నిన్న పావని..నేడు భార్గవ రెడ్డి మృతి | chaithanya collage student commit to suicde | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ కళాశాలల్లో మోగుతున్నమృత్యు గంట

Published Sat, Oct 14 2017 8:18 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

chaithanya collage student commit to suicde - Sakshi

మృతిచెందిన విద్యార్థి భారవ్‌రెడ్డి(ఫైల్‌)

వైఎస్‌ఆర్‌ జిల్లా , రాయచోటి/ రూరల్‌ : గత కొంత కాలంగా నారాయణ, చైతన్యలతో పాటు పలు కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థుల మృత్యు గంటలు మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బయటకు తెలిసే విధంగా పదుల సంఖ్యలో, తెలియకుండా ఆత్మహత్యలకు, ఇతర అనుమానాస్పదంగా వందల సంఖ్యలో విద్యార్థులు మృత్యువాత పడుతూనే ఉన్నారు. నిన్న కడపలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో చదువుకుంటున్న పావని అనే విద్యార్థిని హాస్టల్‌లో మృతి చెందింది. నేడు రాయచోటికి చెందిన ఏ.భార్గవరెడ్డి విజయవాడ చైతన్య కళాశాలలోని హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  జిల్లా కు చెందిన మనీషా, నందినిలు కూడా గతంలో నారాయణ కళాశాలలో మృ త్యువాత పడ్డారు.  ఇలా వరుసగా కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థులు మృత్యువాత పడుతుంటే కన్న బిడ్డల మీద కోటి ఆశలు పెట్టుకుని ఆయా కళాశాలల్లో చేర్పించిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల మృతికి  కారణమేంటి ?
కార్పొరేట్‌ కళాశాలల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చి చేరే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. అయితే ఆయా కళాశాలల్లో విద్యార్థులు తర చూ మృత్యువాత పడటానికి కారణాలు మాత్రం కళాశాల ప్రహరీలు దాటి బయటకు రావడం లేదు. దీంతో విశ్లేషకులు, మేథావులు విద్యార్థుల మృతికి పలు కారణాలు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా యాజమాన్యం, బోధనా సిబ్బంది ప్రవర్తన విద్యార్థుల పట్ల సరిగా లేకపోవడం కూడా పేర్కొంటున్నారు. అలాగే విద్యలో అధిక ఒత్తిడి,  ఆట, పాటలకు సమయం లేకపోవడం, తీరిక సమయం లేకుండా స్టడీ అవర్స్‌ పెట్టడం, వారం వారం ముఖ్యమైన పరీక్షల నిర్వహణ,  మార్కులు వెల్లడించడం వంటి కారణాలు కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణంగా చెబుతున్నారు.

విద్యార్థుల మృతిపై విద్యాశాఖ చర్యలు శూన్యం
విద్యార్థులు ఆయా కార్పొరేట్‌ కళాశాలల్లో ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతుల విషయం తెలిసినా విద్యాశాఖ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు కూడా కనిపించడం లేదు. కళాశాలల్లో మృతి చెందుతున్న విద్యార్థులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, తప్పులను సరిదిద్దడమో, లేక కళాశాలలపై చర్యలు తీసుకోవడమో విద్యాశాఖ చేయడం లేదు. అందుకు కారణంగా ఆయా కళాశాలల యాజమాన్యం అధికార పార్టీ అందడండలతో, చేతిలో అధికారం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించడమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రాయచోటిలో విషాదం....
ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఎ.భార్గవరెడ్డి మరణవార్తతో గున్నికుంట్లతో పాటు రాయచోటి పట్టణంలో తీవ్ర విషాదం అలుముకుంది. చదువులో బాగా రాణిస్తూ అమ్మానాన్నలతో రోజూ మాట్లాడుతున్న భార్గవ మరణించడంపై బంధువులు, మిత్రులు, మరీ ముఖ్యంగా పాఠశాలలో చదువుతున్న తోటి మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి ప్రాంతం నుంచి వేలాది మంది విద్యార్థులు విజయవాడ, నెల్లూరు, గుంటూరు ప్రాంతాలలోని కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుతున్నారు. ఈ సంఘటనతో ఉలిక్కిపడిన విద్యార్థుల తల్లిదండ్రులు వారి కళాశాలలకు ఫోన్లు చేసి బిడ్డల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

రాత్రి కూడా సంతోషంగా మాట్లాడాడు
నా కొడుకుకు ఇద్దరు కొడుకులు. భార్గవ రెడ్డి విజయవాడలో ఇంటర్‌ చదువుకోసం వెళ్లాడు. మరొకరు భానుప్రకాశ్‌ రెడ్డి రాయచోటిలో 10వ తరగతి చదువుతున్నాడు. భార్గవ గురువారం రాత్రి ఫోన్‌ చేశాడు. అమ్మానాన్నలతో పాటు తమ్ముడు, తాత, నాతో కూడా మాట్లాడాడు. సంతోషంగా ఉన్నాను, నేను బాగా చదువుకుంటున్నాను, నా గురించి ఏమీ భయపడవద్దు అని ఫోన్‌లో చెప్పాడు. అంతలోనే  తెల్లవారే సరికి నా మనువడు ఉరివేసుకున్నాడని ఫోన్‌ వచ్చింది. అంతలోనే ఏ కష్టం వచ్చిందో, మమ్మలందరినీ వదిలి వెళ్లిపోయాడు.
– వెంకటలక్ష్మమ్మ (ఇంటర్‌ విద్యార్థి భార్గవ రెడ్డి నాన్నమ్మ)

నారాయణ,చైతన్య కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
వరుసగా విద్యార్థులు మృతి చెందుతున్న నారాయణ, చైతన్య కళాశాలలపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి. అనుమానాస్పదంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయంపై కళాశాలల్లో ఉన్నతాధికారులతో కమిటీ వేసి, నిజనిర్ధ్దరణ చేయాలి. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా, ర్యాంకుల కోసం తీవ్ర ఒత్తిడికి గురి చేయడం వంటి విషయాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి. పలు సార్లు విద్యార్థుల మృతి విషయాలను కూడా కొన్ని కళాశాలలు బయటకు వెళ్లడించకపోవడం దారుణం. అధికార పార్టీ అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నారాయణ, చైతన్య కళాశాలలను రద్దు చేయాలి . – కాలేషా, ఏఐఎస్‌ఏ జిల్లా ఉపాధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement