వాషింగ్టన్ : గురువారం అమెరికా కోర్టులో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి అనే ప్రేమ.. పసి వాళ్లు అనే కనికరం ఏ మాత్రం లేకుండా ఐదుగురు బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడో కసాయి తండ్రి. అయితే అతని మాజీ భార్య మాత్రం చనిపోయిన పిల్లలకు తండ్రంటే ఎంతో ప్రేమ.. అతన్ని క్షమించి వదిలేయండని కోరడం అక్కడ ఉన్న వారందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాలు.. తిమోథి జోన్స్(37) అనే వ్యక్తి కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో కొద్ది కాలం కిత్రం భార్య నుంచి విడిపోయాడు. వీరికి ఐదుగురు సంతానం. వీరంతా ఏడాది నుంచి ఎనిమిదేళ్ల లోపు వయసు వారే. అయితే తిమోథి భార్యకు సరైన ఉద్యోగం లేని కారణంగా కోర్టు పిల్లల బాధ్యతను అతనికే అప్పగించింది.
భార్యతో విడిపోవడం.. పిల్లల పోషణ భారం తన మీద పడటంతో తిమోథి మానసికంగా కుంగిపోయాడు. ఈక్రమంలో తన ఆరేళ్ల కొడుకు.. తన మాజీ భార్యతో కలిసి తనను చంపడానికి కుట్ర పన్నుతున్నాడని భావించాడు. దాంతో ఆ చిన్నారి చేత చనిపోయేంత వరకూ ఎక్సర్‌సైజ్ చేపించాడు. మిగతా చిన్నారులను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం వారి మృతదేహాలను కొండ మీదకు తీసుకెళ్లి అక్కడ నుంచి కిందకు పడేశాడు. తిరిగి వస్తుండగా.. ట్రాఫిక్ పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయగా ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తిమోథిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు.
ఈ క్రమంలో కోర్టులో విచారణ జరుగుతుండగా.. తిమోథి మాజీ భార్య అతన్ని వదిలేయమని కోరడం కోర్టు వారితో సహా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నా పిల్లలకు వారి తండ్రంటే చాలా ఇష్టం. వారి ఆత్మ శాంతి కోసమైనా అతడిని విడిచిపెట్టండి.. బతకనివ్వండి. నా అభ్యర్థన మీకు తప్పుగా అనిపించవచ్చు. కానీ నా పిల్లల తరఫున ఈ విన్నపం చేస్తున్నాను’ అన్నది. కానీ కోర్టు ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు. తిమోథిని రాక్షసునిగా వర్ణిస్తూ.. అతనికి ఉరిశిక్ష విధించింది.
Comments
Please login to add a commentAdd a comment