర్తింపు ప్రక్రియలను సమర్థవంతంగా చేయలేదని తప్పుపట్టింది. 2018 ఏప్రిల్ నుంచి 2021 మార్చి మధ్య సగటున నెలకు 2.30 లక్షల (6 శాతం) మంది లబ్ధిదారులకు పింఛన్ల చెల్లింపు జరగలేదని పేర్కొంది. ఇసుక విధానంలో లోపాలతో ఖజానాకు గండి ఇసుక వెలికితీతలో టీఎస్ఎండీసీ తీరును తప్పుపట్టిన కాగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక విధానంలోని లోపాలతో, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) తీరుతో ఖజానాకు నష్టం వాటిల్లిందని ‘కాగ్’పేర్కొంది. టీఎస్‌ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకున్న గిరిజన సంఘాలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలను సబ్ లీజ్‌కు అప్పగించడంతో.. థర్డ్ పార్టీకి రూ.11.61 కోట్లు అనుచిత లబ్ధి జరిగిందని పేర్కొంది. దుమ్ముగూడెం వద్ద ఇసుక కాంట్రాక్టర్లకు చెల్లించే ధర నిర్ణయంలో ఆలస్యంతో రూ.172.64 కోట్ల మేర ప్రభుత్వం ఆదాయం కోల్పోయిందని పేర్కొంది. అధిక లోడింగ్, వాహనాల కదలికలను గుర్తించే సీసీ కెమెరాలు, జీపీఎస్ పరికరాలను అరకొరగా ఏర్పాటు చేయడం సరికాదని తెలిపింది. ఇసుక రేవులు, నిల్వ కేంద్రాల కార్యకలాపాలపై టీఎస్ఎండీసీ పర్యవేక్షణ లోపభూయిష్టమని పేర్కొంది. అనుమతులు లేకుండా చేపట్టిన తవ్వకాలతో 2022 మార్చి నాటికి రూ.108.96 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని కాగ్ తెలిపింది. 2016–21 మధ్య రూ.171.32 కోట్లు రహదారి చార్జీలు వసూలైతే.. అందులో ప్రభుత్వం రూ.162.27 కోట్లను ఇతర ప్రయోజనాలకు మళ్లించిందని పేర్కొంది. -
Valentine's Day: ప్రేమిస్తే టీసీ ఇచ్చి పంపించారు..
ప్రేమ..అదో మధురానుభూతి. ఈ భావాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రతి ఒక్కరికీ ఎప్పుడో.. అప్పుడు ఎవరిపైనో మనసులాగేసే ఉంటుంది. ఆ సందర్భంలో మనసులోని వింత అనుభావాలను ఆస్వాధించే ఉంటారు.. ‘ప్రేమించడం కన్నా.. ప్రేమించబడడం అదృష్టం’ అన్నాడో సినీ కవి. అలా దాన్ని చివరి వరకు నిలుపుకుని భాగస్వామి సంతోషమే తమ సంతోషంగా భావిస్తూ కొన్ని జంటలు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నాయి. ప్రేమ..పెళ్లి పీటల వరకు చేరే క్రమంలో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా ఒక్కటయ్యారు. ప్రేమలో గెలిచి దంపతులుగా అన్యోన్య జీవనం గడుపుతున్న కొన్ని జంటల జీవితాలను ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ పాఠకుల ముందు ఆవిష్కరిస్తోంది. ప్రియురాలిని ప్రయోజకురాలిగా చేసి.. ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లికి చెందిన దేవరపల్లి ప్రవీణ్‌రెడ్డి మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడేనికి చెందిన బంధువుల అమ్మాయి భవానిరెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా ఇద్దరిలో ప్రేమను చిగురింపజేసింది. అయితే, నిరుపేద కుటుంబానికి చెందిన భవానీరెడ్డి డిగ్రీ మధ్యలో చదువు మానేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న ప్రవీణ్‌రెడ్డి ప్రియురాలిని పీజీ వరకు చదివించాడు. ఆ వెంటనే ఆమెకు వీఆర్వో ఉద్యోగం వచ్చింది. అయినా.. ఆమెను ప్రోత్సహించడంతో 2019లో ఎస్ఐ ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత 2021లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో భవానీరెడ్డి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రవీణ్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లో ఎల్ఎల్బీ ప్రాక్టీస్ చేస్తున్నారు. తొమ్మిది నెలల బాబుతో సంతోషంగా జీవిస్తున్నారు. అడ్డంకులను అధిగమించి.. మోత్కూరు : వారిద్దరి మనసులు కలిశాయి. కులా లు అడ్డుగోడలుగా నిలిచినా ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు.. మోత్కూరుకు చెందిన ఎడ్ల శ్రీకాంత్, సముద్రాల సింధూజ దంపతులు. మోత్కూరులో ఫొటోగ్రాఫర్ వృత్తి నేర్చుకుంటున్న శ్రీకాంత్‌కు పట్టణంలోని సముద్రాల వెంకన్న కూతురు సంధ్యతో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమంలో ప్రేమగా మారింది. విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో అడ్డంకులు సృష్టించారు. సంధ్యను హైదరాబాద్‌లో బీటెక్ చదివిస్తూ అక్కడే సోదరుడి వద్ద ఉంచారు. శ్రీకాంత్ రెండేళ్ల ఎడబాటు తర్వాత సంధ్యను కలుసుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2018వ సంవత్సరం ఫిబ్రవరి 15న యాదగిరిగుట్టలో సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వ్యతిరేకించి సంధ్య తల్లిదండ్రులు శ్రీకాంత్‌పై కేసు పెట్టినా కోర్టు ప్రేమజంటకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఈ దంపతులు మోత్కూరులో ఫొటో స్టూడియో, ఇంటర్నెట్ సెంటర్ నడుపుకుంటూ తమ ఆరేళ్ల కుమారుడు రెహాన్‡్ష, నాలుగేళ్ల కూతురు శ్రీహన్షతో ఆనందంగా జీవిస్తున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు రామగిరి (నల్లగొండ): మిర్యాలగూడకు చెందిన తుమ్ములూరి మురళీధర్ రెడ్డి హాలియాకు చెందిన పుష్పలత ఇద్దరు బంధువులు. అయినా మొదట్లో వీరికి పరిచయం లేదు. బంధువుల వివాహంలో పుష్పలత తొలిసారిగా మురళీధర్ రెడ్డిని చూసింది. ఆ తర్వాత మురళీధర్ రెడ్డి అడ్రస్ తెలుసుకొని ఉత్తరాలే రాసేది. అవి చూసి తను తెలిసీతెలియక రాస్తుందేమో అనుకునేవాడు. అలా చాలా సార్లు లెటర్లు రాసూ్తనే ఉండేది. అప్పుడు మురళీధర్‌రెడ్డికి అనిపించింది..ఆమె నన్ను నిజంగా ప్రేమిస్తుందని. అప్పటికీ వారి చదువు పూర్తి కాలేదు. ఇంట్లో వాళ్లకు విషయం తెలిసింది. కానీ వారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మురళీధర్ రెడ్డి నల్లగొండలో కంప్యూటర్ హార్డ్‌వేర్‌గా స్థిరపడగా, పుష్పలత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు. అశుతోష్ రెడ్డి ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో స్థిరపడగా, అమిత్ రెడ్డి డిఫెన్స్ అకాడమీలో పైలెట్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమిస్తే టీసీ ఇచ్చి పంపించారు.. భూదాన్‌పోచంపల్లి : తెలిసీ తెలియని వయస్సులో మైనర్‌ను ప్రేమించాడు. బాలికకు సైతం అతనంటే ఇష్టమే. కానీ తల్లిదండ్రులకు విషయం తెలిస్తే ఏమి అవుతుందోనని భయం. చివరకు ఈ విషయం తెలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్బాయికి టీసీ ఇచ్చి పంపించారు. అయినా పట్టువిడవకుండా అమ్మా యి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. చివరకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని 38 ఏళ్లుగా అన్యోన్య జీవనం సాగిస్తున్న భూదాన్ పోచంపల్లి జెడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి ప్రేమపెళ్లి గా«థ ఇది. భూదాన్‌పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన కోట మల్లారెడ్డి పోచంపల్లి జెడ్పీ హైసూ్కల్లో 9వ తరగతి చదువుతుండగా ఇదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సామల పుష్పలతను ప్రేమించాడు. ఈ విషయం పుష్పలత తల్లిదండ్రులు, ఇటు స్కూల్లో ఉపాధ్యాయులకు తెలిసి రచ్చ అయ్యింది. దాంతో మల్లారెడ్డికి ప్రధానోపాధ్యాయుడు టీసీ ఇచ్చి పంపించారు. పెళ్లి చేసుకోవడానికి ఆస్తులు, అంతస్తులు అడ్డు వచ్చి పుష్పలత తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. ఇంటర్ పూర్తి చేసిన నాలుగేళ్ల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి 1989 మే 10న పెళ్లి చేసుకొన్నాడు. ప్రస్తుతం వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పుష్పలత ప్రస్తుతం పోచంపల్లి మండల జెడ్పీటీసీగా ఉన్నారు. కాగా కోట మల్లారెడ్డి ప్రతి ఏటా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున తన సతీమణికి గిఫ్ట్ ఇస్తూ ప్రేమను చాటుతున్నారు. ఒకే ఇంట్లో మూడు ప్రేమ వివాహాలు కోదాడ: తల్లిదండ్రులు కులాలకు అతీతంగా ప్రేమ వివాహం చేసుకోగా.. వారి బాటలోనే వారి ఇద్దరు కుమారులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోదాడ మండల పరిధిలోని కొమరబండకు చెందిన దివ్యాంగుడు కందుల పాపయ్య అదే గ్రామానికి చెందిన వెంకట్రావమ్మను 1980వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెద్ద కుమారుడు కందుల మధు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ తన క్లాస్మేట్ విజయలక్షి్మని 2010లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పాపయ్య చిన్న కుమారుడు కందుల విక్రమ్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ 2014లో తన తోటి ఉద్యోగి ఉషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇలా ఒకే ఇంట్లో ముగ్గురు ప్రేమ వివాహాలు చేసుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఖండాలు దాటి.. ఇంగ్లండ్‌లో చిగురించిన ప్రేమ కోదాడ: ఇండియాలో పుట్టిన వారు ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. అక్కడి యూనివర్సిటీలో కలిసిన మనస్సులు కులమతాలకు అతీతంగా వారిని ఒకటి చేశాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరి నచ్చడంతో వారిమధ్య చిగురించిన ప్రేమ పెళ్లిపీటల వరకు తీసుకెళ్లింది. ప్రస్తుతం వారు ఇద్దరు పిల్లలతో అక్కడే నివాసముంటున్నారు. ప్రేమించడం కన్నా ఆ ప్రేమను నిలుపుకోవడం ముఖ్యమంటున్నారు లంకెల బాలకృష్ణారెడ్డి– నీనశ్రీ దంపతులు. కోదాడకు చెందిన లంకెల బాలకృష్ణారెడ్డి 2007లో ఎంఎస్ చదవడానికి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌కు వెళ్లాడు. ఎంఎస్ కోసం అదే యూనివర్సిటీలో హైదరాబాద్‌కు చెందిన నీనశ్రీ కూడా చేరారు. ఇద్దరు కులాలు వేరైనా అభిప్రాయాలు కలవడంతో వారి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. ఇండియాలో ఉన్న పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఇంగ్లండ్ వారసత్వాన్ని పొందారు. ప్రేమికుల రోజు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమించడం.. ప్రేమించబడడం అదృష్టమని దాన్ని చివరి వరకు నిలుపుకొని భాగస్వామి సంతోషాన్నే తమ సంతోషంగా ఇరువురు భావించినపుడే అ బంధం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని చెప్పారు. తొలి పరిచయంలోనే ఇష్టపడి.. హుజూర్నగర్ : రెండు భిన్న కులాలకు చెందిన యువతీ, యువకుడి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు వివాహానికి అంగీకరించక పోడంతో రాజకీయ నాయకుల సహాయంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం వర్ధాపురం గ్రామానికి చెందిన బచ్చలకూరి బాబు, శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ప్రవీణ 26 ఏళ్ల క్రితం హుజూర్‌నగర్‌లో తొలి పరిచయంలోనే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు వివాహానికి అంగీకరించలేదు. దీంతో స్థానిక సీపీఐ నాయకుడు కేవీరాజు సహాయ సహకరాంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. పెద్దమ్మాయి అఖిల అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసింది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికై ఇటీవల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. కాగా చిన్న కూతురు అచ్యుత బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ప్రస్తుతం వారి కుటుంబం హుజూర్‌నగర్‌లో నివాసం ఉంటోంది. -
రేడియో.. ఓ మధుర జ్ఞాపకం
మిరుదొడ్డి(దుబ్బాక): రేడియో ఈ పేరు వింటే చాలు ఒకప్పుడు కాలక్షేపానికి వినోద ప్రచార సాధనంగా నిలిచింది. నాడు రేడియోలో వచ్చే ధ్వని కార్యక్రమాలు మనసుతో చూసేలా కంటికి కదలాడేవి. సుప్రభాత పాటలతో పల్లెలను, పట్టణాలను మేలుకొల్పేవి. సినిమా, జానపద గీతాల ప్రసారాలతో మనసును ఉరకలెత్తించేవి. మధ్యాహ్నం కారి్మక లోకాన్ని తట్టి లేపేవి. సాయంత్రం రేడియోలో వచ్చే వార్తలు, వ్యవ సాయ సాగు పద్ధతులు జనరంజకంగా పలకరించేవి. అలసిన ప్రతి ఒక్కరికీ కమ్మనైన సంగీతంతో మనసును ఓలలాడించి నిద్ర పుచ్చేవి. కానీ శాస్త్ర పరిజ్ఞానం పెరిగిపోయి కలర్ టీవీలు, సెల్ ఫోన్ల రాకతో రేడియోలు కనుమరుగయ్యాయి. రేడియోతో ఉన్న తమ అనుబంధాన్ని ఒదులుకో లేక కొందరు రేడియో ప్రియులు రేడియోలను భద్రంగా దాచుకుంటూ వాటితో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. కనిపించని రేడియో శాస్త్ర పరిజ్ఞానం పెరిగిపోవడంతో మొదట బ్లాక్ అండ్ వైట్ టీవీల రాకతో కాస్త వెనుక బడ్డ రేడియోలు కలర్ టీవీలు ఇంటింటికీ రంగ ప్రవేశం చేశాక పూర్తిగా మూలనపడ్డాయి. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జేబులో సెల్ ఫోన్లు మార్మోగి పోతుండడంతో రేడియోలు పూర్తిగా కనురుగయ్యాయి. సెల్ఫోన్లో ప్రపంచం నలు మూలల్లో ›జరిగే వార్తా విశేషాలు ఎప్పటికప్పుడూ తెలిసి పోతుండటంతో రేడియోల వినియోగం ప్రశ్నార్థకంగా మారింది. రేడియో దినోత్సవం రేడియో కనుమరుగైపోతున్న క్రమంలో యునె స్కో 36వ కాన్ఫరెన్స్ సమావేశంలో 2011 నవంబర్ 13న తీసుకున్న తీర్మాణం ప్రకారం 2012 ఫిబ్రవరి 13న తొలి సారిగా అంతర్జాతీయ రేడియో డేగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ దాచుకున్నా.. నా చిన్నప్పుడు ఎక్కువ రేడియోతోనే పోపతి ఉండేది. అప్పుడు రేడియోలు పెద్ద పెద్ద వాళ్ల ఇళ్లల్లో ఉంటుండే. నాకు కూడా ఒక రేడియో కొనుక్కోవాలని అనిపించింది. నాడు బ్యాటరీలతో రేడియోలు పని చేస్తుండే. రాను రాను ఇంటింటికీ కలర్ టీవీలు, సెల్ ఫోన్లు రావడంతో రేడియోలు మూలకు పడ్డాయి. ఇప్పుడు రేడియోలు వాడాలంటే బ్యాటరీలు మార్కెట్లో దొరకడం లేదు. వాటిని రిపేరు చేసే వాళ్లు లేకుండా పోయారు. ఇప్పటికీ రేడియోను భద్రంగా దాచుకున్న. – ఎర్రోల్ల బాల్‌నర్సయ్య, మిరుదొడ్డి -
హుక్కా కేంద్రాల నిషేధం.. బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది. అనంతరం హుక్కా సెంటర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్మెంట్ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఎలాంటి చర్చలేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. ఈ బిల్లు రాకతో ఇక నుంచి తెలంగాణలో హుక్కా సెంటర్లు మూతపడనున్నాయి. హుక్కా నిషేధం అమల్లోకి రానుంది.బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సిగరెట్ పొగ కంటే హుక్కా మరింత హానికరమని చెప్పారు. యువతకు హుక్కా వ్యసనమయ్యే అవకాశం ఉందన్నారు. బొగ్గు ఉపయోగించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుందని దీన్ని సేవించే వారి వల్ల చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదమని తెలిపారు. హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని సీఎం భావించారని పేర్కొన్నారు. చదవండి: TS: అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్ -
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉగ్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వమోయపరిమితి సడలించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. చదవండి: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్ -
తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్
గ్రూప్ 1 నోటిఫికేషన్‌పై కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. గతంలో టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో త్వరలో కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. కాగా రెండేళ్ల కిందట తొలిసారి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్లింది. అయితే తాజాగా గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఇక గతంలోని 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరుకుంది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో 503 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని 46 ఏళ్ల వరకు సడలిస్తామని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల కానుంది. -
వ్యభిచార గృహాలుగా ఫాంహౌస్‌లు!
మొయినాబాద్: వారాంతపు విడిదిలు వ్యభిచార గృహాలుగా మారుతున్నాయి. వీకెండ్లో సరదాగా గడపడానికంటూ నగర శివారు ప్రాంతాల్లో నిర్మించుకుంటున్న ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడిచేసి గుట్టురట్టు చేస్తున్నా మళ్లీ కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు ఫాంహౌస్‌లను లీజ్‌కు తీసుకుని వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వాటికి ఆకర్షితులై యువత పెడదారి పడుతుంది. హైదరాబాద్ శివారుల్లోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలా మంది బడాబాబులు ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. 111 జీఓ పరిధిలో ఉన్న మొయినాబాద్, శంకర్పల్లి, శంషాబాద్ మండలాల్లో ఫాంహౌస్‌లు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఒక్క మొయినాబాద్ మండలంలోనే సుమారు వెయ్యికి పైగా ఫాంహౌస్లున్నాయి. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న మొయినాబాద్ మండలంలో చాలా మంది 10 గుంటల నుంచి 1 ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్ నిర్మిస్తున్నారు. వీకెండ్స్‌లో పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఫాంహౌస్‌లు నిర్మించుకుని తర్వాత వాటిని ఇతరులకు లీజుకు, అద్దెకు ఇస్తున్నారు. నిర్వాహకుల అడ్డగోలు దందా.. ఫాంహౌస్‌లను అద్దెకు తీసుకున్న నిర్వాహకులు అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్ టూ గెదర్ పారీ్టలు, ఫ్యామిలీ పారీ్టలు, బర్త్డేలంటూ రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. ఫాంహౌస్‌లకు వచ్చే యువకులను ఆకర్షించే విధంగా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఫాంహౌస్‌లలో ఉంచుతున్నారు. అమ్మాయిలను వ్యభిచారం రొంపిలోకి దింపి యువకుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. మొయినాబాద్ మండలంలోని కనకమామిడి, చాకలిగూడ, సురంగల్, శ్రీరాంనగర్, తోలుకట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, అప్పారెడ్డిగూడ, ఎలుకగూడ, కుత్బుద్దీన్‌గూడ, రెడ్డిపల్లి, ఎనికేపల్లి, అజీజ్‌నగర్, బాకారం, అమ్డాపూర్ తదితర గ్రామాల పరిధిలో ఉన్న ఫాంహౌస్‌లలో ఈ దందాలు జోరుగా కొనసాగుతున్నాయి. నిఘా వైఫల్యం! ఫాంహౌస్‌ల్లో జరుగుతున్న వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలకు పోలీసుల నిఘా వైఫల్యమే కారణమని తెలుస్తుంది. ఫాంహౌస్లపై నిఘా పెట్టాల్సిన పోలీసులు నిర్వాహకులతో మిలాకత్ అవుతున్నట్లు సమాచారం. అందుకే ఫాంహౌస్‌ల్లో రాత్రిపూట ఎంత హంగామా జరిగినా పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎలుకగూడ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహించడం వల్ల యువకుల మధ్య జరిగిన గొడవలు ఓ యువకుడి ఆత్మహత్యకు దారితీసినట్లు సమాచారం. అప్పడప్పుడు ఫాంహౌస్లపై జరుగుతున్న దాడులు ఎస్ఓటీ పోలీసులు చేస్తున్నవే కావడం విశేషం. వరుస ఘటనలు... మొయినాబాద్ మండలంలోని ఫాంహౌస్‌ల్లో వరుసగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆరు నెలల క్రితం కనకమామిడి రెవెన్యూలోని మ్యాంగోహుడ్ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. తాజాగా గురువారం రాత్రి కనకమామిడి రెవెన్యూ పరిధిలోని హ్యాపీహోంస్లో ఉన్న రాజు ఫాంహౌస్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ఓ వాచ్మెన్, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరాలపై సైతం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేస్తున్నారు. -
లైసెన్స్ లేని ‘మ్యూజిక్’
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం 2022 నుంచి పునఃప్రారంభించిన విధానం ప్రకారం ప్రతి పబ్ కచి్చతంగా అమ్యూజ్మెంట్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఇది లేకపోతే కేవలం ఓ బార్ మాదిరిగా వ్యవహరించాలే తప్ప మ్యూజిక్కు అనుమతి ఉండదు. ఇప్పటికీ సిటీలో అనేక పబ్‌లు ఈ అనుమతి లేకుండానే యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించేస్తున్నాయి. అప్పుడప్పుడు దాడులు చేస్తున్న పోలీసులు సైతం ఓ బెయిలబుల్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. పోలీసు నిబంధనల్ని పట్టించుకోని వారి విషయం ఇలా ఉంటే.. కొందరు పబ్స్ యజమానులు తాము ఈ అమ్యూజ్మెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినా అనుమతి లభించట్లేదని ఆరోపిస్తున్నారు. పదేళ్ల క్రితం నిలిచిపోయిన విధానం.. నగరంలో ఒకప్పుడు పబ్స్‌కు లైసెన్సులు జారీ చేయడంలో పోలీసు విభాగానికీ కీలక పాత్ర ఉండేది. వీళ్లు సైతం క్లియరెన్స్ ఇస్తేనే పబ్ నడిచేందుకు అనుమతి ఉండేది. 2015 నుంచి అమలులోకి వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంతో ఈ పద్ధతికి ఫుల్స్టాప్ పడింది. వ్యాపార సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం కోసమంటూ పబ్స్‌కు పోలీసు లైసెన్స్ విధానాన్ని ప్రభుత్వం అటకెక్కించేసింది. ఫలితంగా కొన్నాళ్లు పరిస్థితులు సజావుగానే ఉన్నా.. ఆపై అసలు సమస్యలు మొదలయ్యాయి. అనేక పబ్స్ ఉల్లంఘనలు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారిపోయాయి. ఈ విషయంపై హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు 2022 నుంచి పాత విధానాన్ని పునరుద్ధరించారు. అధికారిక వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు.. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంటర్టైన్మెంట్, ఎమ్యూజ్మెంట్ లైసెన్సుల జారీకి నగర పోలీసులు 2022 డిసెంబర్ 20 నుంచి శ్రీకారం చుట్టారు. పోలీసుస్టేషన్లు, ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే జారీ చేసే విధానం ప్రారంభించారు. ఈ అవకాశంతో కూడిన నగర పోలీసు వెబ్సైట్ ( ఠీఠీఠీ. జిyఛ్ఛీట్చb్చఛీఞౌ జీఛ్ఛి. జౌఠి. జీn) కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా దరఖాస్తును 15 నిమిషాల్లో సబి్మట్ చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. దీన్ని పరిశీలించే పోలీసు విభాగం కొత్త లైసెన్సును 30 రోజుల్లో, రెన్యువల్‌ను 15 రోజుల్లో పూర్తి చేసేలా సమయాన్ని నిర్దేశించారు. దీనికి ముందు స్థానిక శాంతిభద్రతల విభాగం (ఎల్ అండ్ ఓ), ట్రాఫిక్ డీసీపీలు దరఖాస్తుదారుడు పబ్ ఏర్పాటు చేయనున్న భవనాన్ని పరిశీలించేలా నిబంధనలు రూపొందించారు. పక్కా పరిశీలన తర్వాతే అనుమతి... ఈ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అధికారులు ఆ పబ్ ఉన్న ప్రాంతం, చుట్టుపక్కల వారికి ఏవైనా ఇబ్బందులు కలుగుతాయా? సౌండ్ పొల్యూషన్‌కు ఆస్కారం ఉందా? అవసరమైన స్థాయిలో పార్కింగ్ వసతులు ఉన్నాయా? తదితర అంశాలను పరిశీలిస్తారు. అవసరమైన అన్ని నిబంధనల ప్రకారం ఉంటేనే అమ్యూజ్మెంట్ లైసెన్సు జారీ చేయాల్సిందిగా కోరుతూ నగర కొత్వాల్‌కు సిఫార్సు చేస్తారు. ఈ విధానం కొత్తగా ఏర్పాటు చేయబోయే పబ్స్‌కు మాత్రమే కాదు.. అప్పటికే ఉన్న వాటికీ వర్తింస్తుంది. సరైన పార్కింగ్ వసతి లేని వారిని నిర్ణీత సమయం ఇచ్చి పార్కింగ్ వసతి ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తారు. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ బయటకు రాకుండా చర్యలు తీసుకునేలా చేస్తారు. కేవలం రాత్రి వేళల్లోనే కాకుండా ఏ సమయంలో ఈ పబ్స్‌లో వచ్చే శబ్దాలతో స్థానికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటారు. వాళ్లు తీసుకోరు.. వీళ్లు అడిగినా ఇవ్వరు.. ► ఎమ్యూజ్మెంట్ లైసెన్స్ విధానం పునరుద్ధరించి 14 నెలల దాటుతున్నా.. ఇప్పటికీ నగరంలోని అనేక పబ్స్ ఇది లేకుండా, కేవలం ఎక్సైజ్, జీహెచ్ఎంసీ అధికారులు ఇచి్చన పర్మిషన్లతో నడిపించేస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పబ్‌ల జాబితా రూపొందించి, వాటిలో ఎన్నింటికీ ఈ ఎమ్యూజ్మెంట్ లైసెన్స్ ఉంది? ఎన్ని దరఖాస్తు చేశాయి? ఎన్ని ఈ నిబంధనల్ని పట్టించుకోవట్లేదు? అనే అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ► పోలీసులు మాత్రం అప్పుడప్పుడు దాడులు చేస్తున్నారు. లైసెన్స్ లేదంటూ ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. లైసెన్స్ తీసుకోని వారి విషయం ఇలా ఉంటే.. కొందరు దీన్ని పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసినా.. పోలీసులు పట్టించుకోవట్లేదు. కొత్త లైసెన్సు జారీ 30 రోజుల్లో, రెన్యువల్ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేసేలా గడువు నిర్దేశించుకున్నా ఇది అమలు కావట్లేదు. ఈ విషయం తెలిసిన మిగిలిన పబ్స్ యజమానులూ దరఖాస్తు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. -
టీబీ రోగులకు డ్రోన్ సేవలు
బీబీనగర్ : టీబీ రోగుల కోసం బీబీనగర్ ఎయిమ్స్ ప్రయోగాత్మకంగా చేపట్టిన డ్రోన్ సేవలు విజయవంతమయ్యాయి. టీబీ రోగులు, అనుమానితుల నుంచి రక్త పరీక్షలకు నమునాలు సేకరించి వెనువెంటనే ల్యాబ్‌లకు పంపించడం, తిరిగి అవసరమైన మందులను రోగులకు పంపేందుకు డ్రోన్ సాయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు, తండాలపరిధిలో 150 మంది నమునాలను సేకరించి డ్రోన్ ద్వారా ల్యాబ్‌లకు పంపి.. తిరిగి మందులు చేరవేశారు. ఆదివారం ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్‌భాటియా డ్రోన్ సేవల గురించి వెల్లడించారు.రెండు నెలలుగా డ్రోన్ సేవలపై చేపట్టిన ప్రయోగాలు ఫలించడంతో టీబీ రోగులకు చాలా సులువుగా సేవలు అందుతున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన డ్రోన్ సేవలను ఇటీవల ఎయిమ్స్‌కు వచ్చిన కేంద్రమంత్రి ఆర్కే.సింగ్ పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు అనుసంధానం భువనగిరి, రామన్నపేట, బీబీనగర్ బొమ్మల రామారం మండలాల పరిధిలోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు డ్రోన్లను అనుసంధానం చేశారు. ఇక్కడి నుంచి రోగుల నమునాలను సేకరించి రిమోట్ ద్వారా జిల్లా కేంద్రంలోని క్షయవ్యాధి యూనిట్లకు డ్రోన్ ద్వారా పంపుతారు. తిరిగి అక్కడి నుంచి రోగులకు అవసరమయ్యే టీబీ మందులు, ట్యూబ్‌లు, రియాజెంట్లను డ్రోన్‌లో అమర్చి రోగులకు పంపుతారు. దీని కోసం ప్రస్తుతం ఎయిమ్స్‌లోని 3 డ్రోన్ పైలెట్లు, 2 డ్రోన్లు అందుబాటులో ఉంచారు. రోగుల ఖర్చు తగ్గించేందుకు సహాయపడుతుంది డ్రోన్ సేవల ద్వారా టీబీ నిర్థారణలో ట్యూమరౌండ్ సమయం తగ్గించడం, దూర ప్రాంతాల్లో, రవాణా సరిగ్గా లేని చోట నివసించే వ్యక్తులకు రవాణా ఖర్చులు తగ్గించేలా డ్రోన్ సేవలు సహాయపడతాయి, జిల్లా టీబీ కార్యాలయం నుంచి డ్రోన్ కార్యకలాపాలను పీహెచ్‌సీలతో పాటు సబ్‌సెంటర్లకు సైతం విస్తరిస్తున్నాం. – వికాస్‌భాటియా, డైరెక్టర్, ఎయిమ్స్ -
సర్వం సిద్ధం..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతర కుంభమేళాకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారంలో శ్రీ సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజలు చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, జంపన్నవాగుపై స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి మేడారానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీఓ అంకిత్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఈఓ రాజేంద్రం పాల్గొన్నారు. ఈనెల 14న మండమెలిగె పండుగ మహాజాతర ప్రారంభానికి ఇంకా తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివారం కూడా తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. 14న బుధవారం సమ్మక్క– సారలమ్మ పూజారులు మండమెలిగె పండుగ నిర్వహించనున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్‌గా లచ్చుపటేల్ సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ నియమించింది. చైర్మన్‌గా అరెం లచ్చుపటేల్, కమిటీ సభ్యులుగా మిల్కూరి అయిలయ్య, కోడి గోపాల్, గంగెర్ల రాజారత్నం, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, యాప అశోక్, పోరిక నారాయణ్‌సింగ్, ముంజల భిక్షపతి, సుంచ హైమావతి, చామర్తి కిషోర్, కొరం అబ్బయ్య, ఆలం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం క్రిష్ణస్వామి, ఎక్స్ అఫీషియో మెంబర్‌గా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావును నియమించారు. చైర్మన్‌తో పాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం త్వరలో చేయనున్నట్లు తెలిసింది. -
యాదాద్రి పైకి ఆటోలు
యాదగిరిగుట్ట : రెండేళ్ల తర్వాత యాదాద్రి కొండపైకి ఆటోల రాకపోకలు షురూ అయ్యాయి. యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన జరిగిన 2022 మార్చి 28వ తేదీ నుంచి కొండపైకి ఆటోలు నడపడం నిషేధించారు. దీంతో ఆటోడ్రైవర్లు నిరసనకు దిగారు. మొదటి ఘాట్ రోడ్డులోని యాదరుషి ఆలయం వద్ద వివిధ రూపాల్లో వారు దీక్షలు, ఆందోళనలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పోలీసుల సూచన మేరకు నవంబర్ 2023లో దీక్షలు విరమించారు. అధికారంలోకి వస్తే గుట్టపైకి ఆటోలు నడిచేలా చూస్తామని కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క రెండు, మూడుసార్లు ఆటో డ్రైవర్లు, దేవాలయ, పోలీసు అధికారులతో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చర్చలు జరిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖలతో మాట్లాడి ఆదివారం నుంచి కొండపైకి ఆటోలు నడిచే విధంగా చూశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా ఆటోడ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హనుమంతు కె.జెండగే, డీసీపీ రాజేష్ చంద్ర, ఈఓ రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తిలతో కలిసి జెండా ఊపి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లకు మంచి రోజులు వచ్చాయన్నారు. అనంతరం కలెక్టర్ జెండగే, డీసీసీ రాజేష్ చంద్రా, ఈఓ రామకృష్ణారావులను బీర్ల ఐలయ్య ఆటోలో గుట్టపైకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఏసీపీ శివరాంరెడ్డి, సీఐ రమే‹Ù, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ తదితరులు పాల్గొన్నారు. ఆటోలకు స్టిక్కర్లు.. యాదాద్రి కొండపైకి నడిచే ఆటోలకు ట్రాఫిక్ పోలీసులు, ఆటో కారి్మక యూనియన్ నేతలు సీరియల్ నంబర్, శ్రీస్వామి వారి చిత్రపటంతో కూడిన స్టిక్కర్లు అతింకించారు. ఆటో డ్రైవర్ల డ్రైవింగ్ లైస్సెన్స్, పొల్యూషన్ పత్రాలను పరిశీలించారు. తొలి రోజు అధికారులు చెప్పిన ప్రకారం 100 ఆటోలను కొండపైకి నడిపించారు. -
మే 23న ఎడ్‌సెట్..జూన్ 4,5 తేదీల్లో ఐసెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 4, 5 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేసింది. మార్చి 5న నోటిఫికేషన్, 7నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆలస్య రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://icet. tsche. ac.in ను చూడవచ్చని తెలిపింది. మే 23న ఎడ్‌సెట్ రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షను మే 23న నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. మార్చి 4న నోటిఫికేషన్, మార్చి 6 నుంచి మే 13 వరకూ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించింది. పరీక్ష మే 23న ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ, సాయంత్రం 2 నుంచి 4 గంటల వరకూ ఉంటుందని పేర్కొంది. -
ప్రేమికులూ జరభద్రం!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రేమికులపై ఫోకస్ పెట్టారు. వాలెంటైన్స్ డే దగ్గర పడుతుండడంతో డిస్కౌంట్లు, ఆఫర్లు, సర్ఫ్రైజ్ గిఫ్ట్ లు, గిఫ్ట్ కూపన్లు అంటూ సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఏటా ఈ తరహా మోసాలు షరామామూలే అయినా.. ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్ల బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు తెరతీ స్తున్నారు. మీకు అత్యంత సన్నిహితులు వాలెంటైన్స్ డే సందర్భంగా మీకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ పంపారు.. దాన్ని పొందాలంటే మేం చెప్పిన ఖాతాకు కస్టమ్స్ చార్జి కోసం కొంత మొత్తం పంపండి అంటూ వల వేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రధానంగా చేస్తున్న మోసాలు చూస్తే.. షాపింగ్ ఫ్రాడ్స్..: ఆన్లైన్ షాపింగ్, బెస్ట్ ఆఫర్స్, గిఫ్ట్‌లు, డిన్నర్లు అంటూ సోషల్‌మీడియా ఖాతాల్లో మోసపూరిత యాడ్స్ ఇస్తు న్నారు. ఈ ఆఫర్ల కోసం సంప్రదించే వారి నుంచి వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని మోసం చేస్తున్నారు. ఫిషింగ్ ఈమెయిల్స్.. సైబర్ నేరగాళ్లు వాలెంటైన్స్ డేకు సంబంధించి ప్రత్యేక కొటేషన్లు, మెసేజ్‌లు, ఎమోజీలు, గ్రాఫిక్ వీడియోలు అంటూ ఫిషింగ్ లింక్‌లను ఈమెయిల్స్‌కు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్, ల్యాప్‌టాప్‌లోకి మాల్వేర్ వచ్చేలా చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. ఈ విషయాలు మరవొద్దు..: ► ఆన్లైన్లో వాలెంటైన్స్ డే గిప్ట్‌లు కొనాలంటే నమ్మదగిన ఈ కామర్స్ వెబ్సైట్లనే ఉపయోగించాలి. కొత్త యాప్స్ వినియోగించాల్సి వస్తే వాటి రేటింగ్ తప్పక చూసుకోవాలి. వాలెంటైన్స్ డే ప్యాకేజీలు, గిఫ్ట్‌ల పేరిట నమ్మశక్యం కాని ఆఫర్లు ఉంటే అది సైబర్ మోసగాళ్ల అనుమానాస్పద ప్రకటనగా గుర్తించాలి. ►అనుమానాస్పద మెసేజ్‌లు,ఈ మెయిల్స్‌లోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీ వ్యక్తిగత, బ్యాంకు ఖాతా నంబర్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, పిన్ నంబర్లు, సీవీవీ నంబర్లు ఎవరితోనూ పంచుకోవద్దు. -
నీళ్ల ‘మంటలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య నీళ్ల మంటలు మొదలయ్యాయి. కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణాజలాలు, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల అంశంపై తీవ్ర చర్చ జరుగుతుండగా.. సోమ, మంగళవారాల్లో జరగనున్న పరిణామాలు మరింత వేడిని పెంచుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, పలు ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్లక్ష్యమంటూ బీఆర్ఎస్ను, ఆ పార్టీ ముఖ్యులను కాంగ్రెస్ సర్కారు టార్గెట్ చేసింది. మరోవైపు కాంగ్రెస్ సర్కారు వచ్చిన రెండు నెలల్లోనే రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రానికి, కృష్ణాబోర్డుకు అప్పజెప్పి, ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోందంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ అంశాలపై అసెంబ్లీలో, బయటా ఇరుపార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మొత్తమ్మీద లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఇరు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. నేడు అసెంబ్లీలో చర్చ? ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చించేందుకు అసెంబ్లీ సోమవారం సమావేశం కానుంది. ఈ క్రమంలోనే సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే దిశగా జరిగిన పరిణామాలు, గత పదేళ్లలో సాగునీటి వైఫల్యాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ప్రజా భవన్లో ‘ప్రజెంటేషన్’ మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సాగునీటి ప్రాజెక్టులు, జలాల అంశంపై ఆదివారం ప్రజాభవన్‌లో అవగాహన కల్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్»ొజ్జా, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా.. కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటి లభ్యత, తెలంగాణ వినియోగం, చేపట్టిన ప్రాజెక్టులు, వాటి పురోగతిని వివరించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం జరిగిందని వివరించారు. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. కృష్ణాజలాలపై సోమవారం అసెంబ్లీలో స్పష్టత ఇస్తామని, నల్లగొండలో బీఆర్ఎస్ సభ మొదలయ్యే లోపే తెలంగాణ ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని చెప్పారు. కేసీఆర్ చేసిన అన్యాయంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం నెలకొందని ఆరోపించారు. మేడిగడ్డ సందర్శనకు తీసుకెళ్తామంటూ.. బీఆర్ఎస్ నల్లగొండ సభకు కౌంటర్‌గా కాంగ్రెస్ సర్కారు ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. కాళేశ్వరం అవినీతిపై చర్చను పక్కదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని లేవనెత్తుతోందని ఆరోపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. కాళేశ్వరం అవినీతి అంశంపై క్షేత్రస్థాయిలో చర్చజరిగేలా చూడాలని ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మేడిగడ్డ పర్యటన ఏర్పాటుచేసి.. బ్యారేజీ సందర్శనకు రావాల్సిందిగా అసెంబ్లీలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహా్వనించారు. మంగళవారం (13న) ఉదయం అసెంబ్లీ నుంచే ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకెళతామని చెప్పారు. ఈ సందర్శనకు వచ్చే విషయంలో కాంగ్రెస్, సీపీఐ మినహా ఇతర పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు. తప్పు కప్పిపుచ్చుకునే డ్రామాలు తెలంగాణకు అన్యాయం చేసిన మాజీ సీఎం కేసీఆర్.. తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు సభలంటూ డ్రామాలు ఆడుతున్నారని టీపీసీసీ కిసాన్‌సెల్ మండిపడింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. నల్లగొండ బీఆర్ఎస్ సభకు చురుగ్గా ఏర్పాట్లు కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ.. మంగళవారం నల్లగొండ పట్టణ శివార్లలోని మర్రిగూడ బైపాస్‌రోడ్డు వద్ద సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సభకు హాజరవుతుండటంతో పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం గులాబీదళం ప్రయత్నిస్తోంది. నల్లగొండతోపాటు మహబూబ్‌నగర్, ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తొలిసారి సభలో ప్రసంగించనుండటంతో.. ఆయన ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. కేసీఆర్ క్షమాపణలు చెప్పాకే నల్లగొండకు రావాలి గత పదేళ్లలో జిల్లాలోని ప్రాజెక్టులేవీ పూర్తిచేయలేదు: కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ/ చండూరు: కేసీఆర్ పదేళ్ల పాలనలో నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయకుండా మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. మొదట కేసీఆర్ నల్లగొండ జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాకే నల్లగొండకు రావాలని వ్యాఖ్యానించారు. నల్లగొండలోకి క్యాంపు కార్యాలయంలో వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడా రు. కుర్చీ వేసుకుని కూర్చుని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని.. అది పూర్తయి ఉంటే నల్లగొండ జిల్లాకు ఇలాంటి కరు వు పరిస్థితులు వచ్చేవి కావని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ నిర్వహించే రో జే నల్లగొండ పట్టణంలోని గడి యారం సెంటర్లో కుర్చీ వేసి, దానిమీద గులాబీ కండువా కప్పి, కేసీఆర్ చిత్రం పెట్టి నిరసన తెలుపుతామన్నారు. బీఆర్ఎస్ సభను బహిష్కరించండి: రాజగోపాల్‌రెడ్డి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే కేసీఆర్ నల్లగొండలో సభ పెడుతున్నారని.. ఆ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా చండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు నైతిక విలువలేమైనా ఉంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. కాగా.. కాంగ్రెస్ ముఖ్యుల పిలుపు మేరకు బీఆర్ఎస్ సభకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. -
ఓపెన్ డిగ్రీ, పీజీ అడ్మిషన్లకు నోటిఫికేషన్
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ) కోర్సులు, పీజీ (ఎంఏ/ఎంకాం/ ఎంఎస్సీ) కోర్సులు, బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2023–24 విద్యా సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయినట్లు విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యా ర్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in,www.braou.ac.in లో పొందవచ్చని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఫిబ్రవరి 29 అని, అలాగే రూ. 200ల ఆలస్య రుసుముతో మార్చి 31 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాల కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. అడ్మి షన్/ ట్యూషన్ ఫీజును క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా లేదా టీఎస్/ఏపీ ఆన్లైన్ ఫ్రాంఛైజ్ సెంటర్ల ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. పూర్తి సమాచారం కోసం సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యా లయ హెల్ప్‌డెస్క్ నెంబర్లు 73829 29570/ 580, 040–23680222/333/555లో సంప్రదించవచ్చని సూచించారు. -
గడువు పొడిగించేది లేదు
సాక్షి, హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించేది లేదంటూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఝలక్ ఇచ్చింది. 2024–25 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి డిస్కంల వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతి పాదన లు సమర్పించేందుకు జనవరి 31తో గడువు ముగిసింది. మరో మూడు నెలలు పొడిగించాలని డిస్కంలు చేసిన విజ్ఞప్తిని ఈఆర్సీ తోసిపుచ్చింది. మల్టీ ఈయర్ టారిఫ్(ఎంవైటీ) రెగ్యులేషన్స్ ప్రకారం సత్వరమే ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాలని డిస్కంలకు ఆదేశించింది. ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు గడువులోగా సమర్పించడంలో విఫలమైతే డిస్కంలపై రోజుకు రూ.5000 చొప్పున జరిమానా విధించాలని ఎంవైటీ రెగ్యులేషన్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు ప్రతి ఏటా నవంబర్ 31లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాలి. దాని ఆధారంగా వినియోగదారులకు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాలి? దానికి ఎంత అవుతుంది ? ప్రస్తుత విద్యుత్ టారిఫ్‌తోనే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తే వచ్చే ఆదాయం ఎంత? అవసరమైన ఆదాయం, వచ్చే ఆదాయం మధ్య ఉండే వ్యత్యాసం(ఆదాయ లోటు) ఎంత? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సబ్సిడీలు పోగా, మిగిలే ఆదాయలోటు భర్తీ చేసేందుకు ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంచాలి ? వంటి అంశాలు ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ రాత పూర్వకంగా అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు హైదరాబాద్, వరంగల్‌లో బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ఆ సంవత్సరంలో వసూలు చేయాల్సిన విద్యుత్ టారి ఫ్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వినియోగదారుల కేటగిరీల వారీగా పెరిగిన/తగ్గిన విద్యుత్ చార్జీల పట్టిక ఇందులో ఉంటుంది. గతేడాది నవంబర్ 31లోగా ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉండగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల పేరుతో అప్పట్లో డిస్కంలు డిసెంబర్ 2 వరకు గడువు పొడిగింపు పొందాయి. విద్యుత్ టారీఫ్ ఖరారుకు సంబంధించిన కీలకమైన మార్గదర్శకాలతో మల్టీ ఈయర్ టారిఫ్ రెగ్యులేషన్స్‌ను ఆ తర్వాత కాలంలో ఈఆర్సీ ప్రకటించింది. ఈ కొత్త మార్గదర్శ కాలపై అధ్యయనం జరిపి ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడానికి జనవరి 31వరకు రెండోసారి గడువు పొడిగించింది. డిస్కంల యాజమాన్యాలు తర్జనభర్జన రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారింలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారులను సీఎండీలుగా నియమించింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచడానికి అనుమతించినట్టు తప్పుడు సంకేతాలు పోతాయని ప్రభుత్వవర్గాల్లో ఆందోళన నెలకొని ఉంది. డిస్కంల ఆర్థిక నష్టాలు రూ.50,275 కోట్లకు, అప్పులు రూ.59,132 కోట్లకు పెరిగినట్టు ఇటీవల రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారులు అంటున్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ప్రతిపాదనలు సమర్పించే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. -
‘ఆరు’పై అయోమయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులపై అటు అధికారిక వర్గాల్లో, ఇటు రాష్ట్ర ప్రజానీకంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాము కేటాయించిన నిధులతో ఆరు గ్యారంటీల అమలు జరిగి తీరుతుందని సర్కారు చెబుతోంటే.. మరికొన్ని నిధులు అవసరమని అధికార వర్గాలు లెక్కలు కడుతున్నాయి. మరోవైపు ఎన్నికల సమయంలో, మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను యథాతథంగా అమలు చేయాలంటే.. ఇప్పుడు బడ్జెట్లో పెట్టిన దానికి సుమారు మూడు రెట్లు ఎక్కువగా నిధులు అవసరమనే చర్చ జరుగుతోంది. హామీలను సంపూర్ణంగా అమలు చేయాలంటే ఏటా రూ.1.36 లక్షల కోట్లకుపైనే కావాల్సి ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఆరు గ్యారంటీల అమలు వ్యవహారం అయోమయంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ గ్యారంటీలను పూర్తిస్థాయిలో కాకుండా, కొందరికే పరిమితం చేసినా ఏటా రూ.80 వేలకోట్లకుపైనే అవసరమని అధికార వర్గాలు అంటున్నా.. దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. ఆరు గ్యారంటీల్లో.. 13 పథకాలు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ‘మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, యువ వికాసం ఉన్నాయి. ఈ ఆరు గ్యారంటీల పరిధిలో మొత్తం 13 పథకాలను అమలు చేయాల్సి ఉంది. వీటిని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు భారీ స్థాయిలో నిధులు అవసరం కానున్నాయి. రైతు భరోసా.. గత సర్కారు రాష్ట్రంలోని దాదాపు 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి సుమారు 69లక్షల మంది రైతులకు ఏటా ఎకరానికి రూ.10,000 చొప్పున చెల్లించింది. కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చాక ఎకరాకు రూ.15,000 ఇస్తామని ప్రకటించింది. దీనికి ఏటా సుమారు రూ.22,800 కోట్లు అవసరం. ► రాష్ట్రంలో భూమి లేని కౌలు రైతులు 6.5 లక్షల మంది ఉన్నట్టు అంచనా. వారికి ఏటా రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు ఏటా రూ. 975 కోట్లు కావాలి. ► కాంగ్రెస్ కూలీలకు ఏటా రూ. 12 వేలు ఇస్తామని పేర్కొంది. రాష్ట్రంలో 52లక్షలకుపైగా ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్నా యాక్టివ్‌గా ఉన్న జాబ్‌కార్డులు దాదాపు 32 లక్షల మేర ఉన్నాయి. జాబ్‌కార్డులున్న అందరికీ పథకాన్ని వర్తింపజేస్తే ఏటా రూ.6,240 కోట్లు కావాలి, యాక్టివ్ వారికే ఇస్తే రూ.3,840 కోట్లు అవసరం. ► వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న కోటీ 30లక్షల టన్నుల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటే రూ.6,500 కోట్లు అవసరం. గృహ జ్యోతి.. ప్రస్తుతం రాష్ట్రంలో 200యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న గృహ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 95.23 లక్షలు. ఆ కుటుంబాలు ఏటా దాదాపు 9,022 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నాయి. ఒక్కో యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం సగటున రూ.7గా లెక్కించినా.. ఏటా గృహజ్యోతి అమలు కోసం సుమారు రూ.6,315 కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రంలో సొంతిల్లు లేనిపేదలకు 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అంటే ఏటా నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం కోసం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామన్న హామీ మేరకు.. 20లక్షల ఇళ్లకు మొత్తంగా రూ. లక్ష కోట్లు అవసరం. ఏటా బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అయితే సర్కారు తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. ఏడు వేల కోట్లే కేటాయించింది. చేయూత.. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 43.68 లక్షల మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ప్రస్తుతం ప్రతినెలా దివ్యాంగులకు రూ.4వేలు, ఇతర లబ్ధిదారులకు రూ.2 వేలు ఇస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు, ఇతర పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఏటా 5.5 లక్షల మంది దివ్యాంగుల పింఛన్లకు రూ.3,960 కోట్లు, సుమారు 38 లక్షల ఇతర పింఛన్లకు రూ.18,240 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. యువ వికాసం.. యువ వికాసం పథకంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. విద్యార్థుల ఫీజులు, కోచింగ్ చెల్లింపుల కోసం రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఏటా దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ వంటివి పూర్తి చేసుకుంటున్నారు. వీరికి విద్యా భరోసా కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఇస్తారా? ఎలా సర్దుబాటు చేస్తారు. లోన్లు తీసుకుని ఇస్తే వడ్డీ ఎవరు భరిస్తారన్నది తేలలేదు. మహాలక్ష్మి.. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కలి్పస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు కోటీ 65లక్షల మంది ఉన్నారు. ఇందులో సుమారు 26 లక్షల మంది ఇప్పటికే వితంతు, ఒంటరి, వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు. వారిని మినహాయించినా మిగతా కోటీ 39లక్షల మందికి ప్రతీనెలా రూ.2,500 లెక్కన ఏటా రూ.41,700 కోట్లు కావాల్సి ఉంటుంది. ► రాష్ట్రంలో మొత్తం 70లక్షల మంది మహిళల పేరిట వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్ రూ.500కే ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఏడాదికి పన్నెండు సిలిండర్లు ఇస్తే.. ఏటా రూ.4,200 కోట్లు గ్యాస్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఆరు సిలిండర్లకే పరిమితం చేస్తే రూ.2,100 కోట్లు చెల్లించాలి. ► ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోంది. దీనికోసం ప్రతి నెలా రూ.300 కోట్ల చొప్పున ఏటా ఆర్టీసీకి రూ.3,600 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. -
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలను పరిశీలించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నెల 13వ తేదీన మేడిగడ్డ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ పర్యటనలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రాజెక్టు సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ను ఆహ్వానించే భాద్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 12వ తేదీతో ముగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో ఇరిగేషన్‌పై చర్చ జరగనుంది. విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడనున్నారు. ఈ నెల 13న చేపట్టనున్న మేడిగడ్డ సందర్శనకు అటు.. బీజేపీ నేతలు కూడా సై అంటున్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రాజెక్టును సందర్శిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టులో వరదలు కారణంగా డ్యామేజ్ జరగలేదని మానవ తప్పిదం వల్లే డ్యామేజ్ జరిగిందని విజిలెన్స్ ఇటీవల అంచనాకు వచ్చిన విషయం తెలిసిందే. కాంక్రీట్, స్టీల్ నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్.. ఒకటి నుంచి ఐదో పిల్లర్ వరకు పగుళ్లు ఉన్నట్లు పేర్కొంది. శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటాను విజిలెన్స్ అడిగింది. రెండు మూడు రోజుల్లో విజిలెన్స్ చేతికి శాటిలైట్ డేటా రానుంది. ఇదీ చదవండి: Vote for Crore : ఓటుకు కోట్లు కేసులో సుప్రీం నోటీసులు -
మేడారం జాతర: మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరుగనుంది. ఇక, ఈసారి మేడారం జాతర కోసం భక్తులు ఇప్పటి నుంచే పోటెత్తుతున్నారు. దీంతో, టీఎస్ఆర్టీసీ ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇదే సమయంలో మేడారం జాతరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమలులో ఉంటుందని ఎండీ సజ్జనార్ తెలిపారు. కాగా, తాజాగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ..‘మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఈ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులను ఆపరేట్ చేస్తున్నాం. ఇక, మేడారం జాతరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈనెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించాం. ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నుంచి మేడారం వరకు మొత్తం 228 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఉ. 6.00, 6.30 గంటలకు జేబీఎస్ నుంచి, 7 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. పెద్దలకు రూ. 750 చిన్నారులకు రూ. 450 టిక్కెట్ ధర నిర్ణయించారు. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.00, 2.30, 3.00 గంటలకు బయలుదేరతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఇందులో రానుపోను టిక్కెట్ ఛార్జీ పెద్దలకు రూ.550, చిన్నారులకు రూ.310లు. సూపర్‌లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులను కూడా నడుపుతారు. వీటిల్లో ఉచిత ప్రయాణం లేదు. సూపర్ లగ్జరీలో టిక్కెట్ ధర పెద్దలకు రూ.750, చిన్నారులకు రూ.550, ఏసీ బస్సుల్లో పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750గా నిర్ణయించారు.