ధ్వంసమైన బస్సు (ఇన్‌సెట్) నుజ్జునుజ్జయిన జీప్
సాక్షి, తమిళనాడు(సేలం) : సేలంలో రోడ్డుపై ముందు వెళుతున్న కారును ఓవర్ టేక్ చేయబోయిన బస్సు, ఎదురుగా వస్తున్న జీప్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మణం చెందారు. సేలం దగాపట్టి గేట్ ప్రాంతానికి చెందిన పన్నీర్ సెల్వం కుమారుడు గణేశన్ (35). ఈయన కుక్కలు, పందులను విక్రయించే వ్యాపారం చేస్తుంటారు. గణేశన్ గురువారం ఆత్తూరుకు వెళ్లి కుక్కలు తీసుకుని ఓ బొలెరో జీపులో సేలం బయలుదేరారు. జీపు శుక్రవారం వేకువజాము 3.30 గంటల సమయంలో సేలం–చెన్నై జాతీయ రహదారిపై సేలంకు సమీపంలోని కారిపట్టి రామ్ నగర్ వంతెన వద్ద వస్తుండగా ఆ సమయంలో ఎదురుగా ఎర్నాకుళ నుంచి చెన్నైకి వస్తున్న ఆమ్ని బస్సు ముందువెళుతున్న కారును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు అదుపుతప్పిన బస్సు ఎదురుగా వస్తున్న బొలేరోను ఢీకొంది.
ఈ ఘటనలో జీప్ నుజ్జునుజ్జై అందులో ఉన్న గణేశన్ సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందాడు. జీప్ డ్రైవర్ కార్తికేయన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం సమయంలో చెంగోట్టైకు చెందిన ఆమ్ని బస్సు డ్రైవర్ మణిమారన్ (36) బస్సు నుంచి బయటకు దూకేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించిన కారు రోడ్డు పక్క గోడను ఢీకొంది. కారులో ఉన్న జయకుమార్, తమిళ్ సెల్వన్ కూడా గాయాలపాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులు నలుగురిని సేలం జీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బస్సు డ్రైవర్ మణిమారన్, జీప్ డ్రైవర్ కార్తికేయన్ మృతి చెందారు. జయకుమార్ (34), తమిళ్ సెల్వన్ (44) చికిత్స పొందుతున్నారు. కారిపట్టి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు తగల్లేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రెండు గంటలకుపై ట్రాఫిక్ స్తంభించింది.
Comments
Please login to add a commentAdd a comment