సాక్షి, మణికొండ: భర్త తనను తరుచూ కొడుతున్నాడనే కారణంతో ఓ మహిళ తన నాలుగేళ్ల కుమారుడితో పాటు గండిపేట(ఉస్మాన్‌సాగర్) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు రాగా జలమండలి సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. నార్సింగి పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం..
మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల బిక్షపతికి అదే మండలం అజీజ్‌నగర్ గ్రామానికి చెందిన అనూష(24)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటికే బిక్షపతికి ఓ మహిళతో వివాహం జరగగా ఆమె అతని బాధలు భరించలేక మరొకరితో వెళ్లిపోయింది. రెండో వివాహం చేసుకున్నాక కూడా బుద్ది రాని సదరు బిక్షపతి వివాహం అయిన ఏడాది నుంచే అనూషను వేధించసాగాడు. దాంతో ఆమె అప్పట్లో మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండు వైపులా పెద్దవారు నచ్చచెప్పి కాపురానికి పంపారు. వారికి ఓ కుమారుడు పుట్టడంతో సమస్యలు సద్దుమణిగి నాలుగేళ‍్లుగా బుద్దిగానే ఉన్న బిక్షపతి ఇటీవల ప్రతిరోజు అకారణంగా ఆమెతో పాటు నాలుగు సంవత్సరాల కుమారుడు వినయ్‌ను చితకబాదుతున్నాడు.
ప్రస్తుతం అనూష మూడు నెలల గర్బవతి. తాను ఏ పని చేయకుండా గాలికి తిరగటంతో పాటు భార్యను తనకు మద్యం తాగేందుకు డబ్బులు తెచ్చి ఇవ్వాలని వేధిస్తూ కొడుతున్నాడు. అదే క్రమంలో మంగళవారం ఇద్దరినీ తీవ్రంగా కొట్టడంతో ఈ బాధలనుంచి విముక్తి చెందాలంటే చావే శరణ్యమని భావించి బుధవారం ఉదయం 11గంటల సమయంలో గండిపేట చెరువుకట్టపైకి కుమారునితో సహా వచ్చింది. అందరిమాదిరిగానే చెరువును చూసేందుకే వచ్చి ఉండవచ్చని అక్కడి సిబ్బంది ముందుగా భావించారు. అంతలోనే అమె కుమారునితో పాటు చెరువుకట్టపై వేసిన ఫెన్సింగ్ ఎక్కి చెరువులోకి దూకే ప్రయత్నం చేస్తుండటాన్ని గమనించిన అక్కడ పనిచేస్తున్న జలమండలి సిబ్బంది కె.సాయిబాబ, మునీర్‌లు హుటాహుటిన వెల్లి ఆమెను కాపాడి లేక్ పోలీసులకు అప్పగించారు. దాంతో వారు నార్సింగి పోలీస్‌స్టేసషన్‌కు తరలించి కేసు నమోదు చేసి వారి ఆత్మహత్యాయత్నానికి కారణమైన బిక్షపతిని రిమాండ్‌కు తరలించారు.
తోటి మహిళల ఆగ్రహం...
గర్బవతిగా ఉన్న భార్యతో పాటు నాలుగు సంవత్సరాల ముక్కుపచ్చలారని కుమారున్ని తరచూ కొట్టి వారు ఆత్మహత్య చేసుకునేందుకు సైతం తెగించేలా వ్యవహరిస్తున్న బిక్షపతి విషయం తెలుసుకుని గండిపేటకు రావటంతో అక్కడ జలమండలిలో పనిచేస్తున్న మహిళలతో పాటు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని వారు లేక్ పోలీస్‌స్టేషన్ ఎస్సై నాగేశ్వర్‌రావును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment