సాక్షి, కరీంనగర్ : ఉన్నత కొలువుల్లో ఉండి..పెద్దలను ఎదిరించి.. ఆదర్శ వివాహం చేసుకొని అన్యోన్య జీవితం గడుపుతున్న భార్యభర్తలను లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఈ విషాద సంఘటన హుజురాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల మేరకు..పట్టణంలోని కాకతీయ కాలనీలో నివాసం ఉంటున్న మల్లికార్జున్- సులోచనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె శ్వేత(29) మండలంలోని సింగాపూర్ గ్రామంలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకురాలిగా పని చేస్తోంది. అదే కళాశాలలో ట్రిపుల్‌ఈ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గోస్కుల నాగరాజుతో ఆరేళ్లక్రితం పరిచయం ప్రేమగా మారగా..పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. వీరికి ఆర్యనాథ్(5), సూర్యనాథ్(3) పిల్లలు ఉన్నారు.
ఈ క్రమంలోనే గోస్కుల శ్వేత ఇటీవల గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టుకు ఎంపికైంది. శుక్రవారం కళాశాలకు న్యాక్ కమిటీ పరిశీలన వస్తున్నట్లు సమాచారం అందడంతో పిల్లలిద్దరిని స్కూల్‌కు పంపించి ఉదయం 8 గంటలకు కారులో భార్యాభర్తలిద్దరూ కళాశాలలకు బయల్దేరారు. కారు తుమ్మనపల్లి శివారులోకి చేరుకోగానే ముందు వాహనాన్ని దాటుతుండగా కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాగా విషయం తెలుసుకున్న నాగరాజు తల్లిదండ్రులు గోస్కుల వెంకటయ్య-సరస్వతి, అక్కబావలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఇద్దరిని పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స వరంగల్‌కు తరలించగా చికిత్స పొందుతూ శ్వేత మృతిచెందగా నాగరాజు పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు ఒంటరిగా మిగిలారు. వారి మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకొని రోదించిన తీరు పలువురిని కలిచివేసింది. శ్వేత తండ్రి మల్లికార్జున్ ఫిర్యాదు మేరకు హుజూరాబాద్ టౌన్ సీఐ వాసంశెట్టి మాధవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment