నైస్‌గా...వైస్‌కు ఎసరు
నైస్‌గా...వైస్‌కు ఎసరు
Published Fri, Jul 7 2017 11:35 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
– టీడీపీ నేతలను శాసిస్తున్న జంప్ జిలానీలు
– వైస్ చైర్మన్‌కు ఆపద్ధర్మ ఛాన్స్ దక్కకుండా కుతంత్రం
– చైర్మన్‌తోపాటు రాజీనామా చేయాలని వైస్‌పై ఒత్తిడి
– ఆపద్ధర్మ చైర్మన్‌గా ఏం చేస్తారోనని జ్యోతుల శిబిరంలో భయం
– రాజీనామా చేస్తే పదవికి ఎసరొస్తుందేమోనని నళినీకాంత్‌కు దడ
– ప్రాంతాల సమీకరణాలు తెరపైకొస్తే ఇబ్బందేనంటూ వైస్ శిబిరంలో ఆందోళన
– టీడీపీలో కంటగింపుగా మారిన పెద్దల యత్నాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఫిరాయింపుదారులకు టీడీపీ దాసోహమైపోతోంది. వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు జీ హుజూర్ అంటోంది. డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఎన్నికల్లో కష్టపడి గెలిచిన వాళ్లను పక్కన పెట్టి జంప్ జిలానీలకు పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే జెడ్పీ చైర్మన్ నామనకు సెగ పెట్టింది. ఇప్పుడేమో వైస్ చైర్మన్‌పై కన్నేసింది. వ్యూహమేంటో తెలియదు గాని చైర్మన్‌తోపాటు వైస్ చైర్మన్ కూడా రాజీనామా చేయాలని పార్టీ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. ఆపద్ధర్మ చైర్మన్ అవకాశాన్ని వైస్ చైర్మన్‌కు దక్కనివ్వకుండా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వైస్ ఆపద్ధర్మ చైర్మనైతే అనుకోని పరిణామాలు చోటుచేసుకుని ఏమవుతుందోనన్న భయం జ్యోతుల శిబిరానికి పట్టుకుంది. పెద్దల ఒత్తిడి మేరకు చైర్మన్‌తోపాటు తాను కూడా రాజీనామా చేస్తే తన పోస్టుకు ఎక్కడ ఎసరు వస్తోందనన్న భయం వైస్ చైర్మన్ నళినీ కాంత్‌కు పట్టుకుంది.
చైర్మన్‌తోపాటు వైస్ చైర్మన్‌కు సెగ
టీడీపీ చేసుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారం జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన కుమారుడు నవీన్‌కు జెడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టి సంతృప్తి పరచాలని నిర్ణయించింది. దీంతో నామనకు ఎసరు పెట్టారు. జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి చైర్మన్ పదవిని లాక్కుంటున్నారు. ఇష్టం లేకపోయినప్పటికీ అదిష్టానం ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకుంటున్నారు. దీంతో చైర్మన్ వివాదం సమసిపోయింది. తాజాగా వైస్ చైర్మన్ నళినీకాంత్ కూడా రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. చైర్మన్ రాజీనామా చేశాక ఆటోమెటిక్‌గా మళ్లీ ఎన్నిక జరిగే వరకు ఆపద్ధర్మ చైర్మన్‌గా వైస్ చైర్మన్ వ్యవహరించాల్సి ఉంటోంది. సాధారణంగా చైర్మన్ రాజీనామా చేసిన వెంటనే ఎన్నిక జరిగే అవకాశం ఉండదు. ఎన్నికల సంఘం మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి. దీనికి కొంత సమయం పడుతుంది. ఈలోపు వైస్ చైర్మన్‌కి అధికారాలొస్తాయి. ఈ అవకాశం వైస్‌కు దక్క కూడదని నళినీ కాంత్‌ను కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.
ఆపద్ధర్మ చైర్మన్‌గా చక్రం తిప్పుతారేమోనన్న భయమా
నామన రాజీనామా చేశాక పార్టీలో ఉన్న మిగతా పెద్దల సాయంతో ఆపద్ధర్మ చైర్మన్‌గా వైస్ చక్రం తిప్పి అనుకోని రాజకీయాలు చేస్తే ఎక్కడ ఇబ్బంది వస్తుందనే భయంతో జ్యోతుల శిబిరం వ్యూహాత్మక పావులు కదుపుతూ ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేను రంగంలోకి దించి వైస్‌పై ఒత్తిడి చేయిస్తున్నట్టు తెలిసింది. చైర్మన్‌తోపాటు రాజీనామా చేసేస్తే ఆ తర్వాత మళ్లీ ఎన్నికల్లో వైస్ చైర్మన్ అవుతావని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో వైస్ చైర్మన్ ఆచితూచి స్పందించడంతో జిల్లాకు చెందిన ఒక మంత్రి వద్దకు తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వద్దకు తీసుకెళ్లారు. ఆయన కూడా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. దీనికి వైస్ చైర్మన్ మధ్యేమార్గంగా స్పందిస్తున్నారు. మళ్లీ వైస్ చైర్మన్ చేస్తానని అదిష్టానం చేత హామీ ఇప్పించాలని తనను ఒత్తిడి చేస్తున్న పెద్దల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగానే వైస్ చైర్మన్ కూడా రాజీనామా చేసేందుకు అంగీకరించారని, ముహూర్తం పెట్టేసుకుందామని జ్యోతుల శిబిరం జిల్లాకు చెందిన మరో మంత్రి వద్దకు వెళ్లారు. అయితే వీరి ఆలోచనలకు భిన్నంగా సదరు మంత్రి స్పందించారు. చైర్మన్ ఎన్నికకు వైస్ చైర్మన్ రాజీనామా అవసరం లేదని చెప్పి షాకిచ్చినట్టు తెలిసింది. 9న రాజీనామా చేసేసి, 12 ఎన్నికవడం కుదరదని, ఎన్నికల సంఘంతో మాట్లాడి చెబుతానంటూ తనను కలిసిన నేతలకు హితబోధ చేశారు.
వలసలకు అంత విలువెందుకు...
దశాబ్దాలుగా జెండా మోసిన నేతల కన్న పార్టీలు మారిన నేతలకు దేశం పార్టీ అధిష్టానం అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తోందని మరో వర్గం మథనపడుతోంది. పరిస్థితి చివరికి ఎలా వచ్చిందంటే ఎవరు ఏ విధంగా వ్యవహరించాలన్నది కూడా ఫిరాయింపు నేతలే ఆదేశిస్తున్నారని వీరు వాపోతున్నారు.
Advertisement
Advertisement