తణుకు: ‘జిల్లాలోకి సైకోలు వచ్చారు... పిల్లలను ఎత్తుకుపోతున్నారు.. రాత్రివేళ ఎవరైనా తలుపు కొడితే తీయకండి.. చంపేసి డబ్బు, నగలు దోచుకుపోతారు..’ వంటి హెచ్చరికలతో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కొందరు వ్యక్తులను కొడుతున్నట్లు వీడియోలు... మరికొందరు చెట్టుకు కట్టేసి చావబాదుతున్న వీడియోలు జిల్లా ప్రజలను హడలుగొడుతున్నాయి. ఇవన్నీ అసత్య ప్రచారాలంటూ పోలీసులు కొట్టిపారేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలనే నమ్ముతూ భయం గుప్పెట్లోనే జిల్లా ప్రజలు వణికిపోతున్నారు.
తాజాగా పెరవలి మండలం కాకరపర్రులో ఒక మానసిక రోగిని పట్టుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తణుకు పాతవూరులో సైతం గత అర్ధరాత్రి సైకో సంచరిస్తున్నాడంటూ కొందరు యువకులు కర్రలు చేతపట్టుకుని పహారా ఉన్నారు. నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పట్టుకున్న గ్రామస్తులు అనుమానంతో వారిని పోలీసులకు అప్పగించారు. తాజాగా ఆదివారం తణుకులో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ భయంతో సమీపంలోని బాత్రూంలో దాక్కున్నాడు. గమనించిన స్థానికులు బయట తాళం వేసి సైకో అంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హల్‌చల్ చేస్తున్న వీడియోలు
జిల్లాలో ఇటీవల కాలంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సామాజిక వెబ్‌సైట్లలో కూడా వీడియోలు హల్ చేస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చివరికి ఎవరైనా కొత్తగా, అనుమానాస్పదంగా కనిపించినా వారిపై దాడి చేస్తున్నారు. బిచ్చగాళ్లు, మతిస్థిమితం లేని వాళ్లను సైతం పట్టుకుని అనుమానంతో విచారిస్తున్నారు. ఒక్కోసారి వారిని చితకబాది పోలీసులకు అప్పగిస్తున్నారు. ఇదిలా ఉంటే రాత్రి సమయాల్లో పిల్లలతో బయటకు రావడానికి సైతం జనం జంకుతున్నారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థమవుతోంది. మరోవైపు ఇటీవల పార్థిగ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్ బ్యాచ్‌లు తిరుగుతున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట వీరి జాడలు కనిపించడంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల తణుకు సమీపంలో విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన దోపిడీలో పార్థి గ్యాంగ్ ముఠా సభ్యులు పాల్గొన్నారనే ప్రచారం జరిగింది. అయితే పొరుగు రాష్ట్రాల్లో పోలీసులు దొంగలను పట్టుకున్న వీడియోలను పేర్లు మార్చి అన్ని జిల్లాల్లోనూ తిరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
విచక్షణ కోల్పోయి..
మతిస్తిమితం లేనివాళ్లు, పిచ్చివాళ్లు, బిచ్చగాళ్లు ఎక్కడైనా పిల్లలతో మాట్లాడినట్టు తెలిసినా, వారి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించినా మఠా సభ్యులే అనుకుని వారిని జనం విచక్షణారహితంగా చితక బాదేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, జమ్ము, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో జరిగిన సంఘటనల తాలూకు వీడియో క్లిప్పింగ్‌లను మన ప్రాంతాల్లో జరిగినట్టు కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో ఎక్కడ కొత్త వ్యక్తులు కనబడినా, మతిస్తిమితం లేనివారు కనబడినా స్థానికులు దాడులకు దిగుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఇలాంటి తరహా దాడులు జరగడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి వదంతులు నమ్మవద్దని, అలాంటి గ్యాంగులేవీ జిల్లాలో తిరగడంలేదని పోలీసులు ప్రచారం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో సూదిగాడు పేరుతో జిల్లాలో సంచరిస్తూ మహిళలపై జరిగిన దాడులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
పుకార్లు నమ్మవద్దు..
సైకోలు, దొంగలు తిరుగుతున్నారంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు మన ప్రాంతానికి చెందినవి కావు. ఎక్కడైనా అపరిచిత వ్యక్తులు కనబడితే సమీపంలోని పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదా వెంటనే 100 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి సమస్య పరిష్కరిస్తారు.–కేఏ స్వామి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, తణుకు
Comments
Please login to add a commentAdd a comment