రాంచీ: అంతరిక్షం అంతు చూసే ప్రయోగాలు ఓ వైపు.. అంతులేని అజ్ఞానం మరోవైపు. వెరసి నేటికి గ్రామాల్లో మంత్రాలు, చేతబడులు వంటి మూఢనమ్మకాలు బలంగా నాటుకుపోయాయి. వీటి గురించి సరైన అవగాహన లేక గ్రామాల్లో నేటికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. అనారోగ్యం పాలైన యువతిని ఆస్పత్రికి తీసుకేళ్లే బదులు భూత వైద్యం చేసే జంట దగ్గరకు తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. దెయ్యాన్ని వదిలిస్తామని చెప్పి సదరు దంపతులు ఏకంగా యువతి ప్రాణాలు తీశారు.
ఆ వివరాలు.. గర్వా, కొందిరా గ్రామానికి చెందిన రుద్ని దేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే బదులు ఓ తాంత్రిక జంటను ఆశ్రయించారు. వారు రుద్ని దేవిని పరీక్షించి ఆమె శరీరంలో దెయ్యం ఉందని చెప్పి.. దాన్ని పారదోలడానికి పూజలు చేయలన్నారు. ఈ క్రమంలో త్రిశూలం తీసుకుని రుద్ని శరీరం మీద గుచ్చడమే కాక ఆమె కళ్లను కూడా పొడిచారు. అప్పటికే అనారోగ్యంతో నీరసించిన రుద్ని ఈ హింసను తట్టుకోలేక మరణించింది. దాంతో ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉండేందుకు రుద్ని కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని కాల్చేశారు.
దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రుద్ని కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేశారు. అనంతరం ఓ పోలీసు ఉన్నతాధికారి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘చేతబడులు, మంత్రాలు వంటి వాటి గురించి జనాలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంటాము. కానీ మారుమూల ప్రాంతాలు, గ్రామాల్లో ఉంటున్న జనాల్లో ఇంకా మార్పు రాలేదు. దాంతో ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయ’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment