అమ్మ ఒడిలో ఊగనైతిని..
ముర్రుపాలు తాగనైతిని..
కన్నతల్లిని చూడనైతిని..
కటిక నేలపైకి జారుకుంటిని..
జాలిలేని ఓ బ్రహ్మ..
నా రాతిట్లా రాశావేందమ్మా..
ఆడపిల్లగా పుట్టడం శపమా..
అమ్మకు నేనంటే కోపమా..
ఏమో.. నేనూ ఓ పీవీ సింధులా
విజయం సాధిస్తానేమో..
ఎందుకమ్మా.. నన్ను చీకట్లో విసిరేశావ్..
కాళరాత్రి మిగిల్చావ్..
పొత్తిళ్ల బంధం తెంచేశావ్..
వెక్కివెక్కి ఏడ్చేలా చేశావ్.. అంటూ
అప్పుడే పుట్టిన ఓ శిశువు గుండెపగిలేలా రోదించింది.
కైకలూరు : అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డుపై విసిరేసిన హృదయ విధారకరమైన సంఘటన కైకలూరులో బుధవారం అర్ధరాత్రి వెలుగుచూసింది. పోలీసు స్టేషన్‌కు కూతవేట దూరంలో ఆడ శిశువును ఇసుక దిబ్బపై పడేశారు. రెండో ఆట సినిమా నుంచి వస్తున్న వ్యక్తికి శిశువు ఏడుపు వినిపించింది. సెల్‌ఫోన్ లైట్‌లో చూసి ఆశ్చర్యపోయాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ షబ్బిర్ అహ్మద్, 108 సిబ్బంది శిశువును ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శిశువుకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. జన్మించి గంట సమయం అవుతోందని వైద్య సిబ్బంది తెలిపారు. కైకలూరు ఆస్పత్రిలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కన్నతల్లి మనసు మార్చుకుని బిడ్డను అక్కున చేర్చుకోవాలని మనస్నువారంతా ఆశిస్తున్నారు.