Guntur
-
గంగపుత్రులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
గుంటూరు, సాక్షి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అన్ని రంగాల, వర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇచ్చారు. తాజాగా.. మత్స్యకార సంక్షేమం కోసం ఆయన ఏం చేశారనేది వివరిస్తూ.. ప్రపంచ మత్స్యకార దినోత్స శుభాకాంక్షలు తెలియజేశారు.‘‘మన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.. .. వేట నిషేధ సమయంలో దాదాపు 1,23,519 మత్స్యకార కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం. సబ్సిడీపై డీజిల్‌లు అందించాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రులందరికీ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు అని ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన. మత్స్యకారుల సంక్షేమం కోసం మన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వేట నిషేధ స…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2024 -
ముగిసిన YSRCP పార్లమెంటరీ పార్టీ సమావేశం
గుంటూరు, సాక్షి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు. త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. -
మార్కెట్ యార్డులో కొనాలి
ఈ ఏడాది పది ఎకరాల్లో పత్తి సాగు చేశా. పెరిగిన కౌలు, వ్యవసాయ కూలీల ఖర్చులు కలిపి ఎకరానికి రూ.70 వేల నుంచి రూ.80 వేలు ఖర్చు చేశాం. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే ఈ ఏడాది కష్టాలు వచ్చే అవకాశం ఉంది. నిబంధనల పేరిట ఇబ్బంది పెట్టకుండా మద్దతు ధరకు మార్కెట్ యార్డులలో సీసీఐ కొనుగోలు చేయాలి. – బిక్కి శివరామకృష్ణ, రైతు, పాములపాడు నేరుగా కొనుగోలు చేయాలి పత్తి కొనుగోళ్లలో ప్రభుత్వం విధించిన ఆంక్షలు రైతులను ఇరకాటంలో పెడుతున్నాయి. బహిరంగ మార్కెట్లో రూ.5,500 మించి పత్తి ఎవరూ తీసుకోవడం లేదు. నాణ్యమైన పత్తి విక్రయించుకోవాలంటే సవాలక్ష ఆంక్షలు విధించడం మంచిది కాదు. మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. లేదంటే ఈ ఏడాది భారీ నష్టాలు తప్పవు. – చింతల భాస్కరరావు సీపీఐ మండల కార్యదర్శి ● -
నేటి నుంచి జీజీహెచ్‌లో వాహనాలకు గేట్ పాస్
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో ఇతరుల వాహనాల రద్దీని తగ్గించేందుకు గురువారం నుంచి గేట్పాస్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు. సూపరింటెండెంట్‌గా డాక్టర్ యశస్వి రమణ బాధ్యతలు స్వీకరించిన వెంటనే వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించారు. తొలుత సిబ్బంది వాహనాలు మాత్రమే అనుమతించేలా మార్గదర్శకాలు జారీ చేశారు. గేట్ పాస్‌లు లేకపోవడంతో ఇతరులు కూడా లోనికి తీసుకొస్తున్నారు. సిబ్బందితో గొడవ పడుతున్నారు. దీంతో సిబ్బందికి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాల స్టిక్కర్లను గేట్ పాస్ మాదిరిగా అందిస్తున్నారు. సుమారు 2 వేల వాహనాల గేట్‌పాస్‌లను ఆసుపత్రి అధికారులు సిద్ధం చేశారు. వైద్యులకు, నర్సులకు, నాలుగో తరగతి ఉద్యోగులకు, పారా మెడికల్ సిబ్బందికి, శానిటేషన్ వారికి, సెక్యూరిటీ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేర్వేరు రంగుల్లో రూపొందించిన గేట్పాస్ను సిద్ధమయ్యాయి. గేట్పాస్లపై ఆసుపత్రి సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్ల సంతకాలు ఉన్నాయి. సిబ్బంది వివరాలు సైతం దానిపై ముద్రించనున్నారు. ఖాళీ ఆటోలు, రోగుల సహాయకుల వాహనాలు ఉదయం ఆసుపత్రి ఓపీ ప్రారంభ సమయంలో అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఆసుపత్రి ఆవరణం వాహనాలతో నిండిపోతోంది. ట్రాఫిక్ సమస్య బాగా పెరిగింది. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బయోమెట్రిక్ హాజరు వేసేందుకు వైద్యులు, సిబ్బంది వాహనాలు పార్కింగ్ చేయాలన్నా అవస్థలు తప్పడం లేదు. క్యాజువాల్టీ ఎదుట సైతం అంబులెన్సులు నిలిపేందుకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వీటన్నింటికీ పరిష్కారం గేట్పాస్ అని డాక్టర్ యశస్వి రమణ తెలిపారు. విడతల వారీగా అందరికీ గేట్‌పాస్‌లు అందిస్తామని చెప్పారు. -
అమరావతిలో వేదనాదం
అమరావతి: ప్రథమ పంచారామక్షేత్రం అమరావతిలో ఘంటశాల చంద్రమౌళీశర్మ ఆధ్వర్యంలో బుధవారం వేదపాఠశాలను శాస్త్రోక్తంగా ప్రాంరంభించారు. ఉదయం అమరేశ్వరస్వామి గాలిగోపురం నుంచి వేదపాఠశాల వరకు వేద విద్యార్థులు శోభాయాత్ర నిర్వహించారు. తొలుత బ్రహ్మశ్రీ సత్యనారాయణ అవధాని యజ్ఞిశ్రీ పర్యవేక్షణలో గణపతి హోమం, గోపూజ, స్వస్తి పుణ్యాహవాచనం, మండపారాధనలు, వేదపారాయణలు, దుర్గాసప్తశతి పారాయణం, సూర్య నమస్కారాలు, లక్ష్మీగణపతి హోమ సహిత అవహంతిహవనం, రుద్రహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహూతి కార్యక్రమాలతో ప్రారంభోత్సవాలు పూర్తిచేశారు. ఈసందర్భంగా ఘంటశాల చంద్రమౌళీశర్మ మాట్లాడుతూ అమరా వతి వేదపాఠశాలలో వంద మందికిపైగా పేద బ్రాహ్మణ విద్యార్థులకు బోజన, వసతి సౌకర్యాలతో ఉచిత వేద విద్య బోధన, స్మార్త ఆగమ విద్యను అందిస్తామని పేర్కొన్నారు. -
విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌గా వెంకట్రావు
బాపట్ల టౌన్: విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌గా డి. వెంకటరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు జిల్లా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పనిచేస్తున్న ఆయన బదిలీపై బాపట్ల వచ్చారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని పంచాయతీరాజ్ సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు శిక్షణలు ఇచ్చే ప్రాంతీయ శిక్షణ కేంద్రంగా బాపట్ల ఉంటుందని ఆయన తెలిపారు. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతం చేసే దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉన్నతాధికారుల సమన్వయంతో శిక్షణ కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. -
శ్రీశృంగేరీ శారదా పీఠం ఉత్తరాధికారి ఆశీర్వచనం
పెదకాకాని: శ్రీశృంగేరీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతీ మహాస్వామి వీవీఐటీ కళాశాలను సందర్శించారు. కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు తొలుత ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. విజయ యాత్ర మహోత్సవంలో భాగంగా గుంటూరు పర్యటనకు విచ్చేసిన స్వామీజీ మంగళవారం రాత్రి వీవీఐటీ ఆహ్వానం మేరకు కళాశాలను సందర్శించారు. విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. విద్యార్థులంటే దేశ బంగారు భవిష్యత్ అన్నారు. ఆధునిక విద్య అందించడం ద్వారా దేశ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు. మంచి లక్ష్యం ఎంచుకుని సాధించేలా కృషి చేయాలని సూచించారు. దేశం, ధర్మం రెండు కళ్ల వంటివి అన్నారు. వాటిని మనం పరిరక్షించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, సెక్రటరీ బదరీ ప్రసాద్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పంటల బీమా ప్రీమియానికి 15 వరకు గడువు కొరిటెపాడు(గుంటూరు): ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ద్వారా రైతుల నమోదు ప్రక్రియ రబీ 2024–25 పంటల కోసం ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖాధికారి నున్నా వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రబీలో మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర, పప్పు శనగ పంటలు సాగు చేసే రైతులు డిసెంబర్ 15వ తేదీలోపు బీమా ప్రీమియం చెల్లించాలని సూచించారు. మొక్కజొన్న ఎకరాకు ప్రీమియం రూ.114, జొన్నకు రూ.48, మినుముకు రూ.50, పెసరకు రూ.45, పప్పు శనగ ఎకరాకు రూ.70 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. బ్యాంక్‌ల నుంచి రుణం పొందిన రైతులు తమ బ్యాంకుల ద్వారా ఆటోమేటిక్‌గా నమోదై ఉంటారని, రుణం పొందని రైతులు సమీప కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ప్రీమియం చెల్లించి నమోదు చేయించుకోవాలని కోరారు. నమోదు కోసం ఆధార్ కార్డు, సీసీఆర్సీ లేదా లీజు ఒప్పంద పత్రం, పంట, సాగు విస్తీర్ణ సర్టిఫికెట్, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలని సూచించారు. ప్రీమియం చెల్లించిన రైతులు విధిగా ఈ–క్రాప్ నమోదు చేయించుకోవాలని కోరారు.16న విజ్ఞాన్్లో వర్క్‌షాప్ చేబ్రోలు: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్న్ యూనివర్సిటీలో డిసెంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్నేషనల్ వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నట్లు వర్సిటీ వైస్ చాన్సలర్ కల్నల్, ప్రొఫెసర్ పి. నాగభూషణ్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ మాట్లాడుతూ.. ఇన్నోవేషన్న్స్ ఈ–మెషిన్న్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైనన్స్ అండ్ మోడలింగ్ అనే అంశంపై హైబ్రిడ్ మోడ్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాధిపతులు పాల్గొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడు సస్పెన్షన్ గుంటూరు ఎడ్యుకేషన్: తాడికొండ మండలం పొన్నెకల్లులోని డీవీకేఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు వై. రాజారెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గత నెల 24న పాఠశాలకు గైర్హాజరైన 9వ తరగతి విద్యార్థి షేక్ సమీర్ ప్రమాదవశాత్తూ బావిలో పడి మరణించిన ఘటన విదితమే. పాఠశాల చివరి పీరియడ్‌లో గోడ దూకి బయటకు వెళ్లిన తొమ్మిది మంది విద్యార్థులు సమీర్‌తో కలిసి ఈతకు వెళ్లిన సంఘటనలో ప్రధానోపాధ్యాయురాలితోపాటు వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు నిర్లక్ష్య వైఖరే కారణమని ఉప విద్యాశాఖాధికారి నివేదిక సమర్పించారు. దాని ఆధారంగా పీడీని డీఈవో రేణుక సస్పెండ్ చేశారు. హెచ్ఎం జరీనా ముంతాజ్ బేగంపై చర్యల నిమిత్తం ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డికి నివేదిక సమర్పించారు. బెయిల్ పిటిషన్లు డిస్మిస్ నగరంపాలెం: బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్లను బుధవారం జడ్జి డిస్మిస్ చేశారు. గుంటూరు అరండల్‌పేట పీఎస్‌లో అతనిపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ రెండు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను గుంటూరు ఐదో జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి లత డిస్మిస్ చేశారు. -
దాచేపల్లిలో ఉద్రిక్తత
దాచేపల్లి : పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో బుధవారం జరిగిన టిప్పు సుల్తాన్ ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు జెండాలు పట్టుకుని టిప్పు సుల్తాన్ ర్యాలీ చేశారు. కారంపూడి రోడ్డు సెంటర్‌కు ర్యాలీ వస్తున్న క్రమంలో మరో సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు చత్రపతి శివాజీ ఫొటోలు చూపిస్తూ కేకలు వేశారు. దీంతో ఇరువర్గాలు వాగ్వివాదానికి దిగారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఒక వర్గం మరోవర్గంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో పోలీసులు అందరినీ అక్కడి నుంచి పంపించారు. టిప్పు సుల్తాన్ ర్యాలీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెదరగొట్టిన పోలీసులు -
పెదకొండూరులో ఉచిత ఇసుకకు తూట్లు
తాడేపల్లి రూరల్: దుగ్గిరాల మండల పరిధిలోని పెదకొండూరులో కృష్ణానదిలో ఉచిత ఇసుకకు తూట్లు పొడుస్తూ కొంతమంది బుధవారం ఏకంగా జేసీబీల సహాయంతో ట్రాక్టర్లకు లోడింగ్ ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ట్రాక్టర్ యజమానులు వందల మంది పెదకొండూరు ఇసుక రీచ్ వద్ద క్యూ కట్టారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వచ్చి జేసీబీని సీజ్ చేసి, పోలీసులకు అప్పగించారు. అక్కడ ఉన్న ట్రాక్టర్లను గానీ, వాటి యజమానులను గానీ అదుపులోకి తీసుకోలేదు. దీంతో అధికారులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఈ తవ్వకాలు జరిగాయి. అప్పుడు అడ్డుకోవడానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై జేసీబీ యజమాని దౌర్జన్యం చేశాడు. చివరకు అధికారులు బతిమిలాడి జేసీబీపై కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ... ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 43 ప్రకారం ఇసుక తవ్వకాలు నిర్వహించుకోవచ్చని, కృష్ణానది తీరంలో ఎవరికై నా ఇసుక అవసరమైతే వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసి రసీదు పొందవచ్చని చెప్పారు. లేదంటే వీర్లపాలెం, పెదకొండూరు, గొడవర్రు గ్రామాల్లోని సచివాలయాల్లోని డీఏను కలిసి నిర్మాణ సంబంధిత వివరాలు నమోదు చేసి రసీదు పొందవచ్చని తెలిపారు. రసీదు లేకున్నా, అక్రమంగా రవాణా చేసినా చట్ట ప్రకారం పోలీసు కేసు నమోదు చేస్తామని చెప్పారు. ట్రాక్టర్‌కు రూ.10 వేలు, లారీకి రూ.25 వేలు, జేసీబీకి రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీతో తవ్వకాలు వందల సంఖ్యలో వరుస కట్టిన ట్రాక్టర్లు ఎట్టకేలకు స్పందించిన రెవెన్యూ అధికారులు యజమానిని బతిమిలాడి జేసీబీ సీజ్! -
సనాతన వైదిక ధర్మం ఎంతో గొప్పది
నరసరావుపేట ఈస్ట్: దేశంలో అనాదిగా కొనసాగుతున్న హిందూ ధర్మాన్ని సనాతన వైదిక ధర్మంగా గుర్తించాలని శృంగేరీ శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి శ్రీవిదుశేఖర భారతీ స్వామి తెలిపారు. శ్రీవిదుశేఖర స్వామి విజయ యాత్రలో భాగంగా బుధవారం రాత్రి పట్టణంలోని శ్రీశృంగేరీ శంకర మఠానికి చేరుకున్నారు. వేద పండితుల స్వాగత వచనాల మధ్య శంకర మఠానికి విచ్చేసిన స్వామి మఠం ఆవరణలోని శారదాంబ అమ్మవారిని దర్శించుకొని హారతి సమర్పించారు. అలాగే శ్రీశంకర చంద్రమౌళీశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులు పాదుకా పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విదుశేఖర స్వామి అనుగ్రహ భాషణ చేశారు. ప్రస్తుతం మనం పిలుచుకుంటున్న హిందూ ధర్మానికి మరో పేరు సనాతన వైదిక ధర్మమని అభివర్ణించారు. ఇది మన ధర్మం గొప్పతనాన్ని సూచిస్తున్నదని వివరించారు. ప్రపంచం దేని ద్వారా ధరింపబడుతుందో దానిని ధర్మం అంటారని తెలిపారు. ధర్మం, అధర్మం ఈ రెండూ నేడు మనిషిని నడిపిస్తున్నాయని, ఆశా జీవిగా మనిషి అన్నీ తనకు అనుకూలంగా కావాలనుకుంటూ స్వార్థంతో వ్యవహరిస్తాడని తెలిపారు. అయితే ధర్మం ఏదివ్వాలో దానినే అందిస్తుందని తెలిపారు. అనుగ్రహ భాషణ అనంతరం స్వామి రామిరెడ్డిపేటలో కొత్తగా నిర్మించిన వేద విద్యార్థుల వసతి గృహం వేదభారతీ గృహాన్ని ప్రారంభించారు. వేదభారతి వద్దకు చేరుకున్న స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి అక్కడే బస చేశారు. ఈ కార్యక్రమాలలో నరసరావుపేట జమిందార్ కొండలరావు బహదూర్, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్త పాల్గొన్నారు, శ్రీశ్రీ విదుశేఖర భారతీ స్వామి అనుగ్రహ భాషణం పట్టణంలో సాగిన విజయ యాత్ర వేదభారతీ వసతి గృహాన్ని ప్రారంభించిన స్వామి నేటి స్వామి పర్యటన ఇలా.. విదుశేఖర భారతీ స్వామి గురువారం ఉదయం పాతూరులోని శ్రీభీమలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. శ్రీభీమలింగేశ్వరస్వామి నగరోత్సవానికి సిద్ధం చేసిన నూతన దివ్య రథాన్ని ప్రారంభించి పాత శంకర మఠంను సందర్శిస్తారు. అక్కడి నుంచి కోటప్పకొండ చేరుకొని శ్రీత్రికోటేశ్వరస్వామికి పూజలు నిర్వహిస్తారు. కోటప్పకొండ నుంచి మిన్నెకల్లు గ్రామానికి చేరుకొని అక్కడ శ్రీశ్రీభారతీ తీర్థస్వామి పూర్వాశ్రమ మాతృమూర్తి పేరుతో నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభిస్తారు. తిరిగి శంకర మఠం చేరుకొని భక్తుల పూజలు స్వీకరించి సాయంత్రం 4 గంటల సమయంలో తన విజయ యాత్రను కొనసాగిస్తారు. -
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత నెరవేర్చాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యావంతులుగా ఎదిగిన తరువాత ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతలను నెరవేర్చాలని డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. జేకేసీ కళాశాలలో ఆధునికీకరించిన ఆడిటోరియాన్ని బుధవారం కళాశాల పూర్వ విద్యార్థి, డీజీపీ ద్వారకా తిరుమలరావు ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ సమావేశంలో ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థిగా ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన జేకేసీ కళాశాలలో పని చేసిన అధ్యాపకులు ఇక్కడి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దారని అన్నారు. నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1980లో జాగర్లమూడి లక్ష్మయ్యచౌదరి కుమార్తె యార్లగడ్డ ఉమాదేవి ఆ రోజుల్లోనే రూ.రెండు లక్షలు వితరణ చేసిన కారణంగా ఆడిటోరియానికి ఆయన పేరు పెట్టామని చెప్పారు. ప్రస్తుతం 460 మంది కూర్చునే విధంగా అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఆడిటోరియం సిద్ధం చేసినట్లు చెప్పారు. పూర్వ విద్యార్థులు తమవంతు సహాయ, సహకారాలను అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఏపీ సాంకేతిక సేవల సంస్థ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, కాకినాడ సీపోర్ట్ చైర్మన్ కేవీ రావు, యార్లగడ్డ ఉమాదేవి, కళాశాల కరస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్, ప్రిన్సిపాల్ పి.గోపీచంద్, పీజీ కోర్సుల డైరెక్టర్ ఎస్ఆర్కే ప్రసాద్, పూర్వ విద్యార్థులు చుక్కపల్లి రమేష్, పి. నాగసుశీల పాల్గొన్నారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు -
No Headline
పత్తిని టిక్కీలలోకి మారుస్తున్న దృశ్యంసాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో 54,640 ఎకరాల్లో పత్తి పంట వేశారు. ఇది సాధారణ విస్తీర్ణం కన్నా తక్కువే. అయినా రైతులకు గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. జిల్లాలో మొత్తం 15 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, మేడికొండూరు, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలో ఇవి ఉన్నాయి. నిబంధనల పేరు చెప్పి... పత్తి క్వింటాలుకు మద్దతు ధర రూ.7,521గా ప్రకటించారు. సీసీఐ దానికి కొన్ని షరతులు జోడించింది. తేమ 12 శాతంలోపు, పింజ పొడవు 29.5 – 30.5 మి.మీ., మైక్రోనీర్ విలువ 3.6 – 4.3 మధ్య ఉంటేనే మద్దతు ధర ఇస్తామని ప్రకటించింది. తేమ శాతం, పింజ పొడవు ఏ మాత్రం అటు ఇటు అయినా ధరలో కోత వేసేస్తున్నారు. అన్ని బాగున్నా ఏదో ఒక సాకు పెట్టి రూ.7 వేలకు మించి ఇవ్వడం లేదు. ఇక తేమ 12 శాతం దాటితే కొనకుండా ఇబ్బంది పెడుతున్నారు. మిల్లుకు తీసుకెళ్లినా విక్రయించలేని పరిస్థితిలో దళారులు, ప్రయివేటు వ్యాపారులు రంగం ప్రవేశం చేస్తున్నారు. వారు అడిగిన ధరకు రైతులు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ. 5 వేల – రూ. 6 వేలలోపే చెల్లిస్తున్నారు. ఈ ఏడాది పత్తి నాణ్యమైన దిగుబడి వచ్చినా అందుబాటులో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతోంది. పత్తి నిల్వ చేసుకుంటే రంగు మారి ధరలు మరింత తక్కువ ధర వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. నవంబర్ నెల చివర కావడంతో మంచు కురుస్తోంది. దీనివల్ల పత్తిలో తేమశాతం పెరగడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. మరిన్ని ఆటంకాలు రైతులు తమ పంటను ఈ – క్రాప్ బుకింగ్, ఈ – పంట నమోదు ప్రక్రియ చేయడంతోపాటు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం అందజేయాలి. అమ్మకాల కోసం రైతులు, కౌలు రైతులు తప్పనిసరిగా రావాల్సి ఉంటుందని నిబంధన పెట్టారు. ఇవన్నీ రైతులకు ఇబ్బందికరంగా మారాయి. కొనుగోలు కేంద్రాలను మార్కెట్ యార్డులో కాకుండా మారుమూల ఉన్న మిల్లుల వద్ద ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వ్యవసాయ పనులు మానుకొని పంట విక్రయించేందుకు రైతులు రెండు రోజులు వెచ్చించాల్సి వస్తోంది. నిబంధనల పేరుతో మద్దతు ధర ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చాలామంది గ్రామాల్లోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలకు బయ్యర్లు వచ్చి కొనుగోలు చేసేవారు. ఒకరోజు పంటను కొనుగోలు చేయలేకపోయినా మరునాడు వెసులుబాటు ఉండేది. ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్లి పత్తి విక్రయించడం ఇబ్బందికరంగా మారింది. అక్కడ వసతులు లేక రాత్రిళ్లు బస చేయాలన్నా, పంటకు కాపలా కాయాలన్నా రైతులకు కుదిరే పని కాదు. గతంలో సీసీఐ కొనుగోళ్లకు వచ్చే రైతులకు మార్కెట్ యార్డులో తాగునీరు, రెస్ట్ తీసుకునేందుకు బస వసతి ఏర్పాటు చేసేది. పత్తి మిల్లుల్లో ఆ పరిస్థితి లేదు. కనీసం పట్టించుకునే నాథుడు లేడని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులు కుమ్మక్కు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. తాడికొండ మండలంలోని పత్తి రైతులకు ప్రత్తిపాడు మండలంలోని కోయపాలెంలోని జిన్నింగ్ మిల్లును కొనుగోలు కేంద్రంగా నిర్ణయించారు. ఇక్కడికి తీసుకువెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంది. క్వింటాలుకు రూ. 400 – రూ. 500 అద్దె చెల్లించాల్సి వస్తోంది. -
కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టనిదే ఏ పని జరగడం లేదు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఎక్కడా చూసినా మాఫియా ముఠాలే కనిపిస్తున్నాయని.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక స్కామ్‌లే కనిపిస్తున్నాయి.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు కప్పం కట్టనిదే ఏ పని జరగడం లేదు. ఈ ప్రభుత్వంలో దోచుకోవడం.. పంచుకోవడమే.’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. కొత్త మద్యం బ్రాండ్లు తెచ్చి దండుకుంటున్నారు.. క్వాలిటీ తగ్గించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘మా హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. స్కామ్‌ల కోసం ఈరోజు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు అమ్మేయడం సంపద సృష్టా? సంపద సృష్టిస్తానని.. కరెంట్ బిల్లులు బాదుడే బాదుడు. కరెంటు బిల్లులు బాదుడే రూ.18 వేల కోట్లు. ట్రూ అఫ్ఛార్జీల పేరుతో చంద్రబాబు బాదుడే బాదుడు. సంపద సృష్టి పేరుతో రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. రోడ్ల నిర్మాణంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో రోడ్ల నిర్మాణం కోసం 43 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. పోర్టులు నిర్మిస్తేనే రాష్ట్రానికి సంపద సృష్టి అవుతుంది. గ్రామీణ రోడ్లపై టోల్ వసూలు చేయడం సంపద సృష్టి అవుతుందా?. అన్ని విషయాల్లో అబద్ధాలు చెప్పిచంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అసైన్డ్ భూములపై అసెంబ్లీలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్లపై కూడా తప్పుడు ప్రచారం చేశారు. దళితుల వద్ద నుంచి పెత్తందారులు అసైన్డ్ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.2.06 లక్షల ఎకరాలను ఉద్దేశపూర్వకంగా 22ఏలో పెట్టారు. 98 వేల రైతులను నిషేధిత జాబితాలో పెట్టారు. మా హయాంలో 15 లక్షల మంది పేదలకు మంచి చేశాం. అసైన్డ్ భూములపై పేదలకు సర్వహక్కులు కల్పించాం. మరో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్య పరిష్కరించాం. 1.07 లక్షల మంది రైతుల సమస్య పరిష్కరించాం. బాబు హయాంలో పేదలకు సెంటు స్థలం ఇచ్చారా?. మా హయాంలో 30.60 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాం. 9 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు నిర్మాణాల్లో ఉన్నాయి. 17 వేల జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాం. ఇళ్లు కాదు.. ఊళ్లే నిర్మాణంలో ఉన్నాయి. ఈ రోజు ఇళ్ల నిర్మాణాలనే ఆపేశారు. పేదలంతా చంద్రబాబును తిట్టుకుంటున్నారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
బాబు మోసాలు.. మేనిఫెస్టో పేరుతో మాయా పుస్తకం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: బడ్జెట్ చూస్తే బాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తుందని.. హామీలు ఎగొట్టడానికి బాబు అబద్ధాలకు రెక్కలు కట్టారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అన్నీ వక్రీకరించి అబద్ధాలు చెబుతున్నారన్నారు. బాబు హయాంలో కన్నా వైఎస్సార్సీపీ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. జాతీయ సగటు కన్నా ఏపీ సగటు వృద్ధి ఎక్కువగా ఉంది. లేని అప్పులు ఉన్నట్టుగా అబద్ధాలకు రెక్కలు కట్టి తప్పుడు ప్రచారం చేశారు. మేనిఫెస్టో పేరుతో మాయా పుస్తకం తెచ్చారు.’’ అంటూ చంద్రబాబును వైఎస్ జగన్ దుయ్యబట్టారు.దీపం పథకంపై అసెంబ్లీలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పే మాటలకు పొంతన ఉండటం లేదు. దీపం పథకంపై అసెంబ్లీలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పే మాటలకు పొంతన ఉండటం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా లక్షా 30వేలు ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసీలో 50 వేల ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. 2.66 లక్షల వలంటీర్ల నియామకాలు చేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2.66 లక్షల వలంటీర్ల ఉద్యోగాలు పీకేశారు.’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఆరోగ్యశ్రీ చికిత్సలు పరిమితి 25 లక్షలకు పెంచాం. 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని 108 ఉద్యోగాలు ధర్నాలు చేస్తున్నారు. ఆరు నెలల నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు.’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. -
బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అబద్ధాలనే నిజాలుగా నమ్మించే యత్నానికి తెరలేపిన చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి మోసాలు, అరాచకాలను నిలదీశారు. చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని.. ఆయనలో ఎప్పటికీ మార్పు ఉండదన్నారు.‘‘సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. హామీలు అమలు చేయలేకే చంద్రబాబు బడ్జెట్ ఆలస్యం చేశారు. బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్న అప్పులు చూపించక తప్పదు. 2018-19 నాటికి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పు. వాస్తవాలు ఏమిటో బాబు పెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నారు.. కాగ్ రిపోర్ట్‌పై కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. రూ.14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా గ్లోబెల్ ప్రచారం చేసింది. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా?. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ఆయనను బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు?’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ’’బాబు దిగిపోయే నాటికి రూ.42,183 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీకి రూ.680 కోట్లు బకాయిలు పెట్టారు. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి చంద్రబాబు అప్పులు చేశారు. రూ. 28,457 కోట్లు పరిమితికి మించి బాబు అప్పు చేశారు. ఎవరు ఆర్థిక విధ్వంకారులో ఈ లెక్కలే సాక్ష్యం. చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే. మా హయాంలో 15 శాతం మాత్రమే పెరిగాయి. చంద్రబాబు కంటే వైఎస్సార్సీపీ హయాంలో 4 శాతం అప్పులు తక్కువగా ఉన్నాయి. చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేశారు.’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.‘‘బాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 22.63 శాతం. మా హయాంలో 13.57 శాతం మాత్రమే. మా హయాంలో కోవిడ్ రాష్ట్రాన్ని పీడించింది. దేశ వృద్ధి రేటు కూడా 9.28 శాతానికి తగ్గిపోలేదా? మా హయాంలో పారిశ్రామిక వృద్ధి రేటు 12.61 శాతం పెరిగింది. బాబు హయాంలో 11.92 శాతం మాత్రమే పారిశ్రామిక వృద్ధి రేటు. బాబు హయాంలో ఎంఎస్ఎంఈల ద్వారా 8 లక్షల ఉద్యోగాలు ఇస్తే మా హయాంలో 32 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం’’ అని వైఎస్ జగన్ వివరించారు.ఇదీ చదవండి: అభివృద్ధిపైనా అబద్ధాలేఅప్పులపై అదే దుష్ప్రచారం:బడ్జెట్ పేజీ నెం.14. 16 రెండు పేజీలు చూస్తే.. రాష్ట్ర అప్పులు 2018–19 నాటికి రూ.2.57 లక్షల కోట్లు అని చూపారు. దానికి గవర్నమెంట్ గ్యారెంటీ రూ.55 వేల కోట్లు కూడా కలిపితే అప్పటికి రాష్ట్ర అప్పు మొత్తం రూ.3.13 లక్షల కోట్లు. అలాగే 2024లో వైయస్సార్సీపీ దిగిపోయే నాటికి ఉన్న అప్పులను అదే పేజీలో చూపారు. అప్పులు రూ.4.91 లక్షల కోట్లకు ఎగబాయాయని, గవర్నమెంట్ గ్యారెంటీ అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు, రెండూ కలిపితే మొత్తం అప్పు 6.46 లక్షల కోట్లు అని తేల్చారు. అది బడ్జెట్లోనే కాకుండా, 2023–24లో కాగ్ రిపోర్ట్ (పేజీ నెం.18. 20)లో చూపారు. అందుకే మరోసారి చంద్రబాబును అడుగుతున్నాను. అయ్యా, అబద్ధాల చెప్పడం ధర్మమేనా? రూ.10 లక్షల కోట్లు, రూ.12 లక్షల కోట్లు.. చివరకు ఎన్నికల నాటికి రూ.14 లక్షల కోట్లు అని చెప్పడం ధర్మమేనా? చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా అదే దుష్ప్రచారం చేస్తూ. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ (వ్యవస్థీకృత నేరం) చేశారు.అది తప్పైతే అసెంబ్లీలో ఎందుకు పెట్టారు?:చంద్రబాబు తన గుండెల మీద చేయి వేసుకుని, ప్రజలకు చెప్పాలి. అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. అధికార యంత్రాంగమంతా ఆయన చేతుల్లోనే ఉంది. తన చేతుల్లో ఉన్న అధికారులతోనే బడ్జెట్ తయారు చేయించి, సభలో ప్రవేశపెట్టారు. అందులోని అధికారిక లెక్కలను కాగ్ కూడా ధృవీకరించింది. ఆ తర్వాత కూడా నీ హయాంలో, నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన నీ బడ్జెట్, నీ లెక్కలను కాగ్ ధృవీకరించిన తర్వాత, సభలో పెట్టిన తర్వాత కూడా.. ఈ అప్పుల గురించి, మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే.. ఇక అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టారు?. చెప్పే అబద్ధాలకు ఒకటే బొంకు. అందుకే బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు?మీరు రూ.42 వేల కోట్లు ఎగ్గొట్టి పోయారు: స్పిల్ ఓవర్ అక్కౌంట్స్ మీద కూడా అదే దుష్ప్రచారం. అవి ఏటా ఉంటాయి. ప్రతి బడ్జెట్ నుంచి, మరో బడ్జెట్‌కు స్పిల్ ఓవర్ బిల్స్ ఉంటాయి. అలా 2019లో చంద్రబాబు దిగిపోతూ మాకు పెట్టిపోయిన బిల్లులు ఏకంగా రూ.42,183 కోట్లు. బహుషా ఏ ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో గిఫ్ట్‌లు ఇవ్వదు. అయినా మేము చిరునవ్వుతో చెల్లించాం.బాబు హయాంలో పరిమితికి మించి అప్పు: 2014–19 మధ్య ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రూ.28,457 కోట్లు ఎక్కువ అప్పు చేశారు. అది కాగ్ నివేదికలోనే ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ నివేదికలో కూడా ఉంది. ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో అప్పులపై కోత పడింది. ఆ విధంగా చూస్తే.. మా హయాంలో చేసిన ఎక్కువ అప్పు కేవలం రూ.1647 కోట్లు మాత్రమే. మరి ఎవరు ఆర్థిక వి«ధ్వంసకారుడు. ఎవరు క్రమశిక్షణతో నడిచారు అన్నది ఈ డేటా చూస్తే అర్థమవుతుంది.ఎవరి హయాంలో ఎంతెంత అప్పు?:చంద్రబాబు హయాంలో కోవిడ్ వంటి మహమ్మారి లేదు. అదే మా హయాంలో రెండేళ్లు ఆ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా చూస్తే.. – చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్ల అప్పు ఉండగా, 2019 నాటికి అది రూ.3.13 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే అప్పులు ఏటా సగటున 19.54 శాతం పెరిగాయి. అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లు కాగా, ఆ పెరుగుదల (సీఏజీఆర్) 15.61 శాతం మాత్రమే. అంటే చంద్రబాబు హయాంలో కంటే మా హయాంలో 4 శాతం తక్కువ. అలాగే నాన్ గ్యారెంటీ అప్పులు కలిపి చూసినా, చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8600 కోట్లు ఉంటే, 2019 నాటికి అవి రూ.77వేల కోట్లకు చేరాయి. అదే మా హయాంలో ఆ అప్పులను రూ.2 వేల కోట్లు తగ్గించాం. అంటే మేము దిగిపోయేనాటికి నాన్ గ్యారెంటీ అప్పులు రూ.75వేల కోట్లు. ఆ మేరకు చంద్రబాబు హయాంలో నాన్ గ్యారెంటీ అప్పులు 54.98 శాతం పెరిగితే, మా హయాంలో అది –0.48 శాతం.వృద్ధిరేటుపై అసెంబ్లీ చంద్రబాబు:తన హయాంలో 2014–19 మధ్య రాష్ట్ర వృద్ధి రేటు 13.5 శాతం ఉంటే, అది 2019–24 మధ్య మా హయాంలో 10.6 శాతానికి పడిపోయిందని చెప్పారు. అయ్యా, చంద్రబాబు నీ హయాంలో కోవిడ్ లేదు. ఆ టైమ్‌లో దేశ వృద్ధి రేట్ చూస్తే.. కోవిడ్ వల్ల, దానికి ముందు 5 ఏళ్లతో పోల్చి చూస్తే.. అన్ని రాష్ట్రాల్లో అది తగ్గింది. అలాగే దేశంలో కూడా చూస్తే.. 10.97 శాతం నుంచి 9.82 శాతానికి వృద్ధిరేటు తగ్గింది.ఇతర రంగాల్లో గణనీయ పురోగతి: 2019–24 మధ్య వృద్ధి రేటు మందగించినా.. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు చూస్తే.. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో అది సగటున 11.92 శాతం ఉంటే, 2019–24 మధ్య అది 12.61 శాతం నమోదైంది. అది సోషియో ఎకనామిక్స్ రిపోర్ట్‌లోనే ఇది స్పష్టంగా ఉంది. 2018–19 నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో జీవీఏ 1,88,601 కోట్లు అయితే, 2023–24 లో అది రూ.3,41,485 కోట్లు. అలాగే పారిశ్రామిక ఉత్పత్తి విలువలో 2014–19 మధ్య దేశంలో రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, మన హయాంలో 2023–24 నాటికి 8వ స్థానానికి వచ్చాం. అదే సమయంలో జీవీఏ పోల్చి చూస్తే, ఏపీ ఉత్పత్తి విలువ 12.6 శాతం ఉంటే, దేశ సగటు అది 8.17 శాతమే. అంటే 4 శాతం ఎక్కువ.ఉద్యోగావకాశాలు, తలసరి ఆదాయాల పోలిక:ఎంఎస్ఎంఈ సెక్టర్లో చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య కేవలం 8,67,537 ఉద్యోగావకాశాలు వస్తే.. 2019–24 మధ్య 32,79,770 ఉద్యోగావకాశాలు వచ్చాయి. అలాగే భారీ, అతిభారీ పరిశ్రమల రంగం ద్వారా మా హయాంలో గణనీయమైన వృద్ధిరేటు నమోదైంది. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం. చంద్రబాబు హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.154,031 కాగా, మా హయాంలో అది రూ.2,42,470. చంద్రబాబు హయాంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే, మా హయాంలో 15వ స్థానానికి ఎదిగింది. వాస్తవాలు ఇలా ఉంటే, తన హయాంలో కంటే, వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జీడీపీ పడిపోయిందని మాత్రమే చెబుతాడు. మిగిలిన అన్ని రంగాలు చాలా బాగున్నాయని చెప్పడు. తన హయాంలో కోవిడ్ లేదని చెప్పడు. పెరిగిన ఉద్యోగావకాశాలు పెరిగాయని చెప్పడు.సూపర్‌సిక్స్ అమలు లేదు:సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయడం లేదు. దాంట్లో చాలా చిన్న అంశం గ్యాస్ సిలిండర్ పంపిణీ. అందులో పెద్దవి ఏమిటంటే.. చిన్నపిల్లలకు నీకు రూ.15 వేలు అని, వాళ్ల అమ్మ కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లో అత్త కనిపిస్తే నీకు రూ.48 వేలు.. సంతోషమా? ఇంట్లో పిల్లాడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, రైతు కనబడితే నీకు రూ.20 వేలు అనేవారు. అవన్నీ పెద్దవి. అందులో మోసం చేశారనుకుంటే.. చిన్నవైనా గ్యాస్ సిలిండర్లు. మహిళలకు ఉచిత బస్సు. సిలిండర్లపై ఒక్కొ క్కరు ఒక్కోమాట. రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు 1.55 కోట్లు. ఆయిల్ కంపెనీల డేటా ఇది. ఆ లెక్కన ఒక్కోటి రూ.895. ఏటా మూడు సిలిండర్లు. మొత్తం కలిపితే రూ.4200 కోట్లు. బడ్జెట్లో పెట్టింది రూ.895 కోట్లు. అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వరు. ఒక సిలిండర్ ఇవ్వాలన్నా రూ.1400 కోట్లు కావాలి. కానీ ఆ కేటాయింపు లేదు. అది దారుణ మోసం. -
‘లోకేష్ రెడ్‌బుక్‌లో స్వామీజీలు కూడా ఉన్నారా?’
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి నేతల రెడ్‌బుక్‌లో స్వామీజీలు, భక్తులు కూడా ఉన్నారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీటీడీ తీసుకున్న నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని కామెంట్స్ చేశారు. అలాగే, కక్షలు, కార్పణ్యాలతో చంద్రబాబు, లోకేష్ కళ్ళు మూసుకుపోయాయని మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి. అసలు బోర్డు ఏర్పాటు రాజకీయ ప్రేరేపితంగా జరిగింది. టీడీపీకి వెట్టిచాకిరి చేశాడు కాబట్టే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్‌గా నియమించారు. టీడీపీ ఏది చెబితే అది తన టీవీలో వేసి గందరగోళం సృష్టించి సర్వశక్తులు ఉపయోగించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేశారు. దానికి ప్రతిఫలంగా, దక్షిణగా చంద్రబాబు.. బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చాడు.తాజాగా బోర్డు రెండు నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేయడం దారుణం. శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.. విచారణ జరిపించారు. కానీ విచారణలో ఏమీ జరగలేదని తేలింది. వైఎస్ జగన్ హయాంలోనే శ్రీవాణి ట్రస్ట్ రూపకల్పన జరిగింది కాబట్టి కక్ష కట్టి ట్రస్ట్‌ను రద్దు చేశారు. శారదా పీఠం స్వరూపానంద స్వామిపై చంద్రబాబు నాయుడు, లోకేష్ కక్ష కట్టారు. స్వరూపానంద స్వామి ధర్మ ప్రచారం చేసే వ్యక్తి.వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొండపైన స్వరూపానందకు కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు రద్దు చేశారు. స్వరూపానంద స్వామి పైన ప్రభుత్వానికి ఎందుకంత కక్ష?. మీ రెడ్‌బుక్‌లో స్వామీజీలు, భక్తులు కూడా ఉన్నారా?. సనాతన ధర్మాన్ని కాపాడే స్వామీజీపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్న చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్ పునరాలోచించుకోవాలి అని కామెంట్స్ చేశారు. -
‘పాలన చేతకాదా చంద్రబాబూ?’.. మీడియా ముందు నిలదీయనున్న వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: నిత్య అబద్ధాలు.. పాలనలోనూ గారడీ చేస్తున్న కూటమి సర్కార్‌ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ నిలదీయనున్నారు. కాసేపట్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ద్వారా మాట్లాడనున్నారుఏపీలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచక పాలన మొదలుపెట్టింది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. ఒకవైపు వైఎస్సార్సీపీపై ప్రతీకార రాజకీయాలు కొనసాగిస్తూనే.. మరోవైపు కీలక హామీల విషయంలో ప్రజలను మోసం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐదు నెలలు గడిచినప్పటికీ ఎన్నికల హామీల్లోని ఏ ఒక్క పథకం అమలు చేయకపోగా.. జగన్ పాలనలో సమర్థవంతంగా సాగిన వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ పోతోంది.రైతులు, విద్యార్థులు, ఆడపడుచులు.. ఇలా అన్నివర్గాలు బాబు సర్కార్ చేతిలో మోసపోతున్నారు. జగన్ హయాంలోని సంక్షేమ లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గిస్తూ వస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. గత వైఎస్సార్సీపీ పాలనపై అడ్డగోలుగా ఆరోపణలు గుప్పిస్తూ కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తోంది. వీటన్నింటిని తోడు.. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ కూటమి ప్రభుత్వ కుట్రల పర్వం కొనసాగుతోంది.కనీసం అసెంబ్లీలో అయినా గళం వినిపించే అవకాశం లేకపోవడంతో మీడియా చంద్రబాబు సర్కార్‌ను నిలదీస్తున్నారు వైఎస్ జగన్. గత సమావేశంలో బడ్జెట్ లెక్కలను తీసి మరీ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడి.. చంద్రబాబు సర్కార్‌కు పలు ప్రశ్నాస్త్రాలు సంధించే అవకాశం ఉంది. 🚨 #Breaking Former Chief Minister, YSRCP Chief Sri @ysjagan Garu will address an important press conference tomorrow.📍Central Office, Tadepalli 🕒3:00 PM#StayTuned ❗ pic.twitter.com/OifvvJLAP5— YSR Congress Party (@YSRCParty) November 19, 2024 ఇదీ చదవండి: బూచిగా అప్పుల భూతం.. సూపర్ సిక్స్‌కు ఎగనామంఇదీ చదవండి: అభివృద్ధిపైనా అబద్ధాలే -
చిన్న వయసులోనే సన్యాస దీక్ష...
జగద్గురు శ్రీభారతీ తీర్థ స్వామి చేతులమీదుగా సన్యాస దీక్ష స్వీకరణ విద్యార్జనలో అసాధారణ ప్రజ్ఞ చూపిన వెంకటేశ్వర ప్రసాద శర్మకు అరుదైన గౌరవం లభించింది. 2019 జనవరి 22, 23వ తేదీల్లో శృంగేరీలోని తుంగానదీ తీరంలో శారదాదేవి ఆలయ సమక్షంలో యోగ పట్టాను, సన్యాస దీక్షను శ్రీభారతీ తీర్థ మహాస్వామి చేతుల మీదుగా స్వీకరించారు. శ్రీవిదుశేఖర భారతీస్వామిగా నామకరణం చేసి, తదుపరి 37వ జగద్గురుగా నిర్ణయించి ఉత్తరాధికారిగా నియమించారు. పీఠం చరిత్రలో ఈ పదవిలో నియమితులైన పిన్న వయస్కుల్లో వీరిని రెండో వారుగా చెబుతారు. పీఠం నియమాల ప్రకారం శ్రీభారతీ తీర్థ మహాస్వామి ఆదేశాలతో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా దక్షిణ భారతదేశ శోభాయాత్రలో పాల్గొన్నారు. అతి చిన్నవయసులోనే దక్షిణ భారతదేశంలో పూర్తిగా సంచరించి, ప్రజలకు స్వధర్మ ఆచరణ వైశిష్ట్యాన్ని వివరిస్తూ, ధర్మాచరణ ఆవశ్యకతను బోధించారు. శోభాయాత్రలో భాగంగా నాడు తెనాలినీ సందర్శించారు. మళ్లీ ఇప్పుడు ధర్మ ప్రచారంలో భాగంగా రాష్ట్ర పర్యటను విచ్చేసిన భారతీస్వామి ఉమ్మడి గుంటూరు జిల్లాకు వస్తున్నారు. -
విజయ యాత్రకు గుంటూరులో ఏర్పాట్లు
నగరంపాలెం: శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి శ్రీవిదుశేఖర భారతీ స్వామి గుంటూరు నగరంలో ఈ నెల 22, 23వ తేదీల్లో పర్యటించనున్నట్లు శృంగేరి శంకర మఠం శ్రీశారద పరమేశ్వరి దేవస్థానం ఆలయ వేద పండితులు నాగరాజశర్మ, విష్ణుభట్ల ఆంజనేయ చయనులు, గుంటూరు మండల వేద ప్రవర్ధక విద్వత్పరీక్ష సభ అధ్యక్షులు గబ్బిట శివ రామకృష్ణప్రసాద్లు తెలిపారు. 21న నరసరావు పేట నుంచి గుంటూరుకు స్వామి చేరుకుంటారని చెప్పారు. సంపత్‌నగర్‌లోని దేవస్థానంలో మంగళవారం విలేకరులతో వారు మాట్లాడారు. చతుర్వేదహవనాలు, వేద సభలు, నవ చండీయాగం నిర్వహిస్తారని తెలిపారు. ఆలయ తరఫున పోలిశెట్టి నాగసుందరం మాట్లాడుతూ.. పూర్ణకుంభ స్వాగతంతో ఆర్.అగ్రహారం శ్రీవెంకటేశ్వరస్వామి వారి దేవస్థానం నుంచి సంపత్‌నగర్‌లోని దేవస్థానం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామి వారి అమృత హస్తాలతో శ్రీశారద చంద్రమౌళీశ్వరుల పూజా కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా సంబంధిత పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
ఐ–టీడీపీపై చర్యలు తీసుకోవాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సోషల్ మీడియాలో అసభ్యంగా ఎవరు పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెట్టిన పోస్ట్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మంగళవారం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, జిల్లా స్థాయి నాయకులతో కలిసి అంబటి రాంబాబు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా, తాడికొండ ఇన్చార్జి డైమండ్ బాబు, మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, లీగల్ సెల్ నాయకులు బ్రహ్మారెడ్డి, పోలూరి వెంకటరెడ్డి, మొండితోక శ్రీనివాస్, రమణారెడ్డిలు ఐదు ఫిర్యాదులు చేశారు. అనంతరం స్టేషన్ బయట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ... వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పెట్టిన పోస్టులకు సంబంధించి తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం ఐ–టీడీపీపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఐదు ఫిర్యాదులు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకు వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రి వేళ తీసుకెళ్లి రెండు మూడు రోజులపాటు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై ఐ–టీడీపీ పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశామన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సవాల్ విసిరారు. మాజీ మంత్రి విడదల రజినీపై ఐ–టీడీపీ వారు చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని తెలిపారు. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు భయపడాల్సిన పని లేదన్నారు. పార్టీ అండగా ఉంటుందని, లీగల్ సెల్ రక్షణ కవచంగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ వలి, కార్పొరేటర్లు రోషన్, మహమూద్, బూసి రాజలత, మల్లవరపు రమ్య, దూపాటి వంశీ, అంబేద్కర్, ఆచారి, కోఆప్షన్ సభ్యుడు పూనూరు నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ తుమ్మెటి శ్రీను, పార్టీ నాయకులు నూనె ఉమామహేశ్వరరెడ్డి, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు కరువు గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్పొరేటర్లు, జిల్లా, నగర స్థాయి నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ పెట్టిన పోస్టుకు సంబంధించి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. ఐ–టీడీపీలో సబ్జా అజయ్, స్వాతి రెడ్డి, అజయ్ చౌదరి, గాయత్రి పేరుతో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పోస్టులు పెట్టారని గుర్తుచేశారు. వాటిపైనా ఫిర్యాదు చేశామన్నారు. ప్రస్తుత రాష్ట్ర స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అయ్యన్నపాత్రుడు కూడా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మంత్రి లోకేష్ గురించి, టీడీపీ గురించి ఎక్కడైనా మాట్లాడితే తనను చంపుతానని ఘర్షణ టీవీ వెంగళరావు అనే వ్యక్తి కూడా బెదిరించారని, బూతులు మెసేజ్‌లు చేయడంతో ఫిర్యాదు చేశామన్నారు. అలాగే కృష్ణసాగర్ అనే వ్యక్తి తన కుమార్తైపె పెట్టిన పోస్ట్‌ల గురించి, 99496 55108 అనే ఫోను నెంబర్ నుంచి బండ బూతులు తిడుతూ మెసెజ్‌లు చేస్తున్న వారిపైనా ఫిర్యాదు చేశామని తెలిపారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కేసులు నమోదు చేయకపోతే కోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేస్తామని వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంపై పోస్ట్‌లు పెట్టిన వారిపై చర్యలెక్కడ? చంద్రబాబు చర్యలు తీసుకుంటామని ప్రకటించినా చేతల్లో మాత్రం శూన్యం మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడిపైనే ఫిర్యాదు చేశాం విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
రామలింగేశ్వరునికి అన్నాభిషేకం
నగరంపాలెం: స్థానిక మల్లారెడ్డినగర్ అయ్యప్పస్వామి దేవాలయం ప్రాంగణంలోని శివాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీపర్వత వర్దిని సమేత శ్రీరామలింగేశ్వరస్వామికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, విశేషంగా అన్నాభిషేకం నిర్వహించారు. శ్రీగణపతి సహిత రుద్ర హోమం చేశారు. కార్యక్రమాలను చంద్రశేఖరశర్మ, శివకుమార్‌శర్మ చేపట్టారు. మహా హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఎంకేఆర్ ఫౌండషన్ చైర్మన్ మెట్టు కృష్ణారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. యార్డుకు 43,356 బస్తాల మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 43,356 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 39,948 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ. 15,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 17,000 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ. 9,000 నుంచి రూ. 14,500 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 9,000 నుంచి రూ. 16,000 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.10,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 31,944 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు. వీర్ల అంకాలమ్మకు వెండి మకరతోరణం దాచేపల్లి : స్థానిక శ్రీ వీర్ల అంకమ్మతల్లికి దాచేపల్లికి చెందిన దేవరశెట్టి బాలాంజనేయులు కుమారుడు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు రూ10 లక్షల విలువ చేసే వెండి మకర తోరణం తయారు చేయించి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. దాత నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పూజలు చేసి మకర తోరణంతో అంకమ్మ తల్లిని అలంకరించారు. కమిటీ సభ్యులు దాత కుటుంబ సభ్యులను సన్మానించారు. 24న మహిళా కబడ్డీ జట్టు ఎంపిక నరసరావుపేట ఈస్ట్: గుంటూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్ మహిళా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు ఈనెల 24న కృష్ణవేణి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, అసోసియేషన్ కార్యదర్శి మంతెన సుబ్బరాజు మంగళవారం తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు డిసెంబర్ 5 నుంచి 8 వరకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరగనున్న 71వ అంతర్ జిల్లాల మహిళా కబడ్డీ పోటీలలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు 9502925925 నంబరును సంప్రదించాలని కోరారు. గర్భిణులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా ఐడీలు నమోదు డెప్యూటీ డీఎంహెచ్ఓ పద్మావతి అచ్చంపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి ఉప కేంద్రాలలో గర్భిణులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాలకు ఐడీలను తప్పనిసరిగా నమోదు చేయాలని డెప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎం.పద్మావతి సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. గర్భిణులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీల లింక్, ఎలాక్ట్రానిక్ హెల్త్ రికార్‌ుడ్స నమోదు, నాన్ కమ్యూనికేబుల్ డీసీజస్ అండ్ కమ్యూనికేబుల్ డీసీజస్ సర్వే వంటి కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించారు. వైద్యాధికారులు డాక్టర్ వి.రాబాబునాయక్, డాక్టర్ సీహెచ్ స్రవంతిలకు సూచనలిచ్చారు. వ్యాక్సిన్లు నిల్వ ఉంచే కోల్డ్‌చైన్ సిస్టంను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ వి.రాబాబునాయక్, డాక్టర్ స్రవంతి, ఆరోగ్య విస్తరణాధికారి పి.వెంకట్రావు, సీహెచ్ఒ శివనాగేశ్వరి, సూపర్వైజర్ పి.రాధాకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్ సుభాని సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు పేటకు శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి
తెనాలి : అద్వైత పీఠాల్లో అత్యంత ప్రశస్తమైన శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి శ్రీవిదుశేఖర భారతీస్వామి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 18, 19వ తేదీల్లో విజయవాడలో బస చేశారు. 20, 21వ తేదీల్లో నరసరావుపేట, 22, 23వ తేదీల్లో గుంటూరులో ఉంటారు. చిన్న వయసులోనే శారదా పీఠం ఉత్తరాధికారిగా నియమితులైన స్వామి శ్రీశృంగేరీ పీఠానికి తదుపరి 37వ జగద్గురువులని తెలిసిందే. ఉమ్మడి గుంటూరు జిల్లాతో స్వామికి అనుబంధం ఉంది. తెనాలి సమీపంలోని కృష్ణానదీ తీరంలో ఉన్న అనంతవరం వీరి స్వగ్రామం. తల్లిదండ్రులు సీతానాగలక్ష్మి, కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని. వేదాలు, వేదభాష్యంలో ప్రఖ్యాత పండితుడైన శివసుబ్రహ్మణ్య అవధాని తిరుమలలోని టీటీడీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌గా, ఎస్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ వేదిక్ స్టడీసీ, టీటీడీ ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్నారు. వీరి రెండో కుమారుడు వెంకటేశ్వరప్రసాద శర్మ. 1993 జులై 24న తిరుపతిలో జన్మించారు. అయిదేళ్ల వయసులోనే కుమారుడికి ఉపనయనం చేయించారు. కృష్ణ యజుర్వేదమే తొలి పాఠం... తాత కృష్ణ యజుర్వేద పాఠాలే తొలి అభ్యాసం. తండ్రి వద్ద కృష్ణ యజుర్వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు. కుప్పా వంశీకులు హంసల దీవిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక భాగవత సప్తాహాలు జరుపుతుంటారు. వేద విద్యలో కొనసాగుతున్న ప్రసాద శర్మ, ఇలాంటి దైవ కార్యాల్లో పాల్గొంటూ, తండ్రితో కలిసి దేశంలోని పుణ్య క్షేత్రాలన్నింటినీ సందర్శించారు. 2006లో శృంగేరీ శారదా పీఠంలో తాత, తండ్రితో కలిసి ఓ ధార్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009లో శృంగేరీ పీఠం జగద్గురును దర్శించుకున్నపుడు స్వామి శిష్యరికంలో శాస్త్రాలు నేర్చుకోవాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. జగద్గురు బోధనలతో... ఆ విధంగా శృంగేరీ జగద్గురు అనుగ్రహానికి 22 ఏళ్ల వయసులోనే నోచుకున్నారు. న్యాయ, వేదాంత, వ్యాకరణాది శాస్త్రాలను, అక్కడి ఉద్దండ పండితుల వద్ద సంస్కృతం, కవిత్వం, సాహిత్యం తదితరాలను అధ్యయనం చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే అపార పాండిత్యం గడించారు. ఆయా శాస్త్రాలను అధ్యయనం చేసిన కాలంలో అనుష్టానం, తపస్సు మినహా లౌకికమైన విషయాల్లో ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఆయన ప్రతిభను గ్రహించిన జగద్గురు తానే స్వయంగా శాస్త్రాలను బోధించారు. దీంతో తర్కశాస్త్ర పండితుడుగా అవతరించారు. ప్రతిష్ఠాత్మక వ్యాక్యార్థ విద్వత్ సభలు, ఏటా జరిగే జాతీయ శాస్త్ర పండితుల సభల్లోనూ తన ప్రసంగాలతో అందరినీ ఆశ్చర్యపరచ సాగారు. తర్వాత మీమాంస శాస్త్రం నేర్చారు. వేదాంతం నేర్చుకుంటూనే విద్యార్థులకు తర్కం, మీమాంస, వ్యాకరణశాస్త్రం బోధించసాగారు. పీఠంతో పూర్వీకులకు అనుబంధం... గుంటూరు జిల్లాతో శ్రీవిదుశేఖర భారతీ స్వామీజీకి ప్రత్యేక అనుబంధం శ్రీవిదుశేఖర భారతీ స్వామి పెద్దలకు 1961 నుంచి శృంగేరీ పీఠంతో అనుబంధముంది. అప్పట్లో 35వ జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థస్వామి వచ్చినపుడు, వీరి తాత సోదరుడు బైరాగిశర్మ స్వాగతం పలికి పాదపూజ చేశారు. 1985లో శృంగేరీ పీఠాధిపతికి ఇక్కడ ఘన స్వాగతం లభించింది. వీరి మరో తాత కుప్పా వెంకట చలపతి యాజీ 2002లో పీఠాధిపతి అనుమతితో సన్యాస దీక్ష తీసుకున్నారు. ఆయన సోదరుడు కుప్పా రామ గోపాల వాజపేయీ కృష్ణ యజుర్వేద పండితుడు. శృంగేరీ జగద్గురు భక్తుడు. ఆ క్రమంలోనే శ్రీవిదుశేఖర భారతీస్వామి తండ్రి కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని జగద్గురు అభినవ విద్యాతీర్థ శాస్త్ర సంవర్ధిని పాఠశాలలో చదివారు. -
దిగులుబడి!
● తగ్గిన ధాన్యం దిగుబడి ● రైతుల ఆశలు ఆవిరి ● మరోవైపు ధరల పతనం ● ప్రభుత్వం నుంచి ‘మద్దతు’ శూన్యం ● ఆవేదనలో అన్నదాతలు తెనాలి/కొల్లిపర: ఈ ఏడాది ఖరీఫ్ సీజనుకు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడిన విషయం తెలిసిందే. వర్షాలకు వరి వెదజల్లిన మాగాణి భూముల్లో పల్లపు చేలు నీట మునిగాయి. అన్నదాతలకు పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. ఏదోలా పంట సాగుకు ముందుకు సాగిన రైతుల ఆశలను ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలు, వరదలు దెబ్బతీశాయి. చేలల్లోంచి నీళ్లను బయటకు పంపి, ఎరువులు చల్లి, చీడపీడల నివారణ చర్యలతో కష్టపడి ఫలితం కోసం ఎదురుచూశారు. కానీ ప్రస్తుత పరిస్థితి రైతన్నలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఎక్కడ చూసినా అంతే... కృష్ణా పశ్చిమ డెల్టాలోని కాల్వ ఎగువ భూములున్న తెనాలి వ్యవసాయ సబ్ డివిజనులో ముందుగా కొల్లిపర మండలంలో హార్వెస్టింగ్ ఆరంభమైంది. ముందుగా వెదజల్లిన వరి చేలల్లో గత వారం రోజుల్నుంచి రైతులు యంత్రాలతో కోత, నూర్పిడి చేస్తున్నారు. సమీపంలోని బాపట్ల జిల్లా పరిధిలోకి వచ్చే వేమూరు నియోజకవర్గంలోని చుండూరు, ఇతర మండలాల్లో రెండు రోజుల క్రితం నూర్పిళ్లకు శ్రీకారం చుట్టారు. అన్ని చోట్లా ఫలితం ఒక్కటేనన్నట్టుగా ఉంది. ఎక్కడ చూసినా దిగుబడి భారీగా తగ్గిపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రూ.20 వేలు నష్టం ఏడెకరాల్లో దిగుబడి అంతంత మాత్రమే వచ్చింది. నాలుగు రోజులు ఆగుదామనుకుంటే వాతావరణం సరిగా లేదు. వర్షాలు వస్తే ఇబ్బందని అమ్మేశాను. 75 కిలోల బస్తా రూ.1,400 చొప్పున కొనుగోలు చేశారు. గత సంవత్సరం రూ.2,100 ధర వచ్చింది. దిగుబడి తగ్గటం, ధర లేకపోవటంతో ఎకరాకు రూ.20 వేలు నష్టపోయాను. – మర్రెడ్డి కోటిరెడ్డి, తూములూరు, రైతు ధాన్యం గతేడాది ఎకరాకు 35–40 బస్తాలు రాలగా, ప్రస్తుత ఖరీఫ్ సీజను పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎకరాకు కేవలం 25–30 బస్తాలు మాత్రమే దిగుబడి వస్తోంది. అంటే ఎకరాకు పది బస్తాల వరకు తగ్గింది. డెల్టాలో అత్యధిక విస్తీర్ణం కౌలు సాగేనన్న విషయం తెలిసిందే. ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు కౌలు చెల్లిస్తున్నారు. మరో రూ.25 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. ఈ కౌలు రైతులకు ధాన్యం దిగుబడి తగ్గిపోవటంపై ఆవేదన వ్యక్తమవుతోంది. దీనికితోడు గత సంవత్సరం నూర్పిళ్ల సమయంలో చేల వద్దకే వచ్చిన వ్యాపారులు నూర్పిడి చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేశారు. ఆరంభంలోనే వచ్చిన వ్యాపారులు తేమ సంగతి కూడా పట్టించుకోకుండా బస్తా రూ.1,600లకు కొనుగోలు చేశారు. అదే సమయంలో వర్షాలు కురిసిన విషయం రైతులకు గుర్తుండే ఉంటుంది. వర్షాలు వెలిసి, మళ్లీ నూర్పిళ్లు ఆరంభించాక బస్తా రూ.1,800– రూ.1,900లకు కొనుగోలు చేశారు. మార్కెట్లో ఆశావహ ధరలతో అన్నదాతలు ప్రభుత్వంకేసి చూడాల్సిన పనిలేకుండా పోయింది. ఇందుకు పూర్తి భిన్నంగా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. నూర్పిడి చేసిన ధాన్యానికి బయటి వ్యాపారులు బస్తాకు కేవలం రూ.1,400 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇప్పుడే ఇలా వుంటే, అన్ని ప్రాంతాల్లో నూర్పిడులు ఆరంభించి ముమ్మరంగా ధాన్యం వచ్చేటప్పటికి ధర ఎలా ఉంటుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. పాత ధాన్యం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కొనేవారు కనిపించటం లేదంటున్నారు. మార్కెట్లో రూ.2,400 ధర ఉంటే కనీసం రూ.2100లకు కూడా కొనటం లేదని చెబుతున్నారు. ఈ క్రాప్ నమోదు చేసిన పంట చేలకు సంబంధించి రైతులకు రైతుసేవా కేంద్రాల ద్వారా కూపన్లు మంజూరు చేసి, కొనుగోళ్లు ఆరంభించనున్నట్టు మండల వ్యవసాయ అధికారి ప్రేమ్‌సాగర్ వెల్లడించారు. పొలాల్లోనే విక్రయం ఆరెకరాల మాగాణి కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. మూడెకరాల్లో హార్వెస్టింగ్ చేశాను. ఎకరానికి 34 బస్తాలొచ్చాయి. ధర కూడా లేదు. రూ.1,400లకే అమ్మేశాను. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో ప్రైవేటు వ్యాపారులకే విక్రయించాల్సి వచ్చింది. కౌలు, పెట్టుబడి, నూర్పిడికి ఖర్చులు లెక్కేసుకుంటే ఎకరాకు రూ.20 వేల వరకు నష్టం వచ్చింది. – నలకుర్తి చిన్నా, తూములూరు, కౌలు రైతు -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని శబరిమల భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ మంగళవారం తెలిపారు. వివరాలు... ● నెంబర్ 07143 మౌలాలి – కొల్లం రైలు వయా గుంటూరు డివిజన్ మీదుగా డిసెంబర్ 6, 13, 20, 27వ తేదీలలో ఉంటుంది. మౌలాలిలో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ● నెంబరు 07144 కొల్లం–మౌలాలి రైలు డిసెంబర్ 8, 15, 22, 29వ తేదీలలో కొల్లం నుంచి అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మౌలాలి చేరుతుంది. ● నెంబరు 07145 మచిలీపట్నం–కొల్లం రైలు డిసెంబర్ 2, 9, 16 వ తేదీలలో మచిలీపట్నం నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.20 గంటలకు కొల్లం చేరుతుంది. ● నెంబరు 07146 కొల్లం–మచిలీపట్నం రైలు డిసెంబర్ 4, 11, 18వ తేదీలలో కొల్లం నుంచి అర్ధరాత్రి 2.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మచిలీపట్నం వస్తుంది. ● నెంబరు 07147 మచిలీపట్నం–కొల్లం రైలు డిసెంబర్ 23, 30వ తేదీలలో మచిలీపట్నం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 9.20 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ● నెంబరు 07148 కొల్లం–మచిలీపట్నం రైలు డిసెంబర్ 25వ తేదీన కొల్లంలో అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నం వస్తుంది. ● 07143, 07145, 07147 ప్రత్యేక రైళ్లకు ఈ నెల 20వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది. -
ఆర్టీసీ బస్సు, మినీ లారీ ఢీ: డ్రైవర్ మృతి
చేబ్రోలు: ఆర్టీసీ బస్సు, మినీ లారీ ఢీ కొన్న ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడక్కడే మరణించాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పొన్నూరు ప్రాంతానికి చెందిన మినీ లారీ డ్రైవర్ బండారుపల్లి శ్రీనివాసరావు (42) పనుల నిమిత్తం మినీ లారీలో విజయవాడ వెళ్లాడు. తిరిగి పొన్నూరు వైపు మంగళవారం రాత్రి వస్తుండగా నారాకోడూరు గ్రామ శివారులో ఎదురుగా ఆర్టీసీ బస్సు వచ్చింది. రెండు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మరణించాడు. ఆర్టీసీ బస్సులోని పది మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనతో పొన్నూరు, గుంటూరు వైపు కొంత సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరు ప్రాంతానికి చెందిన కందుకూరి గురుబ్రహ్మాచారి, డి.బుజ్జి, నారాకోడూరుకు చెందిన మధుసూదనరావు తదితర క్షతగాత్రులను 108 వాహనం ద్వారా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేబ్రోలు ఎస్ఐ డి.వెంకటకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.