పద్మమ్మ(ఫైల్)
మైలార్‌దేవ్‌పల్లి : మహిళను గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతంగా హత్య చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి పది గంటల ప్రాంతంలో శాస్త్రీపురం నిర్మాణుష్యా ప్రాంతంలోని జీహెచ్‌ఎంసీ పార్కులో మంటలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా మహిళ ముఖంపై బండరాయితో మోది హత్య చేసి ఉన్న ఆనవాళ్లు కనిపించాయి.
మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పటించారు. దీంతో వెంటనే పోలీసులు శాస్త్రీపురం చేరుకుని గుర్తు తెలియని మహిళ శవం ఫోటోలు తీసి రాత్రి నుంచి పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె ఆచూకీ కోసం వెతికారు. చివరకు శనివారం మధ్యాహ్నం మహిళ ఆరాంఘర్ గుడిసెల్లో నివాసం ఉండే తిరుపతి భార్య పద్మమ్మ(35)గా పోలీసులు గుర్తించారు. ఆరాతీయగా పోలీసులకు కొంత సమాచారం లభించింది. శుక్రవారం దానమ్మ హట్స్‌లోని కల్లు కాంపౌండ్‌లో తిరుపతి, పద్మమ్మ దంపతులతోపాటు తిరుపతి స్నేహితుడు శాస్త్రీపురంలో ఉండే విష్ణు.. ముగ్గురూ కలిసి కల్లు సేవించారు.
తిరుగు ప్రయాణంలో విష్ణు శాస్త్రీపురంలోని ఇళ్లల్లో పని చూపిస్తానని చెప్పి పద్మమ్మను తీసుకెళ్లి రాఘవేంద్ర కాలనీ వద్ద దింపాడు. కాగా పద్మమ్మ భర్త ఇంటికి వెళ్లిపోయాడు. విష్ణుతో వెళ్లిన తన భార్య హత్య చేయబడిందని విష్ణుపై తనకు అనుమానం ఉందని తిరుపతి పోలీసులకు చెప్పాడు. రాఘవేంద్ర కాలనీ పార్కు వద్ద సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి శంషాబాద్ డీసీపీ పద్మజ, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్‌కుమార్, మైలార్‌దేవ్‌పల్లి సీఐ జగదీశ్వర్‌లు చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment