నిందితుడు కార్తీక్ , సంధ్యారాణి (ఫైల్)
హైదరాబాద్: ప్రేమోన్మాది నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సంధ్యారాణి తుదిశ్వాస విడిచింది. గురువారం జరిగిన దాడి తర్వాత 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం 7.20 గంటల ప్రాంతంలో కన్నుమూసింది. దీంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చిన లాలాపేట్ పోలీసులు నిందితుడు కార్తీక్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని వాటితోపాటు మరికొన్ని సెక్షన్లు జోడించారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావును నియమించినట్లు నార్త్‌జోన్ డీసీపీ బి.సుమతి పేర్కొన్నారు. బొల్లారం ఠాణాలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పూర్తి వివరాలు వెల్లడించారు.
స్నేహాన్నే ప్రేమగా భావించి..
లాలాపేట్ కమాన్ ప్రాంతం వాసి ఎన్.సావిత్రి మూడో కుమార్తె సంధ్యారాణి. కొన్నాళ్ల క్రితం సంధ్యకు లాలాపేట్ ప్రాంతానికి చెందిన వి.కార్తీక్‌తో పరిచయం ఏర్పడింది. అప్పట్లో ఇతడు పనిచేస్తున్న లక్కీ ట్రేడర్స్‌లోనే ఆమెకూ ఉద్యోగం ఇప్పించాడు. కొన్నాళ్లకు కార్తీక్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. దీంతో సంధ్యను కూడా ఉద్యోగం మానేయాలని ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. అయితే కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఉద్యోగంలో కొనసాగింది. తన స్వభావరీత్యా అతడితో స్నేహపూర్వకంగా మెలిగింది. దీన్ని ప్రేమగా భావించిన కార్తీక్ ఆమె దగ్గర ప్రేమ, పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. కుటుంబ పోషణ భారం తనపై ఉండటం, సక్రమంగా ఉద్యోగం సైతం చేయలేని కార్తీక్ నైజం, జీవితంలో స్థిరపడని తత్వం నేపథ్యంలో ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది. ఇదే విషయాన్ని తాను పనిచేస్తున్న దుకాణ యజమాని జగన్‌రెడ్డి ద్వారా పలుమార్లు కార్తీక్‌కు చెప్పించింది. అయినా కార్తీక్ ప్రవర్తనలో మార్పు రాకపోగా.. తరచు ఆమెకు ఫోన్లు చేసి వేధించడం మొదలెట్టాడు. ఓ సందర్భంలో కార్తీక్ ఆమెకు ఫోన్ చేయగా.. సహోద్యోగి ఫోన్ ఎత్తాడు. కార్తీక్ వేధింపుల విషయం సంధ్య ద్వారా తెలిసిన అతడు.. ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా ఫోన్‌లోనే కార్తీక్‌ను మందలించాడు.
కక్షగట్టి.. పెట్రోల్ పోసి..
దీంతో సంధ్యపై కక్షగట్టి, ద్వేషం పెంచుకున్న కార్తీక్ గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సంధ్యారాణిని అడ్డగించాడు. తనను పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేశాడు. దీంతో ఇరువురి మధ్యా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆమె నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. సంధ్యతో మాట్లాడటానికి వచ్చే వ్యక్తి తన వెంట పెట్రోల్ బాటిల్‌ను తీసుకురాడని, సంధ్యను హత్య చేయాలని కార్తీక్ ముందే పథకం వేసుకున్నాడని, అందుకే పెట్రోల్‌తో వచ్చాడని పోలీసులు తెలిపారు.
సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ కమిటీ
కాగా, సంధ్యారాణికి వైద్యసేవలు అందించడంలో సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు తమతో అనుచితంగా ప్రవర్తించారని మృతురాలి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ ఆర్‌ఎంఓ–1 జయకృష్ణ, నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మతో కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు.
మరణ వాంగ్మూలం నమోదు
తీవ్ర గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చేరిన సంధ్యారాణి మరణ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసినట్లు డీసీపీ సుమతి చెప్పారు. తనను ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా వెంటపడుతున్న కార్తీక్.. తాను తిరస్కరించడంతో కక్షగట్టి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు బాధితురాలు పేర్కొందని తెలిపారు. వీలైనంత త్వరగా కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేసి, నిందితుడిపై నేరం నిరూపణ అయ్యేలా ప్రయత్నిస్తామని చెప్పారు.
కనిపించని పశ్చాత్తాప ఛాయలు..
సంధ్యారాణి హత్య కేసు లాలాగూడ ఠాణాలో నమోదైంది. నార్త్‌జోన్ డీసీపీ సుమతి విలేకరుల సమావేశాన్ని బొల్లారం పోలీసుస్టేషన్‌లో నిర్వహించారు. దీంతో పోలీసులు కార్తీక్‌ను తమ వాహనంలో అక్కడకు తీసుకువచ్చారు. ఇలా వస్తున్నప్పుడు, మీడియా సమావేశం తర్వాత, తిరిగి తీసుకువెళ్తున్నప్పుడు మీడియా అతడితో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ స్పందన లేదు. ఆద్యంతం తన ముఖానికి కర్చిఫ్ కట్టుకుని ఉన్న కార్తీక్‌లో ఏమాత్రం పశ్చాత్తాప ఛాయలు కనిపించలేదు.
గాంధీమార్చురీ వద్ద రోధిస్తున్న తల్లి సావిత్రి, బంధువులు
Comments
Please login to add a commentAdd a comment