పాక్‌ ఉగ్రవాదులపై దొరబాబు వీరత్వం | Mandasa Jawan Fight Against Pakistan Terrorists | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ ఉగ్రవాదులపై జవాను దొరబాబు వీరత్వం

Published Wed, Mar 11 2020 10:44 AM | Last Updated on Wed, Mar 11 2020 1:12 PM

Mandasa Jawan Fight Against Pakistan Terrorists - Sakshi

సాక్షి, మందస: ఉద్దానం సైనికుడు వీరత్వం చూపాడు. శత్రువుల తూటాలకు గాయాల పాలైనా బాధను దిగమింగుకుని లక్ష్యాన్ని ఛేదించాడు. ప్రాణాలు పణంగా పెట్టి కర్తవ్య నిర్వహణలో భాగంగా పాకిస్తాన్‌ టెర్రరిస్టును అంతమొందించి శభాష్‌ అనిపించుకున్నాడు మందస మండలం చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన జవాను తామాడ దొరబాబు. సైన్యంలో చేరి తొమ్మిదేళ్లుగా సేవలందిస్తున్న దొరబాబు సోమవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌ ఉగ్రవాదులను హతమార్చడంలో కీలకంగా వ్యవహరించి ఆర్మీ అధికారులతో పాటు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
 
కాలికి గాయమైనా.. 
ఉద్దాన ప్రాంతమైన లొహరిబంద పంచాయతీ చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన తామాడ భైరాగి, కామమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆనందరావు(ఢిల్లీ), దొరబాబు(జమ్మూ–కాశ్మీర్‌) ఇద్దరూ ఆర్మీలోనే పని చేస్తున్నారు. దొరబాబు జమ్మూ–కాశ్మీర్‌లోని 1ఆర్‌ఆర్‌ బెటాలియన్‌లో పని చేస్తున్నారు. 200 మంది జవాన్లు సెర్చ్‌టీంగా కోజ్‌పూర్‌ గ్రామంలో సెర్చ్‌ చేస్తున్నారు. రెండిళ్లు సెర్చ్‌ చేసిన అనంతరం హఠాత్తుగా ఓ ఇంటి నుంచి కాల్పులు ప్రారంభమవ్వగా సైనికులు తేరుకునే లోపే దొరబాబు కాలికి గాయమయ్యింది. అయినా వెనుకడుగు వేయక శత్రువు గమ్యాన్ని నిశితంగా పరిశీలించారు. కిటికీ నుంచి ఇద్దరు ముష్కరులు కనిపిస్తుండడంతో ఏకే–47తో దొరబాబు ముందుకు ఉరికి కాల్పులు జరిపారు. 30 రౌండ్ల మేగజైన్‌లోని 27 రౌండ్లు శత్రువులో దిగిపోయాయి. దీంతో పాకిస్తా టెర్రరిస్టు సాభిర్‌ అహ్‌మాలిక్‌ అక్కడికక్కడే మరణించారు. మరో ఉగ్రవాదికి కూడా దొరబాబు కాల్చిన బులెట్లతో పాటు పక్కనే ఉన్న సైనికులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు.  

సర్వత్రా హర్షం.. 
దేశ రక్షణలో ప్రాణాలను సైతం లెక్కచేయక శత్రువులను దొరబాబు ఉద్దానం ఖ్యాతిని మరింత పెంచారని ఉద్దానంవాసులు పేర్కొంటున్నారు. తమ కుమారులిద్దరూ సైన్యంలో పని చేయడం గర్వంగా ఉందని, దొరబాబు ముష్కరులను హతమార్చి మాతృభూమి రక్షణలో కీలకపాత్ర పోషించడంపై తల్లిదండ్రులు కామమ్మ, భైరాగి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో స్వల్పంగా గాయపడ్డానని సైనికుడు దొరబాబు ‘సాక్షి’కి  ఫోన్‌ ద్వారా వివరించారు. కాలిలో బులెట్‌ తగిలి స్వల్ప గాయమైందని, ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement