కన్నీటి వీడ్కోలు..       | Constable Funeral Completed | Sakshi
Sakshi News home page

ముగిసిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ అంత్యక్రియలు

Published Wed, May 23 2018 11:38 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable Funeral Completed - Sakshi

అధికార లాంఛనాలతో రాజశేఖర్‌ అంత్యక్రియలు  

ఆమదాలవలస రూరల్‌ : మండలంలోని కలివరం పంచాయతీ ఫీర్‌సాహెబ్‌పేట గ్రామానికి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ చింతాడ రాజశేఖర్‌(30) చిత్తూరులో అనుమానాస్పందగా మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే రాజశేఖర్‌ స్వగ్రామం ఫీర్‌సాహెబ్‌పేట కావడంతో ఇక్కడ నాగావళి నదీతీరంలో ఆయన మృతదేహానికి అధికార లాంఛనాలతో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.

ఆమదాలవలస సీఐ ఆదాం, ఎస్‌ఐ వాసుదేవరావు, ఏఎస్‌ఐ మెట్ట సుధాకర్, చిత్తూరు జిల్లా ఏఆర్‌ ఎస్‌ఐ విశ్వనాథం, ఎచ్చెర్ల ఏఆర్‌ ఏఎస్‌ఐ సింహాచలంలు రాజశేఖర్‌ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. 

మిన్నంటిన కుటుంబసభ్యుల రోదన 

స్వగ్రామానికి రాజశేఖర్‌ మృతదేహం చేరుకోగానే రోదనలు మిన్నంటాయి. రెండు రోజులుగా మృతదేహం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు దుఖాఃన్ని దిగమింగుకుని పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. చేతికి అందివచ్చిన కొడుకు కష్టాలు తీర్చుతాడని అనుకుంటే ఇలా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు సుబ్బయ్య, రత్నాలు జీర్ణించుకోలేకపోతున్నారు.

గ్రామంలోనూ అందరితో మంచిగా ఉంటూ సహాయాలు చేసే మంచి గుణం ఉన్న మిత్రుడిని కోల్పోయామని తోటి స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. రాజశేఖర్‌ మరణంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది.

ప్రతి ఒక్కరూ కన్నీటితో రాజశేఖర్‌కు నివాళులు అర్పించారు. జూన్‌ నెలలో సెలవుపై వస్తానని చెప్పి ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని బంధువులు రోదించారు. ముందుగా రాజశేఖర్‌కు గ్రామస్తుల ఆచారం ప్రకారం అశ్రునివాళుల మధ్య అంత్యక్రియల తంతు ముగించిన అనంతరం పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ముగించారు. 

విధుల్లో మృతిచెందడం బాధాకరం 

పోలీసు విధులు నిర్వహిస్తూ మృతిచెందడం చాలా బాధాకరమని వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ మృతిచెందడంతో వారి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. రాజశేఖర్‌ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

రాజశేఖర్‌ మృతికి గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మంచిగా నడుచుకునే వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాజశేఖర్‌ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement